వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూపతిరెడ్డి తదుపరి ఎవరు? క్రమశిక్షణపై సీఎం కేసీఆర్ సీరియస్.. కొరడా ఝళిపించేందుకు రెడీ

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధిష్ఠానం ధిక్కార స్వరం వినిపించేవారిపై కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్నది. ఏడాదిన్నరలో జరుగనున్న అసెంబ్లీ, లోక్‌సభ జమిలీ ఎన్నికల నాటికి పార్టీ నేతలు, కార్యకర్తల క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉండకపోతే పరిస్థితి కట్టు తప్పుతుందని భావిస్తున్నట్లు సమాచారం. వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతోపాటు వివిధ స్థాయిల్లో ఉన్న ముఖ్య నేతల వ్యవహార శైలిపై అటు పార్టీ వర్గాలతో, ఇటు పోలీసు యంత్రాంగంతో ఇప్పటికే సమాచారాన్ని సేకరించి పెట్టారని, ఆ నివేదికలను పరిగణరలోకి తీసుకుని ఒక్కొక్కరికి హితబోధ చేయాలని పార్టీ అధినేత, సీఎం కే చంద్రశేఖర్ రావు ఇప్పటికే నిర్ణయానికి వచ్చారని పార్టీ వర్గాల కథనం.

పార్టీ మూడు సర్వేలు నిర్వహించి ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు బయటపెట్టి అవసరమైన సూచనలు చేసిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఒక్కో జిల్లాలో ముగ్గురు.. నలుగురు ఎమ్మెల్యేలకు టికెట్లు రాకపోవచ్చనే ప్రచారం ఊపందుకున్నది. ఇప్పటికే నిజామాబాద్ ఎమ్మెల్సీ ఆర్ భూపతిరెడ్డిపై సస్పెన్షన్ వేటేయాలని జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ ముక్తకంఠంతో నినదిస్తూ తీర్మానం చేశారు. ఇక తాజాగా చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభపై పార్టీ సంస్థాగతంగా క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

నేతల మధ్య ఆధిపత్య పోరు

నేతల మధ్య ఆధిపత్య పోరు

వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి నాయకులు వచ్చి చేరడానికి తోడు ఎన్నికల నాటికి మరికొందరు ముఖ్య నేతలు కూడా టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం నేపథ్యంలో కొత్తవారికి అవకాశాలు కల్పిస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. కొందరు ఎమ్మెల్యేలు బహిర్గతంగా ఎలాంటి వ్యాఖ్యానాలు చేయకున్నా టికెట్‌ రానిపక్షంలో అనుసరించాల్సిన వ్యూహానికి పదును పెట్టుకుంటున్నారని, ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారని ప్రచారం జరుగుతున్నది. ఈ విషయాలు కూడా పార్టీ వర్గాల ద్వారా, నిఘా వ్యవస్థ ద్వారా పార్టీ అధినేతకు చేరాయని చెబుతున్నారు. మూడేళ్లుగా వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన నాయకుల్లో వివిధ కారణాలతో అసంతృప్తి గూడుకట్టుకొని ఉంది. ఇక ఈసారి ఎన్నికల్లో తమకు అవకాశం వస్తుందా రాదా అనే విషయంలో అనుమానం ఉన్న నేతలూ ఇతర ప్రయత్నాల్లో పడ్డారని అంటున్నారు. ఇలాంటి నాయకుల సమాచారం సేకరించడంలో, విశ్లేషించడంలో టీఆర్‌ఎస్‌ నాయకత్వం తలమునకలై ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓ సీనియర్‌ నేత రెండేళ్ల కిందటే టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు పదవి దక్కినా తన మాజీ పార్టీలో ఉన్నంత గుర్తింపు ఇక్కడ దక్కలేదు. ఈ కారణంగానే తిరిగి సొంత గూటికి వెళ్లాలని నిర్ణయించుకుని మంతనాలు జరి పారు. సమాచారం అందగానే పార్టీ నాయకత్వం ఆ నేత బయటకు వెళ్లకుండా విజయవంతంగా నిలువరించగలిగింది.

మహాసభలు ముగియగానే దిద్దుబాటు చర్యలు షురూ..

