వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హీట్‌వేవ్: పర్యావరణ మార్పుల వల్ల మనం ఎదుర్కొంటున్న 4 పెను సమస్యలు..

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
భారత్, పాకిస్తాన్ లోని కొన్ని ప్రాంతాలలో అధిక వేడి ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు హీట్‌వేవ్ ప్రభావాన్ని అనుభవిస్తున్నాయి. అంతకు ముందు భయానకమైన వరదలు, కార్చిచ్చుల ఘటనలు కూడా అనేకం జరిగాయి. వాయవ్య భారత్‌తోపాటు పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలు 50 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలను చూడబోతున్నాయి.

పారిశ్రామిక విప్లవం ప్రారంభం నుంచి పెట్రోలు, డీజీల్, బొగ్గు, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాలను మండించడం వల్ల ఏర్పడే ఉద్గారాలు వాతావరణంలో వేడిని పెంచాయి. పర్యవసానంగా సగటు ఉష్ణోగ్రతలు 1.1డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగాయి.

అదనంగా పుట్టుకొచ్చిన ఈ వేడి కారణంగా భూమిపై అనూహ్యమైన ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు మన కళ్ల ముందు కనిపిస్తున్న వైపరిత్యాలు అందులో భాగమే. ఈ ఉద్గారాలను తగ్గించకపోతే ఈ పరిణామాలు ఇలాగే కొనసాగుతాయి.

విపరీతమైన వాతావరణ మార్పులకు కారణమవుతున్న నాలుగు కీలక అంశాలు ఇవి.

1.తీవ్రమైన, సుదీర్ఘమైన వేసవి

సగటు ఉష్ణోగ్రతలకు చిన్న మార్పుల ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి వాటిని బెల్ కర్వ్‌గా భావించుకోండి. దానికి ఇరువైపులా విపరీతమైన చలి, విపరీతమైన వేడి, మధ్యలో మధ్యస్థ ఉష్ణోగ్రతలు ఉంటాయి.

ఒక చిన్న మార్పు అంటే ఎగువ వక్రరేఖ అధిక వాతావరణ పరిస్థితులవైపు మొగ్గితే హీట్‌వేవ్‌లు మరింత తరచుగా వస్తుంటాయి.

గత యాభై సంవత్సరాలలో వేడి వాతావరణ పరిస్థితులు రెట్టింపు అయ్యాయని యూకే వాతావరణ శాఖ వెల్లడించింది. హీట్‌వేవ్‌లు మరింత వేడిగా, తీవ్రంగా ఉండే మరో వాతావరణ పరిస్థితి కూడా ఉంది. దానినే హీట్ డోమ్ అంటారు.

అధిక పీడనం ఉన్న ప్రాంతాలో వేడి గాలి నిలిచిపోతుంది. దీనివల్ల ఆ ఖండం మొత్తం ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతాయి.

వేగంగా సాగే గాలుల కారణంగా ఏర్పడే జెట్ స్ట్రీమ్‌లను తుపానులు అడ్డుకున్నప్పుడు, స్కిప్పింగ్ తాడులా అలలు ఏర్పడతాయి. ఈ అలలు వాతావరణాన్ని స్తంభింపజేస్తాయి. దీంతో ఆ వాతావరణ పరిస్థితులు ఒకేచోట రోజుల తరబడి ఉండిపోతాయి.

కార్చిచ్చులు భయానక పరిస్థితులను సృష్టిస్తున్నాయి

ఇలాంటి పరిణామాల కారణంగా భారత్, పాకిస్తాన్ లలో అత్యధిక ఉష్ణోగ్రతలకు కారణమవుతున్నాయి. అధిక పీడనం కొనసాగడం, తక్కువ వర్షాలు కురవడం వల్ల 122 సంవత్సరాల తర్వాత మార్చి నెల అత్యధిక ఉష్ణోగ్రతలను నమోదు చేసింది.

పాకిస్తాన్ లోని కరాచీ నగరంలో చరిత్రలోనే అత్యంత వేడిగల మార్చి నెలను నమోదు చేసింది. ఈ హీట్‌వేవ్ ఏప్రిల్ లో కూడా కొనసాగడంతో పాకిస్తాన్ లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ దేశంలోని జకోబాబాద్ నగరంలో 49 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదు కావడమే కాక, భారత దేశంలోని మధ్య, వాయవ్య ప్రాంతాలు కూడా ఈ అధిక ఉష్ణోగ్రతలను నమోదు చేశాయి.

ఈ వారాంతం, మరుసటి వారాలలో ఈ ఉష్ణోగ్రతలు ఈ రీజియన్‌లోని కొన్ని ప్రాంతాలలో 50 డిగ్రీలు దాటవచ్చని యూకే మెట్రాలజీ డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది. ఈ ఉష్ణోగ్రతలు ప్రతియేడాది ఇదే సమయంలో నమోదయ్యే సరాసరి ఉష్ణోగ్రతలలో ఇది దాదాపు 5-7 డిగ్రీలు అధికం.

దక్షిణార్ధగోళంలోని అర్జెంటీనా, ఉరుగ్వే, పరాగ్వే, బ్రెజిల్ దేశాలు జనవరిలో చరిత్రాత్మక హీట్‌వేవ్‌లను చవి చూశాయి. చాలా ప్రాంతాలలో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే నెలలో పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఓన్స్లో లో 50.7 డిగ్రీల సెంటిగ్రేడ్ రికార్డయింది.

