వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నల్లగొండ టీడీపీలో మోత్కుపల్లి ఏకాకిగా మిగిలారా..!?

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ పట్ల అనుసరిస్తూ వచ్చిన 'రెండు కళ్ల సిద్ధాంతం' భారీగానే నష్టం చేకూర్చిందన్న అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ గెలుపొందిన తర్వాత ఆ పార్టీలో చేరుతున్న వారిలో టీడీపీ నేతలే ఎక్కువ. 15 మంది ఎమ్మెల్యేలు గెలుపొందితే 12 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరిపోతే, టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పని చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి ఆయన సహచరులు కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. కొద్దీగొప్పా మిగిలిన నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అధికార టీఆర్ఎస్ పక్షాన నిలిచారు. అటువంటి వారిలో కంచర్ల భూపాల్ రెడ్డి తాజాగా మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి ఆమె కుమారుడు సందీప్‌రెడ్డి 'కారు' ఎక్కేస్తున్నట్లు తేల్చేయడంతో తొలితరం టీడీపీ నేతల్లో అందునా నల్లగొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన వారిలో మోత్కుపల్లి నర్సింహులు మాత్రమే మిగిలారు.

Recommended Video

Revanth Reddy Speech at Congress Praja Garjana Meet
1989లో ఇండిపెండెంట్‌గా విజయం

1989లో ఇండిపెండెంట్‌గా విజయం

మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి కంటే ముందే.. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983లో జరిగిన ఎన్నికల్లో ఆలేరు నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన మోత్కుపల్లి నర్సింహులు నాటి నుంచి జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తూనే ఉన్నారు. 1984లో ఆగస్టు సంక్షోభం.. నాదేండ్ల భాస్కర్‌రావు వెన్నుపోటుతో టీడీపీ వ్యవస్థాపక అధినేత ఎన్టీఆర్.. మళ్లీ ప్రజాతీర్పు పొందాలని ఆకాంక్షించి 1985లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించారు. తర్వాత మోత్కుపల్లి నర్సింహులు, ఎలిమినేటి మాధవరెడ్డి జిల్లా నుంచి ఎన్నికవ్వడంతోపాటు ఎన్టీఆర్ క్యాబినెట్‌లో చోటు సంపాదించుకున్నారు. కానీ 1989 నాటికి మాధవరెడ్డితో ఘర్షణకు దిగిన మోత్కుపల్లి నర్సింహులు అంటే ఎన్టీఆర్ మండిపడ్డారు. 1989 ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది.. ఎన్టీఆర్ దీవెనలు అందుకున్నారు. అప్పట్లో మోత్కుపల్లి నర్సింహులుకు, మాధవరెడ్డికి మధ్య తీవ్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్ధం సాగింది.

2000లో మాధవరెడ్డి మరణం తర్వాత టీడీపీలోకి..

2000లో మాధవరెడ్డి మరణం తర్వాత టీడీపీలోకి..

1994 ఎన్నికల్లోనూ ఇద్దరూ టీడీపీ పక్షాన గెలుపొంది మళ్లీ ఎన్టీఆర్ క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ దఫా లక్ష్మీ పార్వతి రంగ ప్రవేశం చేయడంతో మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్ - లక్ష్మీ పార్వతికి మద్దతుదారుగా నిలిచారు. చంద్రబాబు - మాధవరెడ్డి - తూళ్ల దేవేందర్ గౌడ్ వంటి వారి వ్యూహాలతో టీడీపీలో చీలిక వచ్చింది. చంద్రబాబు నాయుడుకే టీడీపీ సారథ్యం చిక్కింది. లక్ష్మీ పార్వతి - ఎన్టీఆర్ వర్గంలో మిగిలిన నేతల్లో చాలా మంది నేతలు 1999 ఎన్నికల నాటికి చంద్రబాబుతో కలిసిపోయినా మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన మోత్కుపల్లి నర్సింహులు.. 2000 మార్చి ఏడో తేదీన నక్సల్స్ దాడిలో నాటి మంత్రి మాధవరెడ్డి మరణించిన తర్వాత మళ్లీ టీడీపీ పక్షానికి చేరుకున్నారు.