మహాసభలు ముగియగానే దిద్దుబాటు చర్యలు షురూ..

చొప్పదండి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రమాణ స్వీకారం సందర్భంగా తలెత్తిన పరిణామాలు అధిష్ఠాన వర్గానికి షాక్‌ కలిగించాయని పార్టీవర్గాలు అనుకుంటున్నాయి. స్వయంగా సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన అభ్యర్థి మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేస్తుండగా జిల్లా మంత్రి ఈటల రాజేందర్‌, ఎంపీ వినోద్‌కుమార్‌ స్వయంగా హాజరైనా పట్టించుకోకుండా అక్కడి ఎమ్మెల్యే బొడిగె శోభ పార్టీ నేతలందరికి ఆదేశాలు జారీచేసి తానూ కార్యక్రమానికి రాకుండా దూరంగా ఉండడం పార్టీలో దుమారం లేపింది. నియోజకవర్గంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ మండల శాఖల అధ్యక్షులు, ఇతర నేతలు ఎమ్మెల్యేతో కలిసి ధిక్కారస్వరాన్ని వినిపించడాన్ని పార్టీ అధినాయకత్వం సీరియస్‌గానే తీసుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోకుంటే రాష్ట్రమంతటా ఇలాంటి పరిణామాలే తలెత్తవచ్చని అగ్రనాయకులు భావిస్తున్నారని వినికిడి. ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతుండడంతో మందలింపు వ్యవహారానికి తాత్కాలికంగా బ్రేక్‌ వేశారని తెలుస్తున్నది. మహాసభలు ముగియగానే అధిష్ఠానం చొప్పదండి వ్యవహారంతోపాటు అన్ని నియోజకవర్గాల్లోని పరిస్థితులను సమీక్షించి ఆయా ఎమ్మెల్యేలకు, ముఖ్య నేతలతో మాట్లాడి దిశానిర్దేశం చేయనున్నదని, అధినాయకత్వంతో అంగీకరించని వారిపై చర్యలకు కూడా వెనుకాడబోదని చెబుతున్నారు.

 బోథ్ ఎమ్మెల్యేతో గెడం నగేశ్ విభేదాలు

బోథ్ ఎమ్మెల్యేతో గెడం నగేశ్ విభేదాలు

ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి జోగు రామన్న, మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా మధ్య ఉప్పూనిప్పూగా ఉంది. ఇక ఆదిలాబాద్ ఎంపీ గెడం నగేశ్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు మధ్య విభేదాలు తారాస్థాయిలోనే ఉన్నాయి. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ వర్గాల మధ్య విభేదాలు చెప్పనవసరమే లేదు. గిరిజన సమస్యలపై జరుగుతున్న ఆందోళనకు తెర వెనుక నుంచి మద్దతు ఇస్తున్నఇద్దరు బోథ్ సీనియర్ నేతలను సీఎం కేసీఆర్ మందలించారని వినికిడి. ఇదిలా ఉంటే పార్టీ వర్గాలో జరుగుతున్న ప్రచారం వల్ల తాము నియోజకవర్గాల్లో ధీమాగా ముందుకెళ్లడానికి ఈ వ్యవహారం నైతికంగా వెనుకబడేలా చేస్తున్నదని అధినేతతో వివరించాలని వారనుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సీఎం కేసీఆర్ పలుమార్లు వివిధ సందర్భాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికి టికెట్లు ఇస్తామని ప్రకటించినా పార్టీలోని కొందరు నేతలు వీరికి టికెట్‌ రావడం లేదు, వీరిని దూరం పెట్టనున్నారు, ఇక్కడ ప్రత్యామ్నాయం చూసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ ప్రచారాలు చేస్తుండడంతో నియోజక వర్గంలో తాము దీమాగా వ్యవహరించలేక పోతున్నామని అలాంటి పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని కూడా ఎమ్మెల్యేలు అధినేత కేసీఆర్‌ను కోరే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కేసీఆర్‌ ఈ వ్యవహారంలో స్వయంగా తలదూర్చకుండా జిల్లా మంత్రులు, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి, జిల్లా ఇన్‌చార్జిలతో, ముఖ్యులతో సమావేశాన్ని నిర్వహింపజేసే అవకాశం ఉన్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.

