పఠాన్‌కోట్ దాడి: పాక్ ప్రమేయంపై 3ఆధారాలు, హైదరాబాద్‌లో ఉగ్ర కదలికలపై ఆరా
హైదరాబాద్: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నట్లుగా ఆధారాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు హతమైన అనంతరం ఎయిర్ బేస్ అణువణువును గాలిస్తున్నారు. దీంతో మూడు కీలక ఆధారాలు లభించాయి.
వీరందరూ ధరించిన షూస్ పాకిస్థాన్‌లో లభించే ఓ ప్రముఖ బ్రాండ్‌వేనని అధికారులు గుర్తించారు. తీవ్రవాదులు తమ వద్ద ఉంచుకున్న బ్యాటరీలను స్వాధీనం చేసుకున్న సైన్యం అవి మేడిన్ పాకిస్థాన్ బ్యాటరీలని గుర్తించింది.
వారు వాడిన ఏకే-47 రైఫిళ్ల పైనా మేడిన్ పాకిస్థాన్ అని అక్షరాలు ఉన్నాయి. ఈ ఆధారాలన్నీ పాకిస్తాన్ ప్రమేయాన్ని సూచించేవేనని అధికారులు చెబుతున్నారు. ఈ దాడి తమ పనేనని పాకిస్తాన్ కేంద్రంగా నడుస్తున్న యునైటెడ్ జీహాద్ కౌన్సిల్ ప్రకటించగా, భారత్ మాత్రం ఈ దాడి జైషే మొహమ్మద్‌దేనని వాదిస్తోంది.

హైదరాబాద్‌లో ఉగ్రవాద కదలికలపై ఆరా
హైదరాబాద్‌లో ఉగ్రవాద కదలికలపై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీశాయి. పఠాన్‌కోట్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర నిఘా వర్గాల ఉన్నతాధికారులు హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోందని వార్తలు వచ్చాయి.
ఢిల్లీ నుంచి వచ్చిన ఇద్దరు అధికారులు రెండురోజులుగా చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లలో ఉంటున్న ఉగ్రఖైదీల వివరాలను తీసుకున్నారని తెలుస్తోంది.
లష్కరే తోయిబా, హుజీ, ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థల సభ్యులతో సంబంధాలున్న హైదరాబాదీయుల వివరాలు, ప్రస్తుతం వారేం చేస్తున్నారన్న అంశాలను సేకరించినట్లుగా తెలుస్తోంది.
ఐసిస్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న ఉగ్రవాదుల్లో ఏడుగురు హైదరాబాద్ జైళ్లలో ఉన్నారని, వారితో సంబంధాలున్నవారిలో 18మంది కర్ణాటక, మహారాష్ట్ర జైళ్లలో ఉన్నారని హైదరాబాద్ పోలీస్ అధికారులు వారికి వివరించారని సమాచారం.
దేశంలోని దిల్లీ, ముంబై తర్వాత హైదరాబాద్‌కు ఉగ్రముప్పు ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు చేపట్టాలని, శంషాబాద్ విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేయాలంటూ కేంద్ర నిఘా అధికారులు సూచించినట్లుగా తెలుస్తోంది.