కడప విమానాశ్రయంలో నైట్ ల్యాండింగ్ సౌకర్యం..అభివృద్ధి పనులు సమాప్తం!!
కడప విమానాశ్రయంలో నైట్ ల్యాండింగ్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. కడప ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి కావటంతో విమానాల రద్దీ పెరిగే అవకాశం ఉంది.
కడప జిల్లాలో చేపట్టిన విమానాశ్రయ అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ఇటీవల కొత్తగా చేపట్టిన కడప విమానాశ్రయం రన్ వే విస్తరణ, ట్యాక్సీ వే తో పాటుగా నాలుగు కొత్త ఆఫ్రాన్ల పనులు పూర్తి చేశారు. అంతేకాదు మరోపక్క కడప విమానాశ్రయం ఇకపై నైట్ ల్యాండింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించనుంది.

నైట్ ల్యాండింగ్ కి రెడీ అయిన కడప విమానాశ్రయం
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఏపీ ప్రభుత్వం 70 ఎకరాల భూమిని ఇవ్వడంతో నైట్ ల్యాండింగ్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోయింది. విమానాశ్రయానికి సంబంధించి తక్కువ సమయంలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సంకల్పించినట్టే శరవేగంగా అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. దీంతో ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. కడప విమానాశ్రయం 24 గంటలు విమాన సేవలతో అనుసంధానించబడుతుంది. ఇది రాయలసీమ ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తుంది.

కడప అభివృద్ధితో విమానాల రద్దీ పెరిగే ఛాన్స్
ఇదిలా ఉంటే ప్రస్తుతం తిరుపతి విమానాశ్రయంలోనూ నైట్ ల్యాండింగ్ సౌకర్యం ఉంది. కర్నూలు జిల్లా ఓర్వకల్ విమానాశ్రయం కేవలం డే సర్వీసులకే పరిమితమైంది. అక్కడ నైట్ లైనింగ్ సదుపాయాలు లేవు. ఇక్కడ సత్య సాయి పుట్టపర్తి విమానాశ్రయంలో అసలు ప్రైవేట్ క్యారియర్లు లేవు. ఇది ప్రత్యేక విమానాల ద్వారా విఐపి సందర్శనలకు మాత్రమే పరిమితం చేయబడింది. ఏదేమైనప్పటికీ కడప విమానాశ్రయం నైట్ ల్యాండింగ్ సౌకర్యంతో విస్తరించడంతో ఇక్కడ విమానాల రద్దీ పెరిగే అవకాశం ఉంది. కడప నుండి ప్రయాణికులు దేశ విదేశాలకు సులభంగా చేరుకోవడానికి ప్రస్తుత ఏర్పాట్లు వీలు కల్పించే అవకాశం ఉంది.

కడప విమానాశ్రయం ఏర్పాటు.. అభివృద్ధి ఇలా
ఇదిలా ఉంటే కడప విమానాశ్రయాన్ని మొట్టమొదట 1953లో 3500 అడుగుల రన్ వేతో నిర్మించారు. 1980 లలో వాయుదూత్ హైదరాబాద్ నుండి కడపకు సర్వీసులను నడిపింది. 2009లో బిల్ట్ ఆపరేట్ మరియు ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన 21 కోట్ల వ్యయంతో మరో మారు రన్ వే ను విస్తరించి పూర్తి చేశారు. 24 కోట్ల రూపాయలతో 11 కిలోమీటర్ల పొడవున కాంపౌండ్ వాల్ కూడా నిర్మించారు. ఇక రెండవ దశలో 13 కోట్ల రూపాయల వ్యయంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ భవనాన్ని, ప్యాసింజర్ టెర్మినల్ ను, పార్కింగ్ స్థలాలను అభివృద్ధి చేశారు. 8 కోట్ల రూపాయల వ్యయంతో అంతర్గత రోడ్లను నిర్మించారు.

2017 నుండి వాణిజ్య విమానయాన సేవలు .. కానీ
ఇక కడప విమానాశ్రయం నుండి జూన్ 7 2017 న వాణిజ్య విమాన యానం ప్రారంభమైంది. మొదట ఎయిర్ పెగాసస్ బెంగళూరుకు వారానికి మూడుసార్లు ఏ టి ఆర్ 72 సర్వీస్ ను ప్రారంభించింది. అయితే ఈ సర్వీసులను ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. ఆ తర్వాత ట్రూజెట్ ఎయిర్ వేస్ కడప నుండి విమానాలను కొంతకాలం నడిపి, అది కూడా సర్వీసులను నిలిపివేసింది.

అభివృద్ధి పనుల పూర్తితో మరిన్ని విమానయాన సేవలు అందుబాటులోకి
ఇక ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ప్రైవేటు విమాన యాన సంస్థ ఇండిగో ప్రతిరోజు కడప హైదరాబాద్ మధ్య విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. అదనంగా గోవా, మధురై, తిరువనంతపురం, రాజమండ్రి, భువనేశ్వర్, రాయపూర్, ఇండోర్, జబల్పూర్, ముంబై, చండీగడ్ , వారణాసి, సూరత్, జైపూర్, రాంచి మరియు న్యూ ఢిల్లీ కి ప్రతిరోజు కనెక్టింగ్ సర్వీసులు కొనసాగుతున్నాయి. కాగా కడప - విజయవాడ, కడప - చెన్నై సర్వీసులు ఆది, సోమ, బుధ, శుక్రవారం లో అందుబాటులో ఉన్నాయి. ఇక తాజాగా అభివృద్ధి పనులు కూడా పూర్తి కావడంతో మరిన్ని విమాన యాన సేవలు కడపలో అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తుంది.












Click it and Unblock the Notifications