అనుమానాస్పదస్థితిలో కవయిత్రి ఆండాళ్ మృతి

Subscribe to Oneindia Telugu

నర్సంపేట: నర్సంపేట పట్టణానికి చెందిన ప్రముఖ కవయిత్రి మంతెన ఆండాళ్‌ (73) అనుమానాస్పదస్థితిలో గురువారం మృతి చెందారు. ఆమె ఒంటిపై మూడు, నాలుగు చోట్ల గాయాలు ఉండటంతో పాటు నోట్లోంచి రక్తం రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆమె మృతదేహాన్ని నర్సంపేట సీఐ దేవేందర్‌రెడ్డి, ఎస్సై హరికృష్ణ సందర్శించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు.

సీఐ దేవేందర్‌రెడ్డి, కాలనీవాసుల వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన మంతెన తిరువెంగళాచారి, ఆండాళ్‌ దంపతులకు శ్రీరమ, శ్రీకళ, శ్రీకృష్ణ ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. తిరువెంగళాచారి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసి పదేళ్ల క్రితం మృతి చెందారు. భర్త మృతిచెందినప్పటి నుంచి ఆండాళ్‌ చిన్న కూతురు శ్రీకృష్ణతో కలిసి పట్టణంలోని రామాలయం వీధిలోని సొంతింటిలో ఉంటున్నారు.

శ్రీకృష్ణకు పెళ్లయిన కొన్నాళ్లకే విడాకులు కావడంతో ఆమె తల్లితోనే ఉంది. ఇటీవల మానసికస్థితి సరిగా లేక పలుమార్లు తల్లికి చెప్పకుండానే ఆమె ఇంటి నుంచి బయటికి వెళ్లి వస్తున్నట్లు తెలిసింది. గతంలో ఒకమారు ఎవరికి చెప్పకుండా ఆమె వెళ్లగా కుటుంబ సభ్యులు విజయవాడలో పట్టుకుని ఇంటికి తీసుకువచ్చారు. తాజాగా ఆమె ఇంటి నుంచి వెళ్లి నాలుగు రోజుల తరవాత తిరిగి వచ్చారు.

A poet suspicious death in Narsampet

ఈనేపథ్యంలో ఆమె ఇంట్లో సరిగా ఉండకపోవడంతో పాటు పిచ్చిగా వ్యవహరిస్తుండడంతో ఇంట్లో పెట్టి బయట తాళం వేస్తున్నట్లు సమాచారం. ఇలాగే బుధవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చి గోడ దూకే ప్రయత్నం చేసిందని, ఆమెతో వేగలేక ఇబ్బందిపడుతున్న తల్లి ఆండాల్‌.. రెండో కుమార్తె శ్రీకళ ఇంటికి రాగా ఈ విషయమంతా ఆమెతో చెప్పారు. ఆ తర్వాత గురువారం ఉదయం పనిమనిషి వచ్చి చూడగా ఇంట్లో ఆండాళ్‌ పడిపోయి నోటిలోంచి రక్తం వస్తున్న స్థితిలో ఉండడంతో ఆమె వెంటనే రెండో కుమార్తె శ్రీకళకు సమాచారం అందించారు. ఆమె వచ్చి చూసేసరికి తల్లి ఆండాళ్‌ విగత జీవిగి పడివున్నారు.

దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదుచేశారు. సీఐ దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై హరికృష్ణ, పోలీసులు వచ్చి మృతదేహానికి పంచనామా జరిపించి పోస్టుమార్టానికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ దేవేందర్‌రెడ్డి తెలిపారు.

ప్రమాదవశాత్తున తగిలిన దెబ్బలా, కొట్టారా..?

ఆండాళ్‌ మృతదేహంపై పలుచోట్ల దెబ్బలు కనిపించడం, నోట్లోంచి రక్తం రావడంతో పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. మృతురాలు నిత్యం ఓ బల్లపై నిద్రపోతారని, నిద్రలో బల్లపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడితే దెబ్బలు తగిలాయా? మానసిక స్థితి సరిగాలేని చిన్నకూతురు ఆమెపై దాడిచేసిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నోటిలోంచి రక్తం రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. చేతి మణికట్టుపై దెబ్బలు తగిలాయని, చేతికున్న బంగారు కడియం వంకర తిరగం కూడా అనుమానాల్ని బలపరుస్తోంది.

నవోదయలో కొనసాగుతున్న పోలీసుల విచారణ

వరంగల్‌: మామునూరు జవహర్‌ నవోదయ విద్యాలయంలో పోలీసులు విచారణ కొనసాగుతోంది. ఈనెల 26న తొమ్మిదో తరగతి విద్యార్థిని సుచిత ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి పలుమార్లు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మామునూరు ఏసీపీ పుల్లా శోభన్‌కుమార్‌ ఆధ్వర్యంలో గురువారం సీఐ జూపల్లి శివరామయ్య బృందం ఘటన స్థలాన్ని పరిశీలించారు. వేలిముద్రల నిపుణులు, క్లూస్‌టీం బృందం ఫొటోలు తీసి ఆధారాలు సేకరించారు. విద్యాలయం సిబ్బందితో పాటు సహచర విద్యార్థులను వేర్వేరుగా విచారించి వివరాలు నమోదు చేసుకున్నారు. విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన ఆంశాలు ఏమిటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలుస్తుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A poet suspicious death in Narsampet, Warangal district.
Please Wait while comments are loading...