దేశంలో తొలిసారి: జనాభా లెక్కల డిజిటలైజేషన్ -బీజేపీ సహా అన్ని పార్టీలూ కోరినా కుల గణనకు మాత్రం కేంద్రం నో

దేశంలో జనాభా లెక్కలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక విషయాన్ని వెల్లడించింది. కరోనా కారణంగా ఆలస్యంగా చేపడుతోన్న జన గణన ఈసారి ప్రత్యేకంగా ఉండబోతున్నది. 2021 జన గణన.. డిజిటలైజ్ అయ్యే తొలి జనాభా లెక్కలు కాబోతున్నాయి. దీనిలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ మంగళవారం లోక్ సభకు తెలియజేసింది. అయితే బీజేపీ సహా అన్ని పార్టీలూ గట్టిగా డిమాండ్ చేస్తున్నప్పటికీ, కుల పరమైన జనాభా లెక్కింపునకు మాత్రం కేంద్రం నిరాకరింస్తుండటం గమనార్హం.

ఓబీసీ బిల్లుగా ప్రాచుర్యంలో ఉన్న 127వ రాజ్యాంగ సవరణ బిల్లు -2021కు మంగళవారం పార్లమెంటు ఆమోదం తెలిపిన సందర్భంలో బీజేపీ సహా అన్ని పార్టీలూ కుల గణన చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. అదే సమయంలో మరో ప్రశ్నకు బదులుగా 2021 జనాభా లెక్కలను డిజిటలైజ్ చేయబోతున్నట్లు కేంద్రం వెల్లడించింది. మొత్తం వివరాలివి..

In a first, Census 2021 to be digital, says centre, MPs across parties demand caste census

కరోనా విలయం, బీజేపీ సర్కారు తెచ్చిన ఎన్ఆర్సీ, సీఏఏ చట్టాల నేపథ్యంలో 2021 జనాభా లెక్కల సేకరణ గతంతో పోల్చుకుంటే భిన్నంగా ఉంటుందా? ఏమైనా మార్పులు ఉంటాయా? ఏదైనా అదనపు సమాచారం అవసరమవుతుందా? అని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించగా, ఆయనకు కేంద్ర హోం శాఖ ఇవాళ బదులిచ్చింది. ఓబీసీ బిల్లుకు ఆమోదం సందర్భంగా అన్ని పార్టీలూ కుల గణనకు పట్టుపట్టిన నేపథ్యంలో అదే అంశానికి సంబంధించి కూడా కేంద్రం క్లారిటీ ఇచ్చినట్లయింది..

దేశంలో జనాభా లెక్కలు 2021కి సంబంధించిన సమాచార సేకరణ కోసం మొబైల్ యాప్‌ను రూపొందించినట్లు కేంద్రం తెలిపింది. జన గణనకు సంబంధించిన వివిధ అంశాల నిర్వహణ, పర్యవేక్షణల కోసం సెన్సస్ పోర్టల్‌ను అభివృద్ధిపరచినట్లు పేర్కొంది. ఈ పోర్టల్‌లో లాగిన్ కావాలంటే వ్యక్తుల మొబైల్ ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు అవసరమని తెలిపింది. సొంతగా వివరాలు ఇవ్వడం, అంటే..

2021 జనాభా లెక్కల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ కోసం ఆయా వ్యక్తులు కొన్ని వివరాలను సమర్పించవలసి ఉంటుందని కేంద్ర హోం శాఖ పేర్కొంది. దరఖాస్తులోని ఖాళీలలో ఈ వివరాలను నింపవలసి ఉంటుందని, ప్రతిదానికి సంబంధిత కోడ్ ఉంటుందని పేర్కొంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ తర్వాత ఆ వ్యక్తి ఇచ్చిన రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు ఐడెంటిఫికేషన్ నంబరును పంపుతామని పేర్కొంది. ఈ సమాచారాన్ని అధికారులు సమన్వయపరిచేందుకు ఈ ఐడెంటిఫికేషన్ నంబరును తెలియజేయాలని చెప్పింది.

