ఇంటర్ సప్లమెంటరీ పరీక్షకు నిముషం లేట్.. పరీక్ష రాయనివ్వలేదని విద్యార్థిని తీవ్రనిర్ణయం
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సప్లమెంటరీ ఫస్టియర్ పరీక్ష రాయడానికి వెళ్లిన ఒక విద్యార్థిని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఇంటర్మీడియట్ సప్లమెంటరీ ఫస్టియర్ ఇంగ్లీష్ పరీక్ష రాయడానికి వెళ్లిన జాటో సమీరా అనే విద్యార్థిని పరీక్ష కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వెళ్లింది. దీంతో పరీక్షా కేంద్రం నిర్వాహకులు విద్యార్థినిని పరీక్ష రాయడానికి అనుమతించలేదు.

ఇంటర్ సప్లమెంటరీ పరీక్షకు అనుమతించని నిర్వాహకులు .. పురుగుల మందు తాగిన విద్యార్థిని
విద్యార్థిని ఎంతగా ప్రాధేయపడినా పరీక్ష కేంద్రం నిర్వాహకులు సమయం దాటిన తర్వాత పరీక్ష రాయటానికి అనుమతించబోమని తేల్చిచెప్పారు. ఒక నిమిషం ఆలస్యమైన కారణంగా పరీక్ష కేంద్రం నుండి వెళ్లాలని ఆమెకు సూచించారు. దీంతో పరీక్ష రాయలేక పోయిన సమీరా తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆపై ఇంటికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. పరీక్ష రాయకుండా ఇంటికి వచ్చిన కుమార్తె పురుగుల మందు తాగిన విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఆస్పత్రిలో విద్యార్థినికి చికిత్స
ప్రస్తుతం ఆసుపత్రి వైద్యులు సదరు విద్యార్థినికి చికిత్స చేస్తున్నారు. ఇక కళాశాలల యాజమాన్యం దీనిపై వివరణ ఇస్తూ, ఇంటర్మీడియట్ పరీక్షల నియమ నిబంధనల మేరకు విద్యార్థిని ఆలస్యంగా వచ్చిన కారణంగా పరీక్షకు అనుమతించలేదని తెలిపారు. సమయపాలన పాటించకుండా పరీక్షకు ఆలస్యంగా వెళ్లడం విద్యార్థిని చేసిన తప్పు. ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల విషయంలో నియమ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నా, అలర్ట్ గా లేకపోవడం విద్యార్థిని తప్పు. తప్పులు చేసి దిద్దుకోకుండా జీవితాన్నే ముగించాలని చూడటం అతిపెద్ద తప్పు.
చిన్న కారణాలకే ఆత్మహత్యలా.. యువత తీవ్ర నిర్ణయాలపై ఆందోళన
అయితే చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు ప్రయత్నించడం ఇటీవల సర్వసాధారణంగా మారింది. ఏదేమైనా విద్యార్థులు పరీక్ష రాయలేదనో, అమ్మ తిట్టిందనో, పరీక్ష తప్పేమనో చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలకు పాల్పడడం మంచిది కాదని చెబుతున్నారు మానసిక నిపుణులు. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవాటు చేసుకుంటే ఇబ్బందులు రావని, ఒకవేళ వచ్చినా వాటిని సమర్ధంగా ఎదుర్కోగలుగుతారని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications