శశికళ నుంచి 'విముక్తి': పదవులపైనే పళని, పన్నీర్ కుస్తీ

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

చెన్నై: తాజాగా అన్నాడీఎంకేలోని రెండు వర్గాల విలీనం దిశగా వడివడిగా అడుగులు పడుతున్న వేళ ప్రధాన పదవుల పంపకంపై ప్రతిష్ఠంభన ఏర్పడింది. వీటిపై మాజీ సీఎం ఓ పన్నీర్‌ సెల్వం, సీఎం ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్‌) వర్గాల మధ్య బుధవారం ఎడతెగని చర్చలు జరిగినట్టు సమాచారం.

సీఎం పదవితోపాటు, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కూడా తమకే కేటాయించాలని, పళనిస్వామిని డిప్యూటీ సీఎంని చేస్తామని పన్నీర్ సెల్వం వర్గం.. అదేం కాదు పన్నీర్‌కు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని అప్పజెప్పుతామని, సీఎం పదవిని పళనిస్వామికే వదిలేయాలని పళనిసామి వర్గం పట్టుపట్టి కూర్చున్నాయి.

ఈ అంశంపై గురువారం మరో దఫా రెండు వర్గాల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈలోగా చర్చలు కొనసాగింపునకు రెండు వర్గాలు పరస్పర అంగీకారంతో ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశాయి.

పళని సీఎం పదవికి ఎసరు?

పళని సీఎం పదవికి ఎసరు?

ఈ నేపథ్యంలో ఇప్పటికే మూడుసార్లు సీఎంగా పనిచేసిన పన్నీర్‌సెల్వం, ప్రస్తుతం పదవిలో ఉన్న పళనిస్వామి ఎవరో ఒకరు పదవీ త్యాగం చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇరువర్గాల రాజకీయ భవిష్యత్ దృష్ట్యా ముఖ్యమంత్రి కుర్చీ కీలకం కావడంతో త్వరలో జరగనున్న విలీన చర్చలపైనే రాష్ట్ర ప్రభుత్వ మనుగడ ఆధారపడి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా సాధ్యమైనంత త్వరగా విలీన ప్రక్రియ ముగించేందుకు పన్నీర్‌సెల్వం, పళనిస్వామి వర్గాలు పావులు కదుపుతున్నాయి. మంగళవారంరాత్రి దినకరన్ కుటుంబం మొత్తాన్ని పార్టీ నుంచి వెలివేస్తున్నట్లు అన్నాడీఎంకే నేతలు ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో శశికళకు కూడా పార్టీకి సంబంధం లేకుండాపోయింది.

అన్నాడీఎంకే బలోపేతంపై దినకరన్ ఇలా

అన్నాడీఎంకే బలోపేతంపై దినకరన్ ఇలా

మరోపక్క వివాదాలకు కేంద్రబిందువుగా మారిన టీటీవీ దినకరన్‌ పార్టీ వ్యవహరాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. తాను పార్టీకి భారం కాబోనని, పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. అన్నాడీఎంకే పెద్దసంఖ్యలో కార్యకర్తలు కలిగిన పార్టీ అని, వారి కోరిక మేరకు నడుచుకోవడం తన బాధ్యతన్నారు. దినకరన్‌ విలేకరులతో మాట్లాడుతూ ఆర్కేనగర్‌ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికలో తాను పోటీ చేయబోనని స్పష్టం చేశారు. తనకు పార్టీలో ప్రత్యర్థులు, వ్యతిరేకులు లేరని చెప్పారు. తన బలాన్ని నిరూపించుకోవడానికి పార్టీని బలహీనపరచబోనని తెలిపారు. పార్టీ కార్యాలయంలో బుధవారం తన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యేందుకు దినకరన్‌కు అనుమతి ఇచ్చేందుకు పార్టీ ప్రిసీడియం చైర్మన్‌ సెంగోట్టయ్యన్‌ అనుమతి నిరాకరించారు. పార్టీ కార్యాలయంలో శశికళ, దినకరన్‌ చిత్రపటాలను కూడా తొలగించారు.

పన్నీర్‌పై తంబిదురై ఇలా

పన్నీర్‌పై తంబిదురై ఇలా

శశికళ, దినకరన్‌ వారంతట వారే పార్టీ నుంచి వైదొలుగుతారని లోక్‌సభ ఉపసభాపతి తంబిదురై స్పష్టం చేశారు. శశికళ, దినకరన్ నుంచి ‘విముక్తి' పొందిన అన్నాడీఎంకేలోని ఇరువర్గాల నేతలు ఏకతాటిపైకి వచ్చేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. పన్నీర్ సెల్వం తనకు సీఎం పదవి కేటాయించాలని కోరలేదని తంబిదురై పేర్కొనడం గమనార్హం.

జయ సమాధి సాక్షిగా విలీనం?

జయ సమాధి సాక్షిగా విలీనం?

ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం సీఎం ఎడప్పాడి కొందరు మంత్రులతో భేటీ అయి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పన్నీర్ సెల్వంతో సాధ్యమైనంత త్వరగా విలీనంపై చర్చించాలని పురమాయించారు. పన్నీర్ సెల్వం కూడా తన నివాసంలో కొంతమంది నేతలతో భేటీ అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తన వర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలతో గురువారం చర్చించి విలీనంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దివంగత మాజీ సీఎం జయలలిత సమాధి సాక్షిగా శశికళపై ఓపీఎస్‌ తిరుగుబావుటా ఎగురవేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే సమాధిసాక్షిగా అన్నాడీఎంకేలో విలీనం కావాలని పన్నీర్ సెల్వం వర్గం భావిస్తోంది.

పన్నీర్‌ను పొగిడేస్తున్న మంత్రులు

పన్నీర్‌ను పొగిడేస్తున్న మంత్రులు

కాగా, జయ అనుచరుడిగా, ఆమెకు విశ్వాసపాత్రుడిగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న పన్నీర్ సెల్వంనే సీఎం పీఠంపై కూర్చోబెట్టడం మంచిదని, డిప్యూటీ సీఎంగా పళనిసామి ఉండాలని పార్టీ పెద్దలు సూచించడంతో ఇరువర్గాలు పునరాలోచనలో పడినట్లు సమాచారం. మంత్రుల్లో మెజారిటీ సభ్యులు కూడా ఇదేవిధంగా అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, అన్నాడీఎంకేలోకి తిరిగి పన్నీర్ సెల్వం రావడం ఖాయమని తేలిపోవడంతో మంత్రుల స్వరం పూర్తిగా మారిపోయింది. పన్నీర్ విశ్వాసానికి ప్రతీక అంటూ పొగిడేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Line clear for merger of Two Anna DMK fractions. Today Panner and Palani Swamy groups once again go for talks, both sides stiff on CM post
Please Wait while comments are loading...