
బ్రిటన్ ప్రధాని రేసులో ఇన్పోసిస్ నారాయణమూర్తి అల్లుడు.. రిషి సునక్, నేపథ్యం ఇదే..
బ్రిటన్ ప్రధాని పదవీకి బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడం ఖాయం.. ఇందులో సందేహానికి తావులేదు. మరీ తదుపరి ప్రధాని ఎవరు అనే చర్చ మొదలైంది. ఆ రేసులో రిషి సునక్ ఉన్నారు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి- సుధామూర్తి కూతురు అక్షత మూర్తితో రిషి సునక్‌కి పెళ్లి జరిగింది. ఆయన నేపథ్యం గురించి తెలుసుకుందాం.. పదండి..?

రిషి సునక్ నేపథ్యం
రిషి సునక్ తండ్రి నేషనల్ హెల్త్ సర్వీస్ జనరల్ ప్రాక్టిషనర్, తల్లి ఫార్మాసిస్ట్. రిషి సునక్ ఆక్స్ ఫర్డ్, స్టాన్ ఫోర్డ్ వర్సిటీల్లో డిగ్రీ పూర్తిచేశారు. నారాయణ మూర్తి కూతురిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి కృష్ణ, అనౌష్క అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 2015లోనే అతను ఎంపీగా ఎన్నికయ్యాడు. రిచ్ మండ్, యార్క్ షైర్ నుంచి ప్రాతినిధ్యం వహించాడు. 2020లో జీవితంలో మైలురాయిగా నిలిచింది. బ్రిటన్ క్యాబినెట్‌లో కీలకమైన ఆర్థికమంత్రి పదవీ చేపట్టారు. ఆయనను బోరిస్ జాన్సన్ ఏరికోరి క్యాబినెట్ లోకి తీసుకువచ్చారు. ఆర్థికశాఖను సమర్థంగా నిర్వర్తించారు.

పదవీకి రాజీనామా
బోరిస్ జాన్సన్ చర్యలతో తీవ్ర అసంతృప్తితో రిషి సునక్ ఉన్నారు. దీంతో కొద్దిరోజుల కింద పదవీకి రాజీనామా చేశారు. సునక్ బాటలో పలువురు క్యాబినెట్ సహచరులు నడిచారు. దీంతో బోరిస్ జాన్సన్ పై ఒత్తిడి పెరిగింది. 40 మంది వరకు మంత్రులు క్యాబినెట్ వీడారు. వీరంతా కూడా రిషి సునక్ నాయకత్వానికి మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయి. కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్లో రిషిపై సానుకూలత ఉంది. అక్టోబరు నుంచి రిషి సునక్ ప్రధాని పీఠం అధిష్టించే అవకాశం ఉంది. బ్రిటన్ ప్రధాని అయిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు. కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు బోరిస్ జాన్సన్ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారు.

ఇదీ ప్రతికూలత..
రిషి సునక్‌కు ఒక్క అంశం ప్రతికూలత కనిపిస్తోంది. ఇటీవల ఆయన భార్య అక్షత మూర్తిపై పన్ను ఎగవేత ఆరోపణలు వచ్చాయి. ఆమె భారత్‌కు చెందిన మహిళ కావడంతో ఆమె నాన్ డొమిసైల్ హోదాలో బ్రిటన్‌లో ఉంటున్నారు. భారత పౌరసత్వం మాత్రమే ఉండడంతో బ్రిటన్‌లో నాన్ డొమిసైల్ పన్ను హోదా కల్పిస్తారు. నాన్ డొమిసైల్ హోదా ఉన్న వారు విదేశీ గడ్డపై సంపాదించే సొమ్ముకు పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. అక్షత మూర్తి పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారని బ్రిటన్ విపక్షాలు ఆరోపించాయి. అక్షతపై ఆరోపణలు రాజకీయ కుట్రలో భాగమేనని రిషి సునక్ వర్గం ఎదురుదాడికి దిగింది.

అపద్ధర్మ ప్రధానిగా బోరిస్..?
కుంభకోణాలు, నేతల తిరుగబాటుతో బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తలగ్గొక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రధానమంత్రి పదవీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. గత 48 గంటల్లో దాదాపు 40 మంది మంత్రులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇంటా బయట విమర్శలు రావడంతో జాన్సన్.. పదవీ నుంచి వైదొలుగుతానని స్పష్టంచేశారు. ఈ మేరకు గార్డియన్ రిపోర్ట్ చేసింది. అతని ప్రభుత్వంలో స్కామ్స్, నేతల తిరుగుబాటుతో.. జాన్సన్ ప్రధాని పదవీకి అర్హుడు కాదని మంత్రులు అంటున్నారు. అయితే ఈ ఏడాది అక్టోబర్ వరకు అతను ప్రధాని పదవీలో ఉంటారని తెలుస్తోంది. ఆ సమయంలో కొత్త నేతను ఎన్నుకుంటారని కన్జర్వేటివ్ పార్టీ ఇదివరకే తెలిపారు. అతని వారసుడిగా రిషి సునక్ నియమించే అవకాశాలు ఉన్నాయి.