వచ్చేనెలలో తెలంగాణకు కొత్త డీజీపీ: ఏడుగురిలో ముగ్గురి పోటీ

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: తెలంగాణకు కొత్త పోలీస్‌ బాస్‌ నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ప్రస్తుత డీజీపీ అనురాగ్‌శర్మ వచ్చే నెల 12వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో నూతన డీజీపీ నియామకం కోసం యూపీఎస్సీకి పంపాల్సిన జాబితాపై కసరత్తు కొలిక్కి వచ్చినట్టు సీనియర్‌ ఐపీఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇప్పటికే డీజీపీ హోదాలో ఉన్న అధికారుల బయోడేటా, ట్రాక్‌ రికార్డు, కేసులు, క్లియరెన్సులు, విజిలెన్స్‌ సర్టిఫికెట్‌ తదితర వ్యవహారాలు మొత్తం పూర్తయినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద డీజీపీ అభ్యర్థుల వార్షిక కాన్ఫిడెన్షియల్‌ రిపోర్ట్‌ సైతం క్లియర్‌ అయినట్టు సచివాలయ వర్గాలు చెప్పాయి.

 యూపీఎస్సీ నుంచి మూడు పేర్లు

యూపీఎస్సీ నుంచి మూడు పేర్లు

డీజీపీ ఎంపిక ప్రక్రియ కోసం ప్రభుత్వం రాష్ట్ర కేడర్‌లో డీజీపీ హోదాలో పనిచేస్తున్న ఏడుగురు అధికారుల పేర్లను రెండు రోజుల్లో యూపీఎస్సీకి పంపిస్తోంది. ఇందులో 1983 బ్యాచ్‌కు చెందిన తేజ్‌ దీప్‌కౌర్, 1984 బ్యాచ్‌ అధికారి సుదీప్‌ లక్టాకియా, 1985 బ్యాచ్‌ అధికారి ఈష్‌కుమార్, 1986 బ్యాచ్‌ అధికారులు రాజీవ్‌ త్రివేది, మహేందర్‌రెడ్డి, అలోక్‌ ప్రభాకర్, కృష్ణప్రసాద్‌ పేర్లు ఉన్నాయి. ఈ జాబితాలోని అధికారుల ట్రాక్‌ రికార్డు, ఏసీఆర్‌లు, తదితరాలు పరిశీలించిన తర్వాత యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ముగ్గురు అధికారుల పేర్లను రాష్ట్రానికి తిరిగి పంపిస్తుంది. ఈ ముగ్గురిలో ఒకరిని పూర్తి స్థాయి డీజీపీగా నియమించుకునే అధికారం సీఎం కేసీఆర్‌కు ఉంటుంది.

 ఆ ముగ్గురిలో ఒకరికి అవకాశం ఇలా

ఆ ముగ్గురిలో ఒకరికి అవకాశం ఇలా

రాష్ట్ర కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్, ప్రస్తుతం కేంద్ర సర్వీసులోని సీఆర్‌పీఎఫ్‌ అదనపు డీజీపీగా ఉన్న సుదీప్‌ లక్టాకియాకు అవకాశం రాకపోవచ్చని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం కేంద్ర హోంశాఖ ఆయనకు డీజీపీ హోదా పదోన్నతితో పాటు సీఆర్‌పీఎఫ్‌ ప్రత్యేక డీజీపీగా పోస్టింగ్‌ ఇస్తూ ఆదేశాలిచ్చింది. దేశంలోనే అత్యంత కీలకమైన పోలీస్‌ యూనిట్‌కు బాస్‌గా నియమించడంతో లక్టాకియా రాష్ట్రానికి వచ్చే అవకాశం లేదని ఆయన సన్నిహితులు స్పష్టంచేశారు. అంత కీలక పదవి వదులుకొని రాష్ట్ర డీజీపీ రేసులోకి వచ్చేందుకు ఆయన ఆసక్తి చూపడంలేదని వారు తెలిపారు. ఇకపోతే మిగిలిన ఆరుగురిలో ఒకరిపై క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉండగా, మరో అధికారి అలోక్‌ ప్రభాకర్‌ 15 ఏళ్లుగా కేంద్ర సర్వీసులోనే కొనసాగుతున్నారు. ఆయన కూడా రాష్ట్రానికి వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపించడంలేదని తెలుస్తోంది. ఇక మిగిలిన నలుగురిలో ఈష్‌కుమార్‌ దేశ పోలీస్‌ శాఖ డేటా సర్వీసు నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరోకు డైరెక్టర్‌గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు. ఈయన కూడా రాకపోవచ్చని సీనియర్‌ అధికారులు అంటున్నారు. మిగిలిన ముగ్గురు రాజీవ్‌ త్రివేది, మహేందర్‌రెడ్డి, కృష్ణప్రసాద్‌.. వీరి ముగ్గురి పేర్లు యూపీఎస్సీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందే జాబితాలో ఉంటాయని సర్వత్రా చర్చ జరుగుతోంది. వీరిలో ఒకరు డీజీపీగా పదవి చేపడతారు.

 12న కొత్త పోలీస్ బాస్ ఎవరన్నదానిపై ప్రకటన

12న కొత్త పోలీస్ బాస్ ఎవరన్నదానిపై ప్రకటన

రేసులో వినిపిస్తున్న ముగ్గురిలో ఒకరిని నవంబర్‌ 12వ తేదీన ఇన్‌చార్జి డీజీపీగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. నవంబర్‌ 12న అనురాగ్‌శర్మ తన బాధ్యతలను ఇన్‌చార్జి డీజీపీకి అందజేయనున్నారు. ఇక మహేందర్‌రెడ్డి, రాజీవ్‌ త్రివేది, కృష్ణప్రసాద్‌.. వీరిలో ఎవరు ఇన్‌చార్జి డీజీపీగా నియుక్తులు అవుతారన్న దానిపై పోలీస్‌ శాఖలో ఉత్కంఠ నెలకొంది. యూపీఎస్సీకి రెండు రోజుల్లో జాబితా వెళితే.. ముగ్గురి పేర్ల ప్రతిపాదిత జాబితా రావడానికి కనీసం నెల నుంచి మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు సచివాలయ వర్గాలు తెలిపాయి. అప్పటివరకు ఇన్‌చార్జి డీజీపీయే డీజీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Present Telangana DGP will retired on November 12th. In this context Telangana Government will send proposals to UPSC with Seven names. After all conditions observation UPSC will send Three names to Telangana State Government. Telangana CM KCR will declared next DGP on November 12th.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి