సౌదీ-హూతీల పోరులోకి పాకిస్తాన్..! యెమెన్ లో వైమానిక దాడులు, 8 వేల సైనికులు..!
యెమెన్ లో సౌదీ అరేబియా అనుకూల ప్రభుత్వానికీ, హూతీ రెబెల్స్ కు మధ్య సాగుతున్న పోరు తాజాగా ఎర్ర సముద్రానికి, అక్కడి నుంచి సౌదీకి కూడా విస్తరించింది. ఈ నేపథ్యంలో సౌదీ రాజధాని రియాద్ పై దాడులకు దిగుతున్న హూతీలు, పౌర విమానాశ్రయాల్ని సైతం వదలడం లేదు. దీంతో సౌదీ అరేబియా ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో సౌదీతో ఇప్పటికే మక్కా ఒప్పందం (Mecca Pact) కుదుర్చుకున్న పాకిస్తాన్, టర్కీ ఈ పోరులోకి రాకుండా మౌనంగా ఉండిపోతుండటం చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఇందులో పాకిస్తాన్ (Pakistan) ఈ యుద్దంలోకి దిగింది.
యెమెన్‌లోని ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ రెబెల్స్ పై ఇవాళ పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు దాడులకు దిగినట్లు ది న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. కొత్తగా క్రియాశీలమైన మక్కా రక్షణ కూటమి కింద సౌదీ అరేబియాకు పాకిస్తాన్ సైనిక మద్దతును పెంచిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. అలాగే సౌదీ అరేబియాలో సుమారు 8 వేల మంది పాకిస్తానీ సైనికుల్ని కూడా పాకిస్తాన్ మోహరించింది. హూతీలను లక్ష్యంగా చేసుకుని జరిగే దాడులలో పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలను ఉపయోగిస్తున్నారని అధికారులు తెలిపారు.

తాజాగా సౌదీ భూభాగంపై క్షిపణి, డ్రోన్ దాడులను తీవ్రతరం చేసిన హూతీలకు, సౌదీ అరేబియాకు మధ్య తీవ్రమవుతున్న సంఘర్షణలో పాకిస్తాన్ సైనిక పాత్ర గణనీయంగా విస్తరించినట్లు ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. అయితే పాకిస్తాన్ మోహరింపులు, వైమానిక దాడుల్ని రహస్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో అమెరికా-ఇరాన్ మధ్య చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరించిన పాకిస్తాన్.. ఇప్పుడు అందులో ఇరాన్ మద్దతున్న హూతీల్ని టార్గెట్ చేస్తున్నట్లు బహిరంగంగా తేలితే ఆ దేశానికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. అప్పుడు ఇరాన్ కూడా పాకిస్తాన్ పై దాడులకు దిగితే పరిణామాలు పూర్తిగా మారిపోతాయి. అందుకే పాకిస్తాన్ ... ఈ ఏడాది ఆగస్టులో కుదిరిన మక్కా ఒప్పందం అమలులో రహస్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అయితే ఇరాన్‌తో సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం దృష్ట్యా, హూతీలకు వ్యతిరేకంగా పాకిస్తానీ సైనికులు ప్రత్యక్ష భూతల దాడుల్లో పాల్గొనే అవకాశం లేదని తెలుస్తోంది.














Click it and Unblock the Notifications