కాంగ్రెస్, బీజేపీల వైపు భూపతిరెడ్డి చూపు

కాంగ్రెస్, బీజేపీల వైపు భూపతిరెడ్డి చూపు

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌కు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ భూపతిరెడ్డి సస్పెన్షన్ దాదాపు ఖరారైనట్లే. ఇప్పటికే ఎంపీ కల్వకుంట్ల కవిత సహా పార్టీ ఎమ్మెల్యేలు ఆయనను సస్పెండ్ చేయాలని తీర్మానిస్తూ సీఎం కేసీఆర్ కు కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ ద్వారా లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సందిగ్ధంలో పడ్డ తన రాజకీయ భవితవ్యంపై భూపతిరెడ్డి ద్రుష్టి పెట్టారని వినికిడి. ఆయన కాంగ్రెస్‌కు చేరువవుతారా? లేక బీజేపీ వైపు మొగ్గు చూపుతారా? అనేది తేలాల్సి ఉంటుంది. ఇప్పటికే పై రెండు పార్టీలకు చెందిన పలువురు నాయకులకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కాంట్రాక్ట్ పనులను అప్పగించారనే ఆరోపణలను ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ఎదుర్కొంటున్నారు. పార్టీ ఫిరాయింపు కోసం గుట్టుగా ఆయన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారనే సంకేతాలు వెలువడడం వల్లే ఆయనపై సస్పెన్షన్ వేటుకు మూకుమ్మడిగా జిల్లా ప్రజాప్రతినిధులంతా సిఫార్సు చేశారనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. భూపతిరెడ్డిపై బహిష్కరణ వేటుకు రంగం సిద్ధమైనట్టు ప్రముఖంగా వార్తా కథనాలు వెలువడడంతో నిజామాబాద్ రూరల్‌తో పాటు బోధన్ తదితర సెగ్మెంట్లకు చెందిన అనుచరులు ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని ఆయన నివాసం వద్ద కలుసుకుని తాజా పరిణామాలపై చర్చించినట్టు తెలిసింది. పార్టీ నుండి సస్పెండ్ చేస్తే, అనుసరించాల్సిన వ్యూహాలు, తీసుకోవాల్సిన నిర్ణయాలపై భూపతిరెడ్డి తన ముఖ్య అనుచరులతో సమాలోచనలు జరిపినట్టు సమాచారం. ఒకవేళ టీఆర్‌ఎస్ నుండి బలవంతంగా బయటకు సాగనంపితే, ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీలో చేరడమే శ్రేయస్కరంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడినట్టు తెలిసింది. ప్రస్తుతం మరికొంతకాలం పాటు వేచిచూసే ధోరణినే అవలంభించాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు.

ఎంపీ సీతారాం నాయక్‌పై మంత్రి తనయుడు దుర్భాషలు

ఎంపీ సీతారాం నాయక్‌పై మంత్రి తనయుడు దుర్భాషలు

2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎన్నికైన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఒక వ్యాపారిపైనే దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. చట్ట విరుద్ధంగా రాళ్ల గ్రానెైట్ తవ్వకాలు చేపడుతున్న ఎమ్మెల్యే లావాదేవీలపై సదరు ట్రేడర్ సంబంధిత జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇక సూర్యాపేట జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.. డీసీసీబీ కుంభకోణంలో సస్పెన్సన్ వేటుకు గురైన ఉద్యోగికి తిరిగి నియామకం విషయమై బ్యాంక్ సీఈఓ మదన్ మోహన్‌పై దుర్భాషలాడిన ఆడియో ఇటీవలే సోషల్ మీడియాలో వైరలైంది. దీనిపై తనను తాను సమర్థించుకున్న ఎమ్మెల్యే వేముల వీరేశం..సదరు ఉద్యోగి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి సహచరుడు కలిసి రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారని ఎదురు దాడికి దిగారు. ఇక జయశంకర్ - భూపాలపల్లి జిల్లా ములుగు ఎమ్మెల్యే - రాష్ట్ర మంత్రి అజ్మీరా చందూలాల్ తనయుడు ప్రహ్లాద్ నేరుగా మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మరీ ఇబ్బందికరంగా ఉన్నాయి. నామినేటెడ్ పదవి కోసం తన వద్దకు వచ్చిన టీఆర్ఎస్ నాయకుడితో ఫోన్‌లో మాట్లాడిన అజ్మీరా ప్రహ్లాద్.. ఎంపీ ఏం పీకుతాడని నోరు పారేసుకున్నారు. సదరు ఎంపీ ‘నీకు ఏం పదవి ఇస్తాడో చూస్తా' అని కూడా వెటకారం కూడా చేశారు.

