సరిహద్దులో మళ్లీ డ్రోన్ కలకలం -బీఎస్ఎఫ్ కాల్పులతో పాక్ వైపునకు -జమ్మూకాశ్మీర్‌లో హై అలర్ట్
అఫ్గానిస్థాన్ లో తాలిబన్ కల్లోలంపై భారత ప్రభుత్వం దృష్టిసారించిన సమయంలోనే, దాయాది పాకిస్తాన్ వైపు నుంచి కవ్వింపులు ఎదురవుతున్నాయి. ఇండియాతో సయోధ్యలో భాగంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటిస్తోన్న పాకిస్తాన్ తనకు బాగా అలవాటైన దొడ్డిదారిని మరోసారి ఆశ్రయించింది. దొంగచాటుగా డ్రోన్లను భారత్ లోకి పంపేందుకు పాక్ చేసిన ప్రయత్నాన్ని భారత బలగాలు బలంగా తిప్పికొట్టాయి..
భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల్లో అనుమానాస్పద డ్రోన్ల కదలికలు కలవరపెడుతున్నాయి. జమ్మూలోని ఆర్నియా సెక్టార్‌లో ఇంటర్నేషనల్ బోర్డర్(ఐబీ) వద్ద సోమవారం తెల్లవారు జామున 5.30 గంటల సమయంలో డ్రోన్ దూసుకొచ్చింది. ఆకాశంలో ఎరుపు, పసుపు రంగుల్లో ఓ వస్తువు మెరుస్తున్నట్టు గుర్తించిన బలగాలు.. అది పాక్ డ్రోన్ అని నిర్ధారించుకున్న వెంటనే అప్రమత్తమయ్యారు..

పాక్ డ్రోన్ ను నేల కూల్చేందుకు బీఎస్ఎఫ్ బలగాలు ప్రయత్నించాయి. మన వాళ్లు 25 రౌండ్లు కాల్పులు జరిపగా.. ఆ డ్రోన్ మరింత పైకి ఎగిరి తిరిగి పాక్ భూభాగంలోకి జారుకుంది. ఈ విషయాన్ని బీఎస్ఎఫ్ అధికారులు మీడియాకు తెలిపారు. డ్రోన్ కదలికల తర్వాత.. స్థానిక పోలీసుల సహకారంతో బీఎస్ఎఫ్ బలగాలు ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. అయితే, ఆ ప్రాంతంలో గాలింపు చర్యల్లో ఇంతవరకు ఏమీ గుర్తించలేదని బీఎస్‌ఎఫ్ డీఐజీ ఎస్‌పీఎస్ సంధు వెల్లడించారు.
జమ్మూలోని భారత వాయుసేన బేస్ లక్ష్యంగా జూన్ 27న వచ్చిన డ్రోన్ ఘటన అనంతరం ఆర్నియా సెక్టార్‌లో ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కావడం గమనార్హం. జులై 24న ఐదు కిలోల పేలుడు పదార్థాలతో పాక్‌కు చెందిన ఓ డ్రోన్‌ను అక్నూరు సెక్టార్‌లో గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఇది పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల పనేనన్న కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్.. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేస్తోందని తెలిపారు. 2019 నుంచి పాక్ సరిహద్దులో 350కి పైగా అనుమానాస్పద డ్రోన్లను భద్రతా బలగాలు గుర్తించాయి.












Click it and Unblock the Notifications