వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ల్యాప్‌టాప్: ఇలా చేస్తే బ్యాటరీ ఎక్కువ కాలం వస్తుంది..

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
Entrada del enchufe de una laptop

బ్యాటరీ ఎక్కువ కాలం వచ్చేలా ల్యాప్‌టాప్‌ను వాడటం ఎలా?

చాలా మందిని తొలిచివేసే ప్రశ్న ఇది.

బ్యాటరీ ఎక్కువ కాలం రాకపోయినా కనీసం దాని జీవిత కాలం తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలని మరికొందరు అడుగుతూ ఉంటారు.

కాలంతోపాటు బ్యాటరీల మన్నిక తగ్గుతుంది.

మనం ల్యాప్‌టాప్‌ను ఉపయోగించే విధానం బ్యాటరీ శక్తిపై ప్రభావం చూపిస్తుందా? అని చాలా మందిలో అనుమానం ఉంటుంది.

ఒకవేళ అదే నిజమైతే బ్యాటరీలను వాడటం ఎలా?

నిత్యం బ్యాటరీకి చార్జింగ్ పెట్టే ఉంచాలా? లేదంటే చార్జింగ్ 100% వచ్చిన తర్వాత డిస్కనెక్ట్ చేసి, మళ్లీ అవసరమైనప్పుడు చార్జింగ్ పెట్టాలా?

లిథియంతో తయారుచేసే ల్యాప్‌టాప్ బ్యాటరీలు ఎక్కువ కాలం వచ్చేలా ఉపయోగించడం ఎలా? అనే అంశంపై నిపుణులతో మాట్లాడి బీబీసీ అందిస్తున్న కథనం.

ల్యాప్‌టాప్

బ్యాటరీ జీవిత కాలం ఇలా..

''కాలం గడుస్తున్న కొద్దీ బ్యాటరీ టెక్నాలజీ మరింత మెరుగవుతోంది. టెక్నాలజీలో పురోగతితో బ్యాటరీల జీవిత కాలం కూడా పెరుగుతోంది. పదేళ్ల క్రితం ల్యాప్‌టాప్ బ్యాటరీలు ఇలా ఉండేవికాదు. వాటి సామర్థ్యం కొన్ని వందల సైకిళ్లకు మాత్రమే పరిమితమై ఉండేది. అంటే కొన్ని వందల సార్లు చార్జింగ్ తర్వాత, బ్యాటరీ క్షీణించడం మొదలయ్యేది’’ అని యూకేలోని లెనోవో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆష్లే రోల్ఫ్ చెప్పారు.

నేడు ల్యాప్‌టాప్ బ్యాటరీల జీవిత కాలం మూడు నుంచి ఐదేళ్ల వరకు ఉంటోంది. వీటికి 500 నుంచి 1,000 సార్లు మనం చార్జింగ్ పెట్టుకోవచ్చు.

''చాలా మంది బ్యాటరీలకు ప్రతిసారీ పూర్తిగా చార్జింగ్ పెట్టాలని అనుకుంటారు. అదే సమయంలో ఎక్కువ కాలం మన్నిక ఉండాలని ఆశిస్తారు’’ అని నార్త్‌వెస్టెర్న్ యూనివర్సిటీలోని ఎనర్జీ టెక్నాలజీ పరిశోధకుడు కెంట్ గ్రిఫిత్ వివరించారు.

ల్యాప్‌టాప్

సమతుల్యం పాటించడం ఎలా?

''ల్యాప్‌టాప్‌కు అలా చార్జింగ్ పెట్టి ఉంచడం, వంద శాతం చార్జింగ్ ఎక్కించడం సురక్షితమైన విధానమే. చాలా మంది ఇలానే చేస్తుంటారు’’ అని యూకేలోని లెనోవో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రోల్ఫ్ అన్నారు.

''లెనోవోతోపాటు కొన్ని ఇతర బ్రాండ్ల ల్యాప్‌టాప్‌లలో కొన్ని ప్రత్యేక సెన్సర్లు ఉంటాయి. ఇవి చార్జింగ్ అతిగా ఎక్కకుండా, బ్యాటరీ వేడెక్కకుండా అడ్డుకుంటాయి’’ అని ఆయన వివరించారు.

''అయితే ప్రతిసారీ బ్యాటరీ వంద శాతం నిండేలా చార్జింగ్ పెడితే, బ్యాటరీ జీవిత కాలం తగ్గుతుంది’’ అని ఆయన చెప్పారు.

లెనోవోలోని స్ట్రాటజిక్ టెక్నాలజీ విభాగం డైరెక్టర్, ప్రిన్సిపల్ ఇంజినీర్ ఫిల్ జేక్స్ కూడా ఈ వాదనతో అంగీకరించారు.

''ఇటీవల కాలంలో ఎక్కువ చార్జింగ్ పట్టేలా టెక్నాలజీలో మార్పులు చేస్తున్నారు. దీంతో పూర్తిగా చార్జింగ్ పెడితే, బ్యాటరీలు త్వరగా దెబ్బతినే అవకాశం ఎక్కువ. అదే ఎక్కువ ఉష్ణోగ్రతల్లో చార్జింగ్ పెడితే, ఇంకా వేగంగా బ్యాటరీలు క్షీణిస్తాయి’’ అని ఆయన వివరించారు.

ల్యాప్‌టాప్

''వంద శాతం ఛార్జింగ్ పెట్టడం అంటే బ్యాటరీలో ఒత్తిడిని పెంచుతున్నట్లు లెక్క’’ అని నార్త్‌వెస్టెర్న్ యూనివర్సిటీకి చెందిన కెంట్ గ్రిఫిత్ చెప్పారు.