ఈ సమాచారాన్ని జాతీయ పౌరుల జాబితా (ఎన్ఆర్‌సీ) వంటి ఇతర డేటాబేస్‌లను తయారు చేయడానికి ఉపయోగించబోమని వివరించింది. జనాభా లెక్కల సేకరణ చట్టం, 1948 ప్రకారం సేకరిస్తున్న ఈ సమాచారాన్ని బహిరంగంగా వెల్లడించేది లేదని పేర్కొంది. కులాలవారీగా సమాచారాన్ని ఈ దశలో వెల్లడించే ప్రతిపాదన లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ చెప్పారు. అయితే, కుల గణన చేపట్టబోమని కేంద్రం చెబుతున్నప్పటికీ దాని కోసం అన్ని పార్టీలు ఇవాళ గొంతుకను వినిపించాయి..

కులం ప్రాతిప‌దిక‌న జ‌నాభాను లెక్కించాల‌ని ఇవాళ ప‌లు పార్టీలు లోక్‌స‌భ‌లో డిమాండ్ చేశాయి. ఓబీసీ బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా ప‌లువురు ఎంపీలు ఈ అంశాన్ని ప్ర‌స్తావించారు. కుల గ‌ణ‌న చేయ‌కుంటే.. యూపీలో బీజేపీకి ఓట‌మి ఖాయ‌మ‌ని ఎస్పీ ఎంపీ అఖిలేశ్ యాద‌వ్ అన్నారు. బిల్లు సంద‌ర్భంగా స‌మాజ్‌వాదీ పార్టీ నేత మాట్లాడుతూ.. ఓబీసీ బిల్లుకు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు తెలిపారు. రిజ‌ర్వేష‌న్ కోటాపై ఉన్న 50 శాతం సీలింగ్‌ను తొల‌గించ‌కుండా.. ఎలా ఓబీసీ బిల్లును పాస్ చేస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అత్య‌ధిక సంఖ్య‌లో ఎంపీల‌ను కూర్చోబెట్టేందుకు సెంట్ర‌ల్ విస్టాను క‌డుతున్నార‌ని, కానీ ఓబీసీలు.. ద‌ళితులు, మైనార్టీల‌ను ఎందుకు 50 శాతం కోటాకే క‌ట్టిప‌డేస్తున్నార‌ని అఖిలేశ్‌ అడిగారు. ఓ ఓబీసీని సీఎం చేస్తార‌ని హామీ ఇచ్చి.. యూపీలో క్ష‌త్రియుడిని సీఎం చేశార‌ని విమ‌ర్శించారు. కుల గ‌ణ‌న‌ను చేప‌ట్టి, ఆ వివ‌రాల‌ను బ‌హిర్గ‌తం చేయాల‌ని అఖిలేశ్ డిమాండ్ చేశారు.

కులం ప్రాతిప‌దిక‌న జ‌నాభా లెక్కించాల‌ని ఎంపీ బీ చంద్ర‌శేఖ‌ర్ డిమాండ్ చేశారు. ఓబీసీ బిల్లుకు మ‌ద్ద‌తు ఇచ్చిన ఆయ‌న‌.. అఖిల భార‌త వైద్య విద్య‌లో ఓబీసీ కోటా లేద‌ని గుర్తు చేశారు. నాలుగేళ్ల త‌ర్వాత ప్ర‌భుత్వం మ‌ళ్లీ ఆ కోటాను తెచ్చింద‌ని, దానికి కృత‌జ్ఞ‌త చెబుతున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఇదే స‌మ‌యంలో కుల గ‌ణ‌న కూడా చేప‌ట్టాల‌ని ఆయ‌న ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీలు సైతం కులగణనకు అనుకూలంగా సభలో నినాదాలు చేశారు. బీజేపీ మిత్రపక్షాలు సైతం కుల గణనకు పట్టుపట్టినా ఫలితం లేకుండా పోయింది..

