అనుకుంటే అంతే: నిన్న చంద్రబాబుపై, నేడు హరీష్‌కు గవర్నర్ ప్రశంస
మెదక్: బంగారు తెలంగాణ సాధనలో మంత్రి హరీష్ రావు వంటి నేతలు ఎంతో అవసరమని, ఆయన ఓ మాట అనుకున్నారంటే చేసి తీరుతారని లక్ష్యం నెరవేరేదాకా వదలరని, అటువంటి నేత మీకు అందుబాటులో ఉన్నారని గవర్నర్ నరసింహన్ శుక్రవారం నాడు కితాబిచ్చారు.
కొత్తగా తీసుకు వచ్చే ఏ పథకం అయినా విజయవంతం కావాలన్నా సమర్థవంతమైన నాయకత్వం, ప్రజలను, అధికారులను ముందుండి నడిపించే పాలక పక్ష నేత అవసరమన్నారు. ఆ లక్షణాలు హరీష్ రావులో పుష్కలంగా ఉన్నాయని చెప్పారు.
ఈ రోజు హరీష్ రావు తన సొంత నియోజకవర్గం సిద్దిపేటలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో హరితహారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావుతో పాటు గవర్నర్ నరసింహన్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్ తదితరులు పాల్గొని, మొక్కలను నాటారు.
Also Read: బాబు, నేను కెప్టెన్లమే, కానీ: గవర్నర్ అసహనం, లోకేష్‌తో పరిచయం

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడారు. ఇబ్రహీంపూర్ గ్రామం స్వర్ఘ గ్రామమన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు ఇబ్రహీంపూర్‌లా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే గ్రామాలు బాగుపడతాయన్నారు. గ్రామంలో మరింత అభివృద్ధి జరగాలన్నారు.
ఆ తర్వాత మాట్లాడిన హరీష్ రావు కూడా గవర్నర్‌ను ప్రశంసించారు. గవర్నర్ మాట అంటే మాటేనని, టైమంటే టైమే అన్నారు. పదిన్నరకు వస్తానని చెప్పిన ఆయన, అంతకుముందే వచ్చారన్నారు. ఇలా అందరికీ ఆదర్శనంగా నిలిచారని, వారి నుంచి మేమంతా స్ఫూర్తి పొందుతున్నామన్నారు.
Also Read: బాబుని మెచ్చుకొని చిక్కుల్లో గవర్నర్! 'జగన్ రూ.లక్ష కోట్లు ఉంటే..'
హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు పెంచిన వారికి ప్రోత్సహకాలను అందిస్తామని హరీష్ రావు చెప్పారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటిన వారికి ప్రోత్సహక బహుమతులు అందిస్తామన్నారు. ప్రజలు సమష్టిగా కృషి చేస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. మొక్కలు నాటడంలో ఇబ్రహీంపూర్ స్ఫూర్తిదాయకమన్నారు.
కాగా, పది రోజుల క్రితం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పైన ఏపీ పర్యటనలో భాగంగా గవర్నర్ నరసింహన్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. రాజధాని అమరావతి నిర్మాణంలో చంద్రబాబు పాత్ర అభినందనీయమని, పుష్కర పనులు వేగవంతంగా జరుగుతున్నాయని కితాబిచ్చారు.