సికింద్రాబాద్ అల్లర్లు: మరో 10 మంది నిందితుల అరెస్ట్, కుట్ర చేసింది వీరే
హైదరాబాద్: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన అల్లర్ల ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో మరో రిమాండ్ రిపోర్టును పోలీసులు విడుదల చేశారు. ఈ అల్లర్ల ఘటనలో మొత్తం 56 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు.. ఇప్పటికే 46 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా, ఈ అల్లర్లతో ప్రమేయం ఉన్న మరో 10 మంది నిందితులను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు.
అల్లర్ల కేసులో కీలక నిందితుడు, ఏ-2 పృథ్వీరాజ్‌తో పాటు.. మరో 9 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వాళ్లందరిని అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత నిందితులను సికింద్రాబాద్ రైల్వే కోర్టులో హాజరుపర్చారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చిన తర్వాత పోలీసులు చంచల్‌గూడ జైలుకి తరలించారు.

జూన్ 17వ తేదీన జరిగిన విధ్వంసంలో సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన ఆవుల సుబ్బారావు మద్దతు ఇస్తున్నాడని కొంతమంది విద్యార్థులు చర్చించుకున్నారని వివరించారు. ఆవుల సుబ్బారావుతోపాటు సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన శివ ఆందోళనకారులకు సహకరించినట్టు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు.
ఆందోళనకారులకు సుబ్బారావు, శివ పలు విధ్వంసక వస్తువులు అందించినట్టు పోలీసులు తెలిపారు.
కాగా, వాట్సాప్ గ్రూపుల ద్వారానే ఆందోళన కార్యక్రమానికి ప్రణాళిక జరిగిందని గుర్తించిన పోలీసులు.. మొదటగా అడ్మిన్లుగా ఉన్న ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అడ్మిన్లుగా ఉండి అందులోని సభ్యులను రెచ్చగొట్టేలా వారు పోస్టింగులు చేసినట్లు తేల్చారు. ఏ సమయంలో ఎక్కడికి చేరుకోవాలి.. రైల్వే స్టేషన్లోకి ఎలా వెళ్లాలనే ప్రణాళికను సిద్ధం చేసుకొని.. వాట్సాప్ ద్వారా యువకులకు సమాచారం చేరవేశారని పోలీసులు వెల్లడించారు.
పెట్రోల్ బాటిళ్లతో స్టేషన్లోకి ప్రవేశించిన వారు ముందే విధ్వంసానికి ప్లాన్ చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లతో పాటు, గ్రూపులో విధ్వంసానికి సంబంధించిన సంభాషణలు చేసిన వివిధ ప్రాంతాల వారిని.. మంగళవారం రాత్రి రైల్వే పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చి విచారణ చేశారు. మొత్తంగా 10మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు.
ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగిన విధ్వంసాన్ని చూసి స్ఫూర్తి పొందినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కొంత మంది కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు, యువకులను రెచ్చగొట్టినట్లు అనుమానిస్తున్నారు. ఏయే కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల హస్తం ఉందనే వివరాలను సేకరిస్తున్నారు. ఈఘటనలో ఆర్మీ కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల పాత్ర ఉందని తేలితే వాళ్లపైనా చట్టప్రకారం చర్యలు తీసుకోనున్నారు పోలీసులు.