తెలంగాణాపై బీజేపీ హైకమాండ్ ఫోకస్.. నేరుగా అమిత్‌షాకే రహస్య నివేదికలు.. త్వరలోనే మాస్టర్ ప్లాన్!!
కేంద్రంలోని బిజెపి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందా? 2024 లోక్ సభ ఎన్నికల లక్ష్యంగా బీజేపీ దృష్టి సారించిందా? తెలంగాణ పై ఫోకస్ చేస్తున్న కేంద్రం క్షేత్ర స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో కమల వికాసం పై దృష్టిసారించిందా? మునుగోడు విషయంలో ఇంత ఫోకస్ వెనుక కారణం ఉందా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.

తెలంగాణాపై బీజేపీ హైకమాండ్ ఫోకస్..
కేంద్రంలోని బీజేపీ తెలంగాణ రాష్ట్రంలోని భవిష్యత్తు అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేసుకొని ఇప్పటి నుంచే వ్యూహాలను రచిస్తోంది. అందులో భాగంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే వచ్చిన మునుగోడు ఉప ఎన్నికను కీలకంగా భావిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికతో పాటుగా, తెలంగాణ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు, రాష్ట్ర పార్టీ చేస్తున్న కృషి, పార్టీని గ్రామస్థాయి లోకి తీసుకువెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాలు, వచ్చే ఎన్నికలకు ప్రజలను సిద్ధం చేస్తూ చేస్తున్న సన్నద్ధ కార్యక్రమాలపై బిజెపి జాతీయ నాయకత్వం దృష్టిసారించింది.

క్షేత్రస్థాయిలో రహస్య నివేదికలు తెప్పించుకుంటున్న అమిత్ షా, జేపీ నడ్డాలు
పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో బిజెపి దూకుడుగా ముందుకు వెళుతుందని, వచ్చే ఎన్నికలలో అధికారం చేపట్టడం తథ్యం అన్నరీతిలో అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నా, బిజెపి అధినాయకత్వం మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో గ్రౌండ్ లెవెల్ లో క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకుంటూ భవిష్యత్ కార్యాచరణకు ప్లాన్ చేస్తుంది. బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు నేరుగా నివేదికలు పంపేలా ఎన్నికల ప్రొఫెషనల్స్ బృందం అసోసియేషన్ అఫ్ బిలియన్ మైండ్స్ గత ఏడాది కాలం నుండి తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తుంది.

పార్టీ నుండి నివేదికలు తెప్పించుకుంటున్న జేపీ నడ్డా
ఇక ఇదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పార్టీకి సంబంధించిన వివిధ విభాగాల ద్వారా విడిగా రిపోర్టులు పంపే ఏర్పాటు కూడా ఉంది. ఇక రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ పనితీరుపై పార్టీతో సంబంధం లేని స్వతంత్ర సంస్థలలోనూ జాతీయ నాయకత్వానికి క్షేత్రస్థాయి నివేదికలు అందుతున్నాయి. ఇక రాష్ట్ర స్థాయిలో నాయకుల పనితీరు, ప్రజలపై ప్రభావం చూపేలా పార్టీ ప్రచారం, నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమాలు తదితరాలపై ఎప్పటికప్పుడు బిజెపి అధినాయకత్వానికి వివరాలు అందుతున్నాయి.

తెలంగాణా బీజేపీ నాయకుల పనితీరుపై అధిష్టానం ఫోకస్
తెలంగాణ రాష్ట్రంలో టాప్ టు బోటమ్ బిజెపి నాయకులు అందరిపైనా, వారికి అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నారా? లేదా? వారి పనితీరు ఎలా ఉంది? ప్రజలలో వారికి ఆదరణ ఎలా ఉంది అన్న అంశాల పైన కూడా అధినాయకత్వం ఫోకస్ చేస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది. ప్రజల్లోకి బలంగా వెళ్లడానికి బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందా అన్న అంశాలపై రహస్య నివేదికల ద్వారా పూర్తి సమాచారాన్ని సేకరించిన బిజెపి అధినాయకత్వం అంతా బాగానే ఉంది అనుకుంటూ రాష్ట్ర స్థాయి నేతలు నిర్లక్ష్యం ప్రదర్శించకుండా, వారిని ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తోంది.

ఫలితాలపై అసంతృప్తి .. మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్న హైకమాండ్
ఇక నాయకులు ఎవరికి వారు తమ సొంత గుర్తింపు కోసం పని చేయకుండా, పార్టీ కోసం పని చేయాలన్న ఉద్దేశాన్ని వ్యక్తం చేసిన జాతీయ అధినాయకత్వం, పార్టీ ఆశించిన మేర పూర్తి స్థాయిలో ఫలితాలు రావడంలేదని గుర్తించింది. ఈ క్రమంలో అందరూ సంఘటితంగా పని చేయాల్సిన అవసరాన్ని గుర్తించిన పార్టీ, మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తోంది. త్వరలో రాష్ట్రంలో కీలకంగా పని చేస్తున్న పార్టీ ముఖ్యనేతలతో పాటుగా, జిల్లాస్థాయి, మండల స్థాయి కార్యవర్గాల కు నూతన దిశానిర్దేశం చేయడానికి పార్టీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన స్పష్టమైన కార్యాచరణతో రాష్ట్ర పార్టీకి బీజేపీ హైకమాండ్ దిశానిర్దేశం చేయబోతోందని సమాచారం.












Click it and Unblock the Notifications