2009 తర్వాత ఇలా మోత్కుపల్లి సవాళ్లు

2009 తర్వాత ఇలా మోత్కుపల్లి సవాళ్లు

2004 ఎన్నికల నాటికి టీఆర్ఎస్ పక్షాన పోటీ చేసిన డాక్టర్ నగేశ్ చేతిలో తొలిసారి ఓటమి పాలైన మోత్కుపల్లి నర్సింహులు.. 2009 ఎన్నికల నాటికి తుంగతుర్తి (ఎస్సీ) స్థానం నుంచి విజయం సాధించారు. అదే ఏడాది డిసెంబర్ తొమ్మిదో తేదీన కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించడంతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల మధ్య రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు విడిపోయారు. మోత్కుపల్లి నర్సింహులు వంటి వారు టీడీపీ అధినాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటూ నాటి అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుత అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేస్తూ వచ్చారు. ఒకానొక దశలో చేతిలో ఉరితాడు పట్టుకుని అసెంబ్లీ ముందు ప్రదర్శనకు దిగారు. అదే ప్రదర్శనలో తనతో కలిసి రావాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సవాళ్లు విసిరారు.

2014లో మధిర నుంచి మోత్కుపల్లి ఓటమి

2014లో మధిర నుంచి మోత్కుపల్లి ఓటమి

2009 డిసెంబర్ తొమ్మిదో తేదీ తర్వాత తెలంగాణలో నాటి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ నుంచి నాయకులు క్రమంగా టీఆర్ఎస్‌లోకి వలసలు మొదలయ్యాయి. ఆదిలాబాద్ నుంచి వరంగల్ జిల్లా వరకు మహబూబ్ నగర్ నుంచి ఖమ్మం జిల్లా వరకు అడుగడుగునా టీడీపీ నేతలంతా ‘కారెక్కేశారు'. 2014 ఎన్నికల నాటికి పరిస్థితి మరింత విషమించింది. తుంగతుర్తి నుంచి పోటీ చేసినా గెలుపొందే పరిస్థితి లేకపోవడంతో పొరుగున ఉన్న ఖమ్మం జిల్లా మధిర (ఎస్సీ) రిజర్వుడ్ స్థానం నుంచి పోటీ చేసి ప్రస్తుత టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క చేతిలో ఓటమి పాలయ్యారు. నాటి నుంచి కొంత కాలం వరకు క్రియాశీల రాజకీయాల్లో మౌనంగా ఉన్నారు.

భువనగిరి జిల్లా కోసం ఇలా మోత్కుపల్లి పాదయాత్ర

భువనగిరి జిల్లా కోసం ఇలా మోత్కుపల్లి పాదయాత్ర

2014లో సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అడపాదడపా అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. గతేడాది జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఆలేరు, భువనగిరి మండలాలను విడదీయొద్దని సీఎం కేసీఆర్‌ను కోరారు. లక్ష సంతకాలతో పోస్టుకార్డుల ఉద్యమాన్ని చేపడుతున్నట్లు మోత్కుపల్లి తెలిపారు. అంతకుముందు 2015లో పాదయాత్ర కూడా నిర్వహించారు. అదే సమయంలో తన రాజకీయ భవితవ్యం గురించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపైనే ఆశలు పెట్టుకున్నారు. టీడీపీ - బీజేపీ మధ్య అంగీకారం మేరకు గవర్నర్ పదవి కల్పించడానికి ప్రయత్నాలు సాగించారు. ఇటీవల ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కూడా త్వరలో మోత్కుపల్లి నర్సింహులుకు తీపి కబురు అందుతుందన్నారు. తర్వాత కేంద్రం నుంచి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నుంచి తీపి కబురు కోసం ఎదురు చూశారు. కానీ ఇటీవల విజయదశమి సందర్భంగా కొత్త గవర్నర్ల ప్రకటనలో మోత్కుపల్లి నర్సింహులు పేరు రాకపోవడంతో నిరాశతో దసరా పండుగే చేసుకోలేదన్నారు.

