వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జేఈఈలో తెలుగు విద్యార్థుల సత్తా: హైదరాబాదీకి 6వ ర్యాంక్, 100లో 30మంది మనవాళ్లే!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో జాతీయ స్థాయిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులను సాధించి సత్తా చాటారు. జాతీయ స్థాయిలో ఓపెన్‌ కేటగిరీలో 6, 9 ర్యాంకులను కైవసం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన మోహన్‌ అభ్యాస్‌ మొత్తంగా 360 మార్కులకుగాను 345 మార్కులను సాధించారు. అలాగే డి.వరుణ్‌తేజ చౌదరి 9వ ర్యాంకు, బి.వెంకటపవన్‌ 11వ ర్యాంకును కైవసం చేసుకున్నారు.

గురువారం జేఈఈ మెయిన్‌ ఫలితాలను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) విడుదల చేసింది. మొత్తంగా జేఈఈ మెయిన్‌ ఫలితాల ఆధారంగా చూస్తే.. తెలుగు విద్యార్థులు ఎక్కువ మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారు.

ఏప్రిల్ 2న ఆఫ్‌లైన్‌లో.. 8, 9 తేదీల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించిన జేఈఈ మెయిన్‌ పరీక్షకు దేశవ్యాప్తంగా 11.8 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా.. తెలంగాణ నుంచి దాదాపు 65 వేలమంది, ఆంధ్రప్రదేశ్‌ నుంచి దాదాపు 78 వేల మంది పరీక్ష రాశారు. మొత్తంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 35 వేల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించినట్లు తెలిసింది. టాప్‌-100 ర్యాంకుల్లో 30 ర్యాంకుల వరకు తెలుగు రాష్ట్రాల విద్యార్థులే కైవసం చేసుకున్నారు.

JEE results out; Telugu students figure in top 10

కాగా, గత సంవత్సరం జేఈఈ మెయిన్స్‌లో తెలుగు రాష్ట్రాల నుంచి 23 వేల మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించగా.. ఈసారి ఆ సంఖ్య 35 వేలకు పెరిగింది. అయితే గతేడాది మెయిన్‌ పరీక్షలో టాప్‌ 2 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా పరిగణనలోకి తీసుకోగా... ఈసారి టాప్‌ 2.2 లక్షల మంది అర్హులుగా తీసుకున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైన విద్యార్థుల్లో అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించినవారి సంఖ్య పెరిగింది. మరోవైపు కటాఫ్‌ మార్కులు తగ్గడం కూడా ఇందుకు దోహద పడినట్లు చెబుతున్నారు.

ఈసారి జేఈఈ మెయిన్‌ ఆలిండియా ర్యాంకుల ఖరారులో ఇంటర్మీడియట్‌ మార్కులను పరిగణనలోకి తీసుకోకపోవడంతో... సీబీఎస్‌ఈ ఫలితాలతోపాటు ర్యాంకులను కూడా వెంటనే ప్రకటించింది. గతంలో ఆలిండియా ర్యాంకుల ఖరారులో జేఈఈ మెయిన్‌ స్కోర్‌కు 60 శాతం, ఇంటర్మీడియట్‌ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇచ్చి తుది ర్యాంకులను ఖరారు చేసేవారు. అందువల్ల మొదట జేఈఈ మెయిన్‌ ఫలితాలను విడుదల చేసేసి.. తరువాత ర్యాంకులను ప్రకటించేవారు. తాజాగా ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ రద్దు చేయడంతో ఫలితాలతోపాటే జేఈఈ మెయిన్‌ స్కోర్‌ ఆధారంగా ర్యాంకులను ప్రకటించారు.

అబ్బాయిలదే హవా

జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో మొత్తంగా అబ్బాయిలే ఆధిపత్యం సాధించారు. తొలి వెయ్యి ర్యాంకుల్లో ఏకంగా 932 మంది అబ్బాయిలే కావడం విశేషం. అంతేకాదు టాప్‌ 5వేల ర్యాంకుల్లోనూ 4,534 మంది అబ్బాయిలే. అసలు తొలి 70 ర్యాంకుల్లో ఒక్క అమ్మాయి కూడా నిలవలేదు. అమ్మాయిల్లో అత్యుత్తమంగా వృందా నందకుమార్‌ రాఠీ అనే విద్యార్థిని 321 మార్కులతో 71వ ర్యాంకు సాధించింది. అమ్మాయిల్లో రెండో స్థానంలో 96వ ర్యాంకు (319 మార్కులు)తో పూర్వా గార్గ్, మూడో స్థానంలో 102వ ర్యాంకు (318 మార్కులు)తో నారాయణ జీవనరెడ్డి నిలిచారు.

