నిధుల కొరతతో వట్టిపోతున్న భాగ్యనగరి: రుణాల కోసం బాండ్ల జారీ తప్పదా?

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మూడేళ్ల క్రితం తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి హైదరాబాద్ నగరంలో వసూలయ్యే ఐటీ రిటర్న్స్, ఇతర పన్ను వసూళ్ల రీత్యా రూ.17 వేల కోట్ల అదనపు ఆదాయం కలిగి ఉన్నది. అందుకే సీఎం కే చంద్రశేఖర్ రావు కూడా సందర్భోచితంగా తెలంగాణ ధనిక రాష్ట్రమని, నిధుల ఢోకా లేదని చెబుతారు.

కానీ రోజువారీ అవసరాల కోసం హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) తన ఆస్తులను తాకట్టు పెట్టేందుకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. జీహెచ్‌ఎంసీ అవసరాల కోసం, హైదరాబాద్‌ నగరాభివృద్ధి, పలు ప్రాజెక్టుల పూర్తి కోసం రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు బ్యాంకుల నుంచి రూ.2,500 కోట్లు, బాండ్ల ద్వారా రూ.1000 కోట్లు సేకరించేందుకు కసరత్తు చేస్తోంది. కనీసం సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిల్లోకి కూరుకుపోయిన నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ ఈ చర్యకు పూనుకున్నట్టు తెలుస్తున్నది.

రాష్ట్ర ప్రభుత్వం బల్దియాకు సాయం చేయకపోగా జీహెచ్‌ఎంసీకి ఇచ్చే నిధులను కూడా విడుదలచేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్టు ప్రచారం జరుగుతున్నది. 'హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తాం. రూ.20వేల కోట్లతో నగరంలో ఫ్లైఓవర్లు, స్కైవేలు నిర్మిస్తాం. రూ.11 వేల కోట్లతో డ్రెయినేజీ వ్యవస్థ బాగుచేస్తాం. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కట్టిస్తాం' అని ఇచ్చిన హామీలన్నీ పట్టాలెక్కడం ప్రశ్నార్థకంగా మారింది.

వందల కోట్లలో కేటాయింపులు.. కానీ..

వందల కోట్లలో కేటాయింపులు.. కానీ..

రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొ రేషన్‌ (జీహెచ్‌ఎంసీ)కి సాయం చేయకపోగా, ఇచ్చే నిధుల విషయంలోనూ తాత్సారం చేస్తున్నది. దీంతో అతిపెద్ద మున్సిపల్‌ కార్పొరేషన్‌గా ఉన్న జీహెచ్‌ఎంసీ నిధుల్లేక దివాళా తీసింది. 2015 -16లో రూ.428 కోట్లు కేటాయించి రూ.23 కోట్లు మాత్రమే విడుదల చేసింది. 2016-17 బడ్జెట్‌లో రూ.70.30 కోట్లు కేటాయిస్తే కేవలం రూ.1.32 కోట్లే విడుదల అయ్యాయి. 2017-18 బడ్జెట్‌లో ప్రణాళికేతర నిధుల కింద రూ.67.28 కోట్లు కేటాయించారు గానీ నయాపైసా విడుదల చేయలేదు. గతేడాది స్టాంపు డ్యూటీ ఫీజు కింద సర్కా,ర్‌ నుంచి రావాల్సిన రూ.320 కోట్లకు రూ.80 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇంకా రూ.240 కోట్లు రావాల్సిన ఉంది.

డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ. 100 కోట్లు

డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ. 100 కోట్లు

హైదరాబాద్ రీజియన్‌ను జీహెచ్ఎంసీకి అనుసంధానం చేసినందుకు టీఎస్ఆర్టీసీకి రూ.336 కోట్లు చెల్లించారు. స్ట్రాటజిక్‌ రోడ్డు డెవపల్‌మెంట్‌ ప్లాన్‌ (ఎస్‌ఆర్‌డీపీ) కోసం రూ.200 కోట్లు, డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇండ్ల కోసం రూ.100 కోట్లు ఖర్చుచేశారు. జీహెచ్‌ఎంసీలో వేతనాలు, పింఛన్లు, వీధిదీపాల నిర్వహణ కోసం నెలకు రూ.110 కోట్లు అవసరం. కానీ, ప్రస్తుతం ఖజానాలో రూ.25 కోట్లు మాత్రమే ఉన్నాయి. వీటికితోడు కేంద్ర ప్రభుత్వం నుంచి 14వ ఆర్థిక సంఘం సిఫారసుల కింద జీహెచ్ఎంసీకి కేటాయించాల్సిన రూ.53 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వచ్చాయి. వీటిన్నింటితో సెప్టెంబర్‌ వేతనాలకు సరిపోతాయని అధికారులు చెబుతున్నారు. కానీ, అక్టోబర్‌ నుంచి వేతనాలు ఎలా ఇవ్వాలో అర్థం కావడం లేదని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో దిక్కులేక ఆస్తులను తాకట్టు పెట్టి నిధులను సమీకరించుకునేందుకు జీహెచ్‌ఎంసీ ప్రయత్నాలు ప్రారంభించింది.