గత సంవత్సరం ఉత్తర అమెరికా చాలా రోజులపాటు వేడిగాలులతో ఇబ్బంది పడింది. పశ్చిమ కెనడాలోని లిట్టన్‌లో ఉష్ణోగ్రతలు 49.6 డిగ్రీలను తాకాయి. ఇది మునుపటి రికార్డుకన్నా దాదాపు 5 డిగ్రీలు అదనం. వాతావరణంలో మార్పులు లేకుండా ఇంత తీవ్రమైన హీట్‌వేవ్ అసాధ్యమని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ నెట్‌వర్క్ పేర్కొంది.

సోమాలియాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి

2. నిరంతర కరువు పరిస్థితులు

హీట్‌వేవ్‌లు అధిక కాలం కొనసాగితే, కరువులు మరింత తీవ్రమవుతాయి. రెండు హీట్‌వేవ్‌ల మధ్య చిన్న చిన్న వర్షాలు కురిసినా ఫలితం ఉండదు. వేడిమికి ఆ నీరు ఆవిరైపోతుంది. అంటే భూమి మరింత వేడెక్కుతుంది. దీనివల్ల భూమి పొరల పై గాలులు వేడెక్కుతాయి. మనుషులకు, పంటలకు నీటి అవసరం మరింత పెరుగుతుంది.

అధిక ఉష్ణోగ్రతలు

3. అధిక కార్చిచ్చులకు అవకాశం

సాధారణంగా మానవ చర్యల కారణంగా కార్చిచ్చులు ఏర్పడతాయి. కానీ, కొన్ని సహజ పరిణామాలు కూడా కార్చిచ్చులకు కారణమవుతాయి. ఎక్కువ కాలం కొనసాగే హీట్‌వేవ్‌ల కారణంగ భూమి మీద ఉన్న మొక్కలలోని తడి ఆవిరైపోతుంది. మొక్కలు డ్రైగా మారతాయి. ఇలాంటి మొక్కలు సులభంగా కాలిపోవడానికి అవకాశాలు ఏర్పడతాయి.

వర్షాలు లేకపోవడం, అనూహ్యంగా వేడి పరిస్థితుల కారణంగా ఉత్తరార్ధగోళంలో కార్చిచ్చుల సీజన్ చాలా ముందుగానే ప్రారంభమైంది. సైబీరియా, అలాస్కాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఈ కార్చిచ్చులు ప్రారంభమయ్యాయి. పశ్చిమ నార్వే, యూకే వంటి ప్రాంతాలలో అసాధారణ సమయంలో కార్చిచ్చులు మొదలైనట్లు రిపోర్టయింది.

కెనడాలో గత వేసవిలో, హీట్‌వేవ్ లు కార్చిచ్చులకు కారణమయ్యాయి. అవి చాలా వేగంగా వ్యాపించాయి. పైగా పైరోకుములోనింబస్ మేఘాలు ఏర్పడటం లాంటి పరిణామాలకు కూడా కారణమయ్యాయి. ఈ మేఘాలు పిడుగులను, మెరుపులను ఉత్పత్తి చేశాయి.ఇవి మరిన్ని కార్చిచ్చులకు కారణమయ్యాయి.

ఇటీవలి దశాబ్దాల్లో పెద్ద కార్చిచ్చుల ఫ్రీక్వెన్సీ పెరిగింది. 1970లతో పోలిస్తే, 10 వేల ఎకరాల (40 చదరపు కిలోమీటర్లు) కంటే పెద్ద కార్చిచ్చులు ఇప్పుడు పశ్చిమ అమెరికాలో ఏడు రెట్లు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు, పాత్రికేయుల స్వతంత్ర సంస్థ క్లైమేట్ సెంట్రల్ తెలిపింది.

స్లొవేనియాలో కార్చిచ్చులను ఆర్పే ప్రయత్నం

4. అధిక వర్షాలు

సాధారణ వాతావరణ చక్రంలో వేడి వాతావరణం గాలిలో తేమ, నీటి ఆవిరిని సృష్టిస్తుంది. ఇది వర్షపు బిందువులుగా మారుతుంది. అయితే, అది ఎంత వేడి ఉంటే, వాతావరణంలో అంత ఎక్కువ నీటి ఆవిరి ఉంటుంది. ఫలితంగా వర్షాలు కూడా ఎక్కువగానే కురుస్తాయి. కొన్నిసార్లు చిన్నచిన్న ప్రాంతాలలో పెద్దపెద్ద వర్షాలు కురిసి బీభత్సం సృష్టిస్తాయి.

ఈ ఏడాది ఇప్పటికే స్పెయిన్‌తోపాటు తూర్పు ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. కేవలం ఆరు రోజుల వ్యవధిలో బ్రిస్బేన్ దాని వార్షిక వర్షపాతంలో దాదాపు 80% అధిక వర్షపాతాన్ని నమోదు చేసింది. సిడ్నీ మూడు నెలల్లో దాని సగటు వార్షిక వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతాన్ని నమోదు చేసింది.

ఈ అధిక వర్షాలు చాలాచోట్ల వాతావరణ మార్పుల ప్రభావాలతో ముడిపడి ఉన్నాయని యూఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు చెందిన పీటర్ గ్లీక్ అభిప్రాయపడ్డారు.

ప్రపంచవ్యాప్తంగా వాతావరణం ఎల్లప్పుడూ మార్పులకు లోనవుతూ ఉంటుంది. కానీ, పర్యావరణ మార్పులు వాటిని తీవ్రం చేస్తున్నాయి. ఇప్పుడు ప్రజల ముందున్న సవాలు ఏంటంటే తాము వాతావరణంపై చూపే ప్రభావాన్ని పరిమితం చేయడమే కాకుండా, మనం ఇప్పటికే ఎదుర్కొంటున్న వైపరీత్యాలను స్వీకరించడంతో పాటు వాటిని పరిష్కరించే మార్గాలను వెతకడం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Heatwave: 4 major problems we face due to climate change
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X