జనాభా లెక్కల నేపథ్యంలో కుల గణన కూడా చేపట్టాలని, కులాలవారీగా జనాభా లెక్కలను సేకరించాలని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ ఇటీవల కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నిరుపేదల సంక్షేమానికి తగిన పథకాలు రూపొందించడానికి కులగణన సహకరిస్తుందని, ఎస్సీ, ఎస్టీలు తప్ప ఇతర వెనుకబడిన వర్గాల వారీగా లెక్కలు సేకరించబోమని కేంద్రం పార్లమెంటులో స్పస్టం చేసిన దరిమిలా ఆయన తన గొంతుకను వినిపించారు. కుల గణన కోసం 2019, 2020ల్లో బిహార్‌ అసెంబ్లీలో తీర్మానాలు చేసినట్టు నితీశ్ గుర్తుచేశారు. మరోవైపు,

ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష పార్టీ బీఎస్పీ (బహుజన సమాజ్ పార్టీ) అధినేత్రి మాయావతి సైతం కుల గణనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుల గణన విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటే పార్లమెంటులో, బయట మోడీ సర్కారుకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని ఆమె ప్రకటించడం సంచలనం రేపింది. ''దేశంలో ఓబీసీ జన గణన చేట్టాల్సిందిగా బీఎస్సీ డిమాండ్ చేస్తోంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ఏవైనా చర్యలు తీసుకుంటే మా పార్టీ కచ్చితంగా పార్లమెంటు లోపల, బయట కూడా మద్దతుగా నిలుస్తుంది" అని మయావతి ఇటీవలే ఓ ట్వీట్ చేశారు. బీజేపీకి మద్దతు ఇస్తాననడంపై మాయావతిని పలువురు విమర్శించినప్పటికీ ఆమె తన మాటను వెనక్కి తీసుకోకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే,

2021 జనాభా లెక్కలపై సందేహాలు నివృత్తి చేసిన కేంద్ర హోం శాఖ అదే సమయంలో దేశ‌వ్యాప్తంగా నేష‌న‌ల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియ‌న్ సిటిజెన్స్ (ఎన్ఆర్సీ)ని రూపొందించే అంశంపైనా క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికి అస్సాంలో మాత్రమే అమలైన ఎన్నార్సీని దేశమంతటా వర్తింపజేసే ప్రక్రియపై ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని కేంద్ర హోంశాఖ మంగ‌ళ‌వారం లోక్‌స‌భ‌కు చెప్పింది.

పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం లేదా సీఏఏకి నిబంధ‌న‌లు రూపొందించ‌డానికి మ‌రో ఆరు నెల‌ల స‌మ‌యం కావాల‌ని కోరిన‌ట్లు గ‌త నెల పార్ల‌మెంట్‌కు చెప్పింది హోంశాఖ‌. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 9 వ‌ర‌కూ దీనికి స‌మ‌యం ఉంది. ఇక మ‌రోవైపు దేశంలో ఉన్న రోహింగ్యా ముస్లింలు చ‌ట్ట‌విరుద్ధ‌మైన కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డున్న‌ట్లు వ‌స్తున్న రిపోర్టుల గురించి కూడా హోంశాఖ‌ లోక్‌స‌భ‌కు వివ‌రించింది.

దీనికి సంబంధించి ఇప్ప‌టికే రాష్ట్రాల‌కు కేంద్రం సూచ‌న‌లు జారీ చేసింది. దేశంలోకి అక్ర‌మంగా చొర‌బ‌డిన వాళ్ల‌ను గుర్తించ‌డం, వాళ్ల‌ను కొన్ని ప్రాంతాల‌కే ప‌రిమితం చేయ‌డం, వాళ్లు బ‌యోగ్ర‌ఫిక్‌, బయోమెట్రిక్ వివ‌రాల‌ను సేక‌రించ‌డం, వాళ్ల ద‌గ్గ‌ర ఉన్న న‌కిలీ భార‌త ధృవ‌ప‌త్రాల‌ను ర‌ద్దు చేయ‌డం, వాళ్ల‌ను దేశం నుంచి పంపించేయ‌డంపై సూచ‌న‌లు చేసిన‌ట్లు హోంశాఖ తెలిపింది. అక్ర‌మ వ‌ల‌స‌దారుల బ‌యోగ్ర‌ఫిక్‌, బ‌యోమెట్రిక్ వివ‌రాల‌ను అధికారులు సేక‌రిస్తున్న‌ట్లు, వాళ్ల‌ను దేశం నుంచి పంపించే ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తొలిసారి హోంశాఖ వెల్ల‌డించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+