ఎస్సార్డీపీ కింద ఫ్లైఓవర్లు, డబుల్ బెడ్రూం ఇళ్లపై ఇలా పెదవి విరుపు

ఎస్సార్డీపీ కింద ఫ్లైఓవర్లు, డబుల్ బెడ్రూం ఇళ్లపై ఇలా పెదవి విరుపు

హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చరిత్రలో బ్యాంకుల నుంచి అప్పులు తీసుకున్న దాఖలాల్లేవు. 15 ఏండ్ల కింద బాండ్ల ద్వారా రూ.100 కోట్లు సేకరించినట్టు సమాచారం. ప్రస్తుతం రూ.1000 కోట్లు సేకరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 'తెలంగాణ ధనిక రాష్ట్రమైతే జీహెచ్‌ఎంసీకి ఇవ్వాల్సిన నిధులను ఎందుకివ్వడంలేదు. నిధుల్లేక జీహెచ్‌ఎంసీ దివాళా తీయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది'అని పలువురు ఆర్థికరంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. నిధుల్లేక ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని దుస్థితిలో బల్దియా కొట్టుమిట్టాడుతుంటే మరోపక్క బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని నగరంలో ఎస్‌ఆర్‌డీపీ ద్వారా ఫ్లైఓవర్లు, పేదలకు డబుల్‌బెడ్‌రూమ్‌ ఇండ్లు కట్టిస్తామని ప్రభుత్వం చెప్పడం శోచనీయమని పౌరసంఘాల నేతలు విమర్శిస్తున్నారు.

పరిస్థితులకు అనుగుణంగా తొలుత జుబ్లీహిల్స్ - బంజారాహిల్స్ మధ్యనున్న కేబీఆర్ పార్కు మీదుగా ఫ్లైఓవర్లు నిర్మిస్తామని సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు పదేపదే హామీలు ఇస్తున్నారు. కాగా, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడమంటే జీహెచ్‌ఎంసీకి చెందిన ఆస్తులను తాకట్టు పెట్టడం ఖాయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సర్కార్ కౌంటర్ గ్యారంటీ ఇస్తుందన్న జీహెచ్ఎంసీ కమిషనర్

సర్కార్ కౌంటర్ గ్యారంటీ ఇస్తుందన్న జీహెచ్ఎంసీ కమిషనర్

బ్యాంకుల నుంచి రూ.2,500 కోట్ల రుణం, బాండ్ల ద్వారా రూ.1000 కోట్లు సేకరించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. అనుమతి కోసం మూడురోజుల కింద రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు లేఖ కూడా రాశారు. ‘కేర్‌' అనే ఆర్థికరంగ సంస్థతో సర్వే చేయించుకుని 'ఏఏ' గ్రేడ్‌ను సైతం సంపాదించారు. ఆర్థికరంగ సంస్థ గ్రేడ్‌ ఇచ్చినా బ్యాంకు రుణం తీసుకుంటే కచ్ఛితంగా ఆస్తులు తాకట్టు పెట్టాల్సి వస్తుందని ఆర్థికరంగ నిపుణులు చెబుతున్నారు.

రాష్ట్రంలో పలు ప్రభుత్వ రంగ సంస్థలు ఆస్తులను తాకట్టు పెట్టి రుణం తీసుకున్న సంగతి తెలిసిందే. బ్యాంకుల నుంచి జీహెచ్‌ఎంసీ తీసుకోవాలనుకుంటున్న రూ.2,500 కోట్ల కోసం ఆస్తులను తాకట్టు పెట్టక తప్పదని తెలుస్తోంది. బల్దియా గతంలో ఎప్పుడూ బ్యాంకుల నుంచి రుణం తీసుకోలేదని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి చెప్పారు. ఈసారి తీసుకోవాలనుకున్నాం, అనుమతి కోసం సర్కార్‌కు లేఖరాశామని చెప్పారు. ప్రభుత్వమే కౌంటర్‌ గ్యారంటీ ఇస్తుందని, బాండ్ల ద్వారా రూ.1000 కోట్లు సేకరిస్తాం అని పేర్కొన్న జనార్ధన్ రెడ్డి.. దేశంలో బాండ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని గుర్తు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Greater Hyderabad Muncipal Corporation (GHMC) faces funds shortage. Its commissioner Janardhan Reddy confirmed that GHMC put up proposas before government for loan and bonds approval. If government gives green signal with counter guranty for loans, they will forward. If GHMC taken loans from banks, it will be first in Hyderabad Muncipal corporation history.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి