
KCR: గుజరాత్‍లో జరిగినట్లే తెలంగాణలో జరుగుతుందా.. కేసీఆర్ అదే ఆశిస్తున్నారా..!
గుజరాత్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బంపర్ మెజారిటీతో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కమలం పార్టీ రికార్డు బ్రేక్ చేసింది. బీజేపీ 156 సీట్లను దక్కించుకుంది. కాంగ్రెస్ 17 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఆప్ 5 చోట్ల గెలుపొందగా.. ఇతరులు 3 స్థానాల్లో సత్తా చాటారు. సమాజ్ వాది పార్టీ ఒక సీటు దక్కించుకుంది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ తీవ్రంగా నిరాశ పరిచింది. 2017 ఎన్నికల కంటే తక్కువ సీట్లను దక్కించుకుంది. 2017లో కాంగ్రెస్ 78 సీట్లు రాగా.. బీజేపీకి 99 సీట్లు వచ్చాయి.

ఆప్
గుజరాత్ లో వరుసగా ఆరు ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ క్యాడర్ ను కాపాడుకుంటూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ... ఈ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేసింది. కానీ నిరాశే మిగిలింది. ఇక్కడ కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణం ఆప్ అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల స్థాయిలో ఊపు తీసుకురావడంలో విఫలమైనా.. గౌరవ ప్రధమైన సీట్లు సాధిస్తుందని అంతా అనుకున్నారు. కాని ఆప్ కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చడంతో పరిస్థితి తారుమారైంది.

బీజేపీ
ఇప్పుడు.. ఇదే పరిస్థితి తెలంగాణలో కూడా ఉండే అవకాశం ఉన్నట్లు కేసీఆర్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధానంగా టీఆర్ఎఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఉన్నాయి. గతంలో బీజేపీ కంటే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడం వల్ల హస్తం పార్టీ ప్రభావం తగ్గుతూ వస్తోంది. అదే సమయంలో బీజేపీ బలం పెరుగుతూ వస్తుంది. దీంతో బీజేపీ అధినాయకత్వం
తెలంగాణలో పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తోంది.

వేచి చూస్తే అంతే..
సీబీఐ, ఐటీ, ఈడీ దాడులతో టీఆర్ఎస్ నాయకులను ఊక్కిరిబిక్కిరి చేస్తోంది. మరోవైపు తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుండడంతో పాటు కాషాయం పార్టీ బలం పెరుగుతుండడంతో గులాబీ అధినేత ముందస్తుకు వెళ్లాలని భావిస్తున్నట్లు వార్త కథనాలు వస్తున్నాయి. ఇంకా వేచి చూస్తే ప్రభుత్వ వ్యతిరేకత పెరగడంతో పాటు బీజేపీ బలం పెరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత సమయంలో ఎన్నికలకు వెళ్తే ప్రభుత్వ ఓటు చీలుతుందని ఆయన అంచనా వేస్తున్నట్లు తెలుస్తుంది.

ఓట్లు చీలుతాయి..!
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీతో పాటు షర్మిల పార్టీ ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంది. వామపక్షాలు ఎట్లాగు తమ వెంట ఉంటాయని భావిస్తున్న కేసీఆర్.. తమ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి కాంగ్రెస్, బీజేపీతో పలు పార్టీలకు వెళ్తే టీఆర్ఎస్ గట్టెక్కుతుందని భావిస్తున్నారు.