రాజస్థాన్‌ విద్యార్థి టాప్‌ 360/360

రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన కల్పిత్‌ వీరాల్‌ అనే విద్యార్థి జేఈఈలో మొత్తం 360 మార్కులకు 360 సాధిం చి టాప్‌లో నిలిచాడు. జేఈఈ మెయిన్‌ చరిత్రలో ఓ విద్యార్థి ఇలా వంద శాతం మార్కులు సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక రెండు, మూడు ర్యాంకులను ఢిల్లీకి చెందిన వాసు జైన్, అనన్యే అగర్వాల్‌ సాధించారు.
ప్రతిభ చాటిన గురుకుల విద్యార్థులు

జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ విద్యార్థులు ప్రతిభ చూపారు. సర్వేల్, హసన్‌పర్తి, ఎల్‌బీనగర్, నాగారం కాలేజీలకు చెందిన 21 మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారు. వీరిలో తొలి మూడు స్థానాల్లో సీహెచ్‌.సాయిచరణ (144 మార్కులు), దానియాల్‌ అహ్మద్‌ వసీం (112 మార్కులు), జె.భరత్‌కుమార్‌ (96 మార్కులు) నిలిచారు. ప్రతిభ చూపిన విద్యార్థులను సొసైటీ కార్యదర్శి శేషుకుమారి అభినందించారు.

సివిల్‌ సర్వీసెస్‌ చదివి కలెక్టర్‌ను అవుతా: 9వ ర్యాంకు విద్యార్థి

నిజామాబాద్‌ మండలం పాంగ్రా (జీ) పరిధిలోని మహాలక్ష్మీ నగర్‌కు చెందిన వరుణ్‌తేజ జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో ఆలిండిచా 9వ ర్యాంకు సాధించాడు. సౌత్‌ ఇండియాలో రెండో ర్యాంకు సాధించాడు. వరుణ్‌తేజ్‌ హైదరాబాద్‌లోని శ్రీచైతన్య-నారాయణ కాలేజీలో చదువుకున్నాడు.

వరుణ్‌తేజ్‌ తండ్రి డి.రవీందర్‌ నిజామాబాద్‌ జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. తల్లి పేరు డి.సుమల. వీరికి వరుణ్‌తేజ్‌ రెండో కుమారుడు. ఇంటర్‌లో 981 మార్కులు సాధించాడు. కాగా, 9వ ర్యాంకు రావడం సంతోషంగా ఉందని వరుణ్‌తేజ్‌ చెప్పాడు. బీటెక్‌ పూర్తి చేశాక సివిల్‌ సర్వీసెస్‌ చదివి కలెక్టర్‌ అవుతాని పేర్కొన్నాడు. తనకు ర్యాంకు రావడానికి అన్ని విధాల సహకరించిన తల్లిదండ్రులకు, గురువులకు కృతజ్ఞతలు చెప్పాడు.

సైంటిస్ట్ కావాలన్నదే నా కల

తాను సైంటిస్ట్ కావాలనుకుంటున్నట్లు ఆలిండియా 6వ ర్యాంకు, సౌత్‌ఇండియాలో మొదటి ర్యాంకు సాధించిన మోహన్‌ అభ్యాస్ (పాలకొల్లు) చెప్పాడు. తాను ఆలిండియా పదో ర్యాంకు టార్గెట్‌ చేసుకుని చదివినట్లు చెప్పాడు. అయితే, కష్టంతో, ఇష్టంతో చదివి ఆలిండియా 6వ ర్యాంకు, సౌత్‌ఇండియాలో మొదటి ర్యాంకు సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ఇది తన జీవితంలో మరిచిపోలేని సందర్భమని తెలిపాడు. తన తండ్రి సుబ్బారావు సమోసాల వ్యాపారం చేస్తూ తననుఎంతో కష్టపడి చదివిస్తున్నారని చెప్పాడు.

రోబోలు చేయాలనేదే కల

ఆలిండియా 11వ ర్యాంకు, సౌత్‌ఇండియా 3వ ర్యాంకు సాధించిన బొల్ల వెంకట్ పవన్(రాజమండ్రి) మాట్లాడుతూ.. 'నేను మొదటి నుంచి ఫస్ట్‌క్లాస్‌ స్టూడెంట్‌నే. చిన్నప్పటి నుంచి రోబోలను సొంతంగా తయారు చేసి గుర్తింపు సాధించాలనేది నా ఆశ. అంతకంటే ముందు బాగా చదివి ర్యాంకులు తెచ్చుకోవాలి అని అందరూ అనేవారు. అలా చదువుపై దృష్టిసారించాను. ఈ ర్యాంకులు రావడం నా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది' అని వివరించాడు.

ఇష్టపడి చదివితేనే..

'నాకు చదువంటే చాలా ఇష్టం. అమ్మ, నాన్నలు కూడా ఎప్పుడూ నన్ను చదువులో బలవంతం చేయలేదు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మంచి ర్యాంకులు సాధిస్తావని చెప్పేవారు. వారి స్ఫూర్తితోనే ఇష్టంతో చదివి ఈ ర్యాంకులను సొంతం చేసుకోగలిగాను' అని ఆలిండియా 13, సౌత్‌ఇండియా4వ ర్యాంకు సాధించిన అబ్దుల్‌ మోయిజ్(మచిలీపట్నం) చెప్పుకొచ్చాడు.

English summary
Students of Sri Chaitanya and Narayana group of institutions continued their good performance in the Joint Entrance Exam (JEE-Main) results that were declared on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X