 శంకర్ నాయక్ శైలిపై రాష్ట్రమంతటా చర్చే

శంకర్ నాయక్ శైలిపై రాష్ట్రమంతటా చర్చే

ఇక మహబూబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వివాదాస్పద వైఖరి అందరికీ తెలిసిందే. జిల్లా కలెక్టర్‌తో ఆయన వ్యవహారశైలి రాష్ట్రమంతటా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవిత గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటమి పాలయ్యారు. ఆమె తండ్రి, డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్.. కూతురు రాజకీయ భవిష్యత్ కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో తనకు, తన కూతురుకు టిక్కెట్లు ఇస్తామని పార్టీ నాయకత్వం హామీ ఇచ్చిందని ఇటీవల బహిరంగంగా రెడ్యానాయక్ పేర్కొనడం గమనార్హం. తండ్రీ కూతుళ్లిద్దరూ తమ ఎమ్మెల్యేలతో కలువకుండా విడిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డోర్నకల్‌ టికెట్‌ ఆశిస్తున్న సత్యవతిరాథోడ్‌కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి, మహబూబాబాద్‌లో టికెట్‌ ఆశిస్తున్న కవిత కు రాష్ట్ర కార్యదర్శి పదవి దక్కింది. టిక్కెట్లు సర్థుబాటు చేయలేని వారికే పార్టీ పదవులను ఇచ్చారని కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. అందుకే సత్యవతిరాథోడ్‌ నియోజకవర్గంలో తిరగడాన్నితగ్గించుకున్నారని చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో సత్యవతి అనుచరులను రెడ్యానాయక్‌ తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

 డోర్నకల్‌లో రెడ్యానాయక్ వారసుడిగా రవిచంద్ర

డోర్నకల్‌లో రెడ్యానాయక్ వారసుడిగా రవిచంద్ర

మహబూబాబాద్‌లో మాత్రం రెడ్యానాయక్‌ కూతురు, మాజీ ఎమ్మెల్యే కవిత సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు పోటీగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. కార్యకర్తలకు, జనానికి ఎమ్మెల్యేతో పోటీపడుతూ పరామర్శిస్తున్నారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను పంపిణీ చేస్తున్నారు. కాగా, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రెడ్యానాయక్‌ వచ్చే ఎన్నికల్లో ‘నాకు.. నా కూతురుకు టిక్కెట్లు' అని వ్యాఖ్యలు చేశారు. రెడ్యా వ్యాఖ్యల తీరు, నియోజకవర్గంలో కవిత పర్యటిస్తున్న జోరు చూస్తుంటే డోర్నకల్‌లో రెడ్యానాయక్‌కు, మహబూబాబాద్‌లో కవితకు టిక్కెట్లు వస్తాయనే భావన కలుగుతోంది. రెడ్యానాయక్‌ రాజకీయ వారసుడిగా ఆయన కుమారుడు రవిచంద్రనాయక్‌ ఇటీవల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారనే విషయం కూడా ఉంది. అదీకాక రెడ్యానాయక్‌ వ్యూహాత్మకంగా తన మనస్సులో ఉన్న మాటను అధిష్టానానికి తెలియజేయడానికి ఈ ప్రకటన చేశారనే వాదన కూడా ఉంది.

English summary
TRS high command serious on leaders indicipline. Recently Nizambad MP and district MLA's and MLC's and other representives recommends to suspend MLC Bhupathi Reddy for TRS president and CM KCR. CM KCR keen interest on party leaders particularly MLA's.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X