
యుఎస్ కాల్పుల్లో ఎన్నారై మృతి
వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్ నేవీ యార్డులో జరిగిన కాల్పుల్లో ఓ ఎన్నారై మరణించాడు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన నేవీ యార్డ్లో దుండగులు సోమవారం రాత్రి జరిపిన కాల్పుల్లో దుండగుడితో పాటు 13 మంది మరణించిన విషయం తెలిసిందే. మృతుల్లో ఎన్నారై విష్ణు పండిట్ (61) ఉన్నట్లు భావిస్తున్నారు.
మరణించిన వారిలో ఏడుగురి మృతదేహలను గుర్తించగా, మిగిలిన వారి వివరాల కోసం అధికారులు ఆరా తీస్తున్నారు. అమెరికాలోని అమెరికన్ నౌకాదళానికి చెందిన వాషింగ్టన్ నౌకాదళ యార్డులోకి ఆగంతకులు సైనిక దుస్తుల్లో చొరబడి కాల్పులకు తెగబడ్డారు. వీరిలో ఒకరిని భద్రతాదళాలు కాల్చివేశాయి.

మరో దుండగుడికి కోసం వారు గాలిస్తున్నారు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 8.20 గంటలకు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. నౌకాదళ యార్డులో 3000 మంది పని చేస్తుండగా, సైనిక దుస్తుల్లో వచ్చిన అగంతకులు ఈ చర్యకు పాల్పడ్డారు.
ఎదురు కాల్పుల్లో మరణించిన దుండగుడ్ని ఆరోన్ ఆలెక్సిస్‌గా గుర్తించారు. 34 ఏళ్ల అతను టెక్సాస్‌లోని ఫోర్త్ వర్త్‌కు చెందినవాడు. అతను 2007 నుంచి 2011 వరకు నేవీలో పనిచేశాడని చెబుతున్నారు. కాల్పుల సంఘటన అనంతరం అధ్యక్షుడు ఒబామా సంఘటన వివరాలు వెల్లడించారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.