హెచ్‌పీ ల్యాప్‌టాప్‌ల తయారీదారులు కూడా ఇదే చెబుతున్నారు.

'’24 గంటలూ ల్యాప్‌టాప్‌లకు అలానే చార్జింగ్ పెట్టి ఉంచమని హెచ్‌పీ ఎప్పుడూ సూచించదు’’

''ప్రస్తుతం బ్యాటరీలు వంద శాతం చార్జింగ్ ఎక్కిన తర్వాత, ఓవర్ చార్జింగ్ అవ్వకుండా అడ్డుకునే టెక్నాలజీలు చాలా ఉన్నాయి. దాదాపు అన్ని ల్యాప్‌టాప్‌లలోనూ ఈ టెక్నాలజీని వాడుతున్నారు. అయితే వంద శాతం చార్జింగ్ అలానే కొనసాగితే బ్యాటరీపై ఒత్తిడి పెరుగుతుంది. దీర్ఘకాలం ఇలానే కొనసాగితే బ్యాటరీ క్షీణించడం మొదలవుతుంది’’ అని హెచ్‌పీ వివరించింది.

''అంటే బ్యాటరీని వంద శాతం కంటే తక్కువ ఉండేలా చూసుకుంటే తప్పకుండా బ్యాటరీ మన్నిక పెరుగుతుంది’’ అని గ్రిఫిత్ చెప్పారు.

ల్యాప్‌టాప్ పూర్తిగా చార్జింగ్ పెట్టి ఉంచే సమయాన్ని తగ్గించాలని లేదా 80 శాతం చార్జింగ్ అయ్యాక చార్జర్‌ను తీసివేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

'’50 శాతం చార్జింగ్ ఉన్నప్పుడు బ్యాటరీలు మెరుగ్గా పనిచేస్తాయి. అందుకే 20 నుంచి 80 శాతం మధ్య చార్జింగ్ ఉండేలా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు’’ అని రోల్ఫ్ చెప్పారు.

ల్యాప్‌టాప్

''80శాతం లోపలే చార్జింగ్ ఉంటే బ్యాటరీ సామర్థ్యం పెరుగుతుంది. గరిష్ఠ సామర్థ్యానికి 90 నుంచి 95 శాతానికి మించకుండా చార్జింగ్ పెట్టుకుంటే మేలు’’ అని లెనోవో స్ట్రాటజిక్ టెక్నాలజీ విభాగం డైరెక్టర్, ప్రిన్సిపల్ ఇంజినీర్ ఫిల్ జేక్స్ వివరించారు.

''ఎక్కువ సేపు చార్జింగ్ పెట్టి అలానే ఉంచితే, సర్ఫేస్ ల్యాప్‌టాప్‌ల సామర్థ్యం త్వరగా తగ్గే అవకాశముంది’’ అని మైక్రోసాఫ్ట్ కూడా హెచ్చరించింది.

''సర్ఫేస్ ల్యాప్‌టాప్‌లు అలానే చార్జింగ్ పెట్టి వదిలేయకూడదు. ఒకవేళ అలానే చార్జింగ్ పెట్టేయాలని మీరు అనుకుంటే, వెంటనే బ్యాటరీ చార్జ్ లిమిట్ మోడ్‌ను ఆన్ చేయాలి’’ అని మైక్రోసాఫ్ట్ వివరించింది.

''లిమిట్ ద మ్యాగ్జిమమ్ ఎమౌంట్’’ మోడ్‌ను మైక్రోసాఫ్ట్, లెనోవో, హెచ్‌పీ సహా కొన్ని ప్రముఖ బ్రాండ్లు అందుబాటులోకి తెచ్చాయి.

''బ్యాటరీ ఎక్కువ కాలం రావాలంటే, ప్రతిసారీ చార్జింగ్ పెట్టేటప్పుడు పూర్తిగా కాకుండా కాస్త తక్కువ చార్జింగ్ పెట్టాలి. అంటే 80 శాతం వరకు చార్జింగ్ పెట్టి ఆపేయాలి’’ అని గ్రిఫిత్ అన్నారు.

ల్యాప్‌టాప్

మీరు ఎలా ఉపయోగిస్తున్నారు?

ఈ సూచనలు, సలహాలు విని, మీరు ప్రతిసారీ 100 శాతం చార్జింగ్ పూర్తయిన వెంటనే చార్జర్‌ను తొలగించాల్సిన పనిలేదు.

''బ్యాటరీలు ఓవర్ చార్జ్ కాకుండా అడ్డుకునే టెక్నాలజీ దాదాపు అన్ని ల్యాప్‌టాప్‌లలోనూ ఉంటుంది. అయితే 80 శాతం దగ్గర ఆపితే మీ బ్యాటరీ జీవిత కాలం పెరిగే అవకాశం ఉంటుంది’’ అని రోల్ఫ్ అన్నారు.

''ప్రస్తుత కాలంలో బ్యాటరీలు ఊహించిన దానికంటే ఎక్కువ కాలమే వస్తున్నాయి. కాబట్టి దీని గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు’’

మీరు ల్యాప్‌టాప్ ఎలా ఉపయోగిస్తున్నారో అనే అంశంపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని రోల్ఫ్ సూచిస్తున్నారు.

''మీకు ఎక్కువసేపు పవర్ అందుబాటులో ఉండదని భావిస్తే, వంద శాతం చార్జింగ్ పెట్టుకోండి. ఇంకేమీ ఆలోచించకండి ’’

''ఎక్కువ సేపు డెస్కు దగ్గరే ఉన్నారు అనుకోండి.. లోడ్ లిమిట్ పెట్టుకోండి’’ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
For long life of your Laptop's battery, Do like this. So it will prolong battery life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X