ఫ్రొఫెసరా?: కోదండరాంపై తొలిసారి హరీశ్, వైయస్‌నూ లాగారు!

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ జేఏసీ ఛైర్మన్ ఫ్రొఫెసర్ కోదండరాంపై మంత్రి హరీశ్ రావు తొలిసారి విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు కోదండరాంకు తప్పులుగా కనిపిస్తున్నాయా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే.. విమర్శలు చేస్తారా? అంటూ మండిపడ్డారు.

కోదండరాం ఫ్రొఫెసరా? లేక మరెందో అర్థమైతలేదని హరీశ్ ఎద్దేవా చేశారు. కుల వృత్తులు, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేలా వ్యవహరించడం సరికాదని అన్నారు. కోదండరాంకు కాంగ్రెస్ పార్టీ గాలి సోకినట్లుందని అందుకే వారి తప్పులు మాత్రం కనిపించడం లేదని ఎద్దేవా చేశారు.

Harish Rao fires at Kodandaram

మియాపూర్ భూకబ్జా అంశంపై హరీశ్ రావు గురువారం మీడియాతో మాట్లాడారు. మియాపూర్ భూముల్లో ఒక్క గజం కూడా కబ్జా కాలేదని అన్నారు. భూ అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్, టీడీపీలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. ప్రభుత్వం బయటపెట్టిన విషయాన్నే విపక్షాలు చెబుతున్నాయని అన్నారు.

అవకతవకలకు పాల్పడిన అధికారులను సస్పెండ్ చేయడంతోపాటు అరెస్టులు కూడా చేయించామని హరీశ్ రావు తెలిపారు. అక్రమాలపై గతంలో ఆరోపణలు వచ్చిన గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ విషయంలో అవకతవకలు జరిగాయే తప్ప, ఎక్కడా అవినీతి జరగలేదని స్పష్టం చేశారు.

ఎన్నికల్లో ఓడిపోయి నిరాశలో కూరుకుపోయిన విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాయని ఆరోపించారు. అక్రమాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇప్పటికే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ రద్దు చేసినట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్ అక్రమాలపై ఇప్పటికే విచారణకు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రతీ అంశాన్ని లోతుగా పరిశీలిస్తున్నారని తెలిపారు.

సిగ్గు చేటు: వైయస్ కూడా అంగీకరించారు

తమ ఆరోపణలు అవాస్తవమని తేలితే కాంగ్రెస్ పార్టీ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ముక్కు నేలకు రాయాలని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు అవినీతి, అక్రమాల గురించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు, నేతలు ఎన్ని స్కాములు చేశారో అందరికీ తెలుసునని అన్నారు.

ఈఎన్టీ, ఈఎస్ఐ భూములను కూడా ఆక్రమించేందుకు కుట్రలు పన్నారని ఆరోపించారు. మాజీ సీఎం వైయస్ కూడా అసైన్డ్ భూములని తెలియకుండానే కొనుగోలు చేశానని అసెంబ్లీలోనే అంగీకరించారని చెప్పారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య.. దళితుల భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు.

రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని హరీశ్ రావు తెలిపారు. ఇంగ్లీష్ మీడియాలో కూడా మియాపూర్ భూములపై కథనాలు వచ్చాయని, కథనాలు రాస్తే తమకు అభ్యంతరం లేదు గానీ, తెలుసుకుని రాయాలని సూచించారు. ప్రభుత్వ వివరణ కూడా తీసుకుంటే మంచిదని అన్నారు. దయచేసి వాస్తవాలు రాయాలని ఈ సందర్భంగా హరీశ్ రావు మీడియాకు విజ్ఞప్తి చేశారు. అక్రమాలకు పాల్పడిన వారు ఏ పార్టీలో ఉన్నా.. ఏ స్థాయిలో ఉన్నా చర్యలు తప్పవని హరీశ్ రావు స్పష్టం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana minister Harish Rao on Thursday fired at TJAC chairman Prof. Kodandaram and responded on Miyapur land scam.
Please Wait while comments are loading...