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో టీడీపీ పొత్తుపై ఇలా

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో టీడీపీ పొత్తుపై ఇలా

అయినా చంద్రబాబే తనకు దైవం అని చెప్పారు మోత్కుపల్లి నర్సింహులు. ఈ లోగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి దూకుడు.. పార్టీ అధినేత చంద్రబాబుకు కష్టతరంగా మారిందన్న మాటలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ, లోక్‌సభ జమిలీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని రేవంత్ రెడ్డి సంకేతాలివ్వడం టీడీపీ అధినాయకత్వానికి సుతారామూ ఇష్టం లేదని తెలుస్తోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో బీజేపీ - టీఆర్ఎస్ - టీడీపీ పొత్తు ఉంటుందని మోత్కుపల్లి నర్సింహులు మీడియా ముందు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దీంతో అస్తుబిస్తుగా ఉన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అల్లకల్లోలం మొదలైంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా తమ వైఖరి అదేనన్న సంకేతాలిచ్చి విదేశీ పర్యటనకు వెళ్లారు.

రేవంత్ నిష్క్రమణపై మోత్కుపల్లి ఇలా వ్యాఖ్యలు

రేవంత్ నిష్క్రమణపై మోత్కుపల్లి ఇలా వ్యాఖ్యలు

ఈ క్రమంలో రేవంత్ రెడ్డి తన, తనను నమ్ముకున్నవారి భవితవ్యం కోసం ఢిల్లీకి వెళ్లారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన యువనేత రాహుల్ గాంధీతో సమావేశమైనట్లు మీడియాలో వార్తలొచ్చాయి. దానిపైనే టీడీపీ నేతలు నిలదీశారు. కానీ చివరకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు చెప్పి మరీ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. రేవంత్ రెడ్డి నిష్క్రమించడంతో శని వదిలిందని మోత్కుపల్లి వ్యాఖ్యలు చేశారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుని వచ్చే ఏడాది మార్చిలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో మోత్కుపల్లికి, 2020లో గరికపాటి మోహన్ రావుకు సభ్యత్వం కల్పించేందుకు రాయబారాలు నడిపించారు. ఇటు టీఆర్ఎస్ పార్టీ నుంచి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, అటు ఎమ్మెల్యే గాంధీ, టీడీపీ ఎంపీ గరికపాటి మోహన్ రావు.. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎర్రబెల్లి దయాకర్ రావు వంటి వారు జోరుగా రాజీ, పొత్తులపై చర్చలు సాగించారని వార్తలొచ్చాయి.

భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణ రావు ఇలా

భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణ రావు ఇలా

కానీ తర్వాత దాదాపు 15 మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోతే నల్లగొండ కేంద్రంగా రాజకీయాలు నడుపుతున్న కంచర్ల భూపాల్ రెడ్డి, భూపాలపల్లి కేంద్రంగా కీలక పాత్ర పోషించిన గండ్ర సత్యనారాయణరావు ప్రత్యామ్నాయం కోసం ‘కారెక్కేశారు'. దీంతో దాదాపుగా తెలంగాణ టీడీపీలో మోత్కుపల్లి నర్సింహులు, ఎల్ రమణ, ఇనుగాల పెద్దిరెడ్డి, నామా నాగేశ్వర్ రావు వంటి వారు మాత్రమే మిగిలారు. ఇక నల్లగొండ జిల్లాకు వచ్చే సరికి దాదాపుగా టీడీపీ నేతలంతా టీఆర్ఎస్ పక్షానికో, టీడీపీ పక్షానికో చేరిపోయారు. తాజాగా ఉమా మాధవరెడ్డి, ఆమె కుమారుడు సందీప్ రెడ్డి వారి అనుచరులు టీఆర్ఎస్‌లో గురువారం చేరనుండటంతో నల్లగొండ జిల్లా టీడీపీలో మోత్కుపల్లి నర్సింహులు ఒంటరయ్యారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

English summary
TDP desert in united Nalgonda especially Yadadri - Bhongir district with Alimineti Uma Madhava Reddy and her son Sandeep Reddy. Recently TDP leaders gone to Congress party and TRS. Only TDP senior leader Mothkupally Narisimlu as stayed in party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X