2024 ఎన్నికలూ అక్రమమే- సీఈసీ జ్ఞానేష్ తప్పుకున్నా వదిలిపెట్టం- రాహుల్ వార్నింగ్..!
2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికలూ అక్రమమేనని, దేశంలో జరుగుతున్న ఓట్ల దొంగతనానికి బాధ్యుడైన సీఈసీ జ్ఞానేష్ కుమార్ త్వరలోనే ఇంటికెళ్లడం ఖాయమని, అయినా ఆయన్ను వదిలిపెట్టబోమని విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) హెచ్చరించారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ అక్రమాలకు వ్యతిరేకంగా ఇవాళ రాంలీలా మైదానంలో విపక్ష ఇండియా కూటమి నిర్వహిస్తున్న భారీ బహిరంగసభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. మీరు నరేంద్ర మోదీకి, అమిత్ షాలకు ఒక సందేశాన్ని పంపాలనుకున్నారు, ఆ సందేశం చేరిపోయిందని సభకు హాజరైన వారిని ఉద్దేశించి రాహుల్ వ్యాఖ్యానించారు.
ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీ గళం కాదని, ఇది భారతీయ యువత, రైతులు, ప్రజల గళం అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతం కానివ్వబోమని ఇది స్పష్టం చేస్తోందన్నారు. మీరు మిమ్మల్ని మీరు గొప్పవారిగా భావించవచ్చని, మీ దగ్గర డబ్బు ఉండవచ్చు, కానీ మీరు రాజ్యాంగం కంటే గొప్పవారు కాదని, రాజ్యాంగమే మీకంటే గొప్పదని ప్రధాని మోడీని ఉద్దేశించి రాహుల్ విమర్శలు గుప్పించారు.
ఇది సాధారణ దొంగతనం కాదని, ఎవరైనా దుకాణం నుంచి ఏదైనా వస్తువును దొంగిలించడం వంటిది కాదని, ఇది ప్రతి ఒక్కరి గళాన్ని దొంగిలించడం అన్నారు. చట్టపరమైన పరిభాషలో చెప్పాలంటే, ఇది అత్యంత అరుదైన కేసు (రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్) అన్నారు. దీనిని దేశద్రోహం అని పిలవవచ్చన్నారు. జ్ఞానేష్ కుమార్ లేకపోతే, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యేవారు కాదన్నారు. అమిత్ షా హోంమంత్రి అయ్యేవారు కాదన్నారు.

మీరు శివ్ కీ బారాత్ గురించి విని ఉంటారని, అక్కడికి ఎవరైనా వెళ్లవచ్చని, ఆ తాండవంలో ఎవరైనా నృత్యం చేయవచ్చని, ఎవరైనా వెళ్లగలిగే భారతదేశాన్ని తాము కోరుకుంటున్నామన్నారు. దేశాన్ని సరైన మార్గంలో ఉంచడానికి మొదటి అడుగు జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడమే అన్నారు. నరేంద్ర మోదీ ఎక్కడికీ వెళ్లరని అమిత్ షా అంటున్నారని, కానీ, ఆయనను ఎక్కడికీ వెళ్లనివ్వబోమని తాను హామీ ఇస్తున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు . జ్ఞానేష్ కుమార్ తర్వాత, మీ వంతు వస్తుంది. మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ ప్రధాని మోడీని హెచ్చరించారు.













Click it and Unblock the Notifications
