ఏది రచన, ఏది కాదు?

Posted By:
Subscribe to Oneindia Telugu

ఈ మాటలు 'లవ్‌ అండ్‌ ద ఫిలాసఫర్‌' అనే నవలలోనివి. ఫిలాసఫర్‌ స్త్రీ పాత్రతో అనే మాటలు. మన తెలుగు ఫిలాఫసర్ల మాటలు కూడా ఇంత కన్నా భిన్నంగా ఏమీ లేవు. ఇటువంటి మాటల ద్వారా మన సాహిత్య విమర్శకులు సృజనాత్మక సాహిత్యాన్ని మాంసం ముద్దలు లేని అస్థిపంజరాలుగా మార్చే ప్రయత్నం చేశారు. రచన వాస్తవికతను ప్రతిబింబించాలనే పేరుతో కల్పనకు చోటు లేకుండా చేశారు. జీవితాన్ని, సమాజంలోని సంఘటనలను ఉన్నదున్నట్లుగా చెప్పాలనే వాదనకు బలం చేకూర్చి పెట్టారు. దీంతో సృజనాత్మక స్థాయిని అందుకోలేని రచనలు కోకొల్లలుగా వచ్చాయి. ఇది వచన రచనలకు మాత్రమే పరిమితం కాలేదు. కవిత్వానికీ ఈ జాడ్యం అంటింది.

జీవితాన్ని కాపీ చేయడమనే పనికి చాలా మంది రచయితలు పూనుకున్నారు. జీవితాన్ని కాపీ చేసినంత మాత్రాన అది సృజనాత్మక రచన కాదనే విషయం చెప్పేవారు తెలుగులో లేకుండా పోయారు. జీవితాన్ని పునఃసృష్టించినప్పుడే రచయిత సృజనాత్మక రచయితగా విజయం సాధిస్తాడనే విషయం తెలిసో, తెలియకో ఎవరూ చెప్పలేదు. రచన జీవిత వాస్తవికతను ప్రతిబింబించడమంటే కేవల యధార్థ సంఘటనలను పేర్చుకుంటూ పోవడం కాదు. Imaginative reality యే సృజనాత్మక రచనకు ఆయువు పట్టు. ఊహించే గుణం లేని చోట సృజనాత్మక రచన ఉదయించదు. అప్పుడే ఆ రచన ఆర్ట్‌ స్థాయిని అందుకుంటుంది. లేదంటే అది కళాత్మకతను సంతరించుకోదు. అటువంటప్పుడు ఆ రచనకు అర్థం లేదు.

కేవలం శిల కళగా అంగీకారయోగ్యం కాదు. శిలను శిల్పంగా మల్చిన తర్వాతే అది కళగా గుర్తింపు పొందుతుంది. ఇదే సూత్రం సృజనాత్మక రచనకు కూడా వర్తిస్తుంది. అందుకే సౌందర్య శాస్త్రమనేది ప్రత్యేకంగా వచ్చింది. ఈస్తటిక్స్‌ అంటే ఏమిటో తెలిసిన రచయిత తన రచన ఎలా వుండాలో నిర్ణయించుకుంటాడు. అట్లని, కచ్చితంగా ఈస్తటిక్స్‌ తెలియాల్సిన అవసరం కూడా లేదు. మన నాయనమ్మలు, అమ్మమ్మలు కథలు ఎంత ఆకర్షణీయంగా చెప్తుతారో, వారు కథ చెప్పడంలో అనుసరించే శిల్ప రహస్యమేమిటో ఒక్కసారి మననం చేసుకున్నా సరిపోతుంది. నాయనమ్మలు, అమ్మమ్మలు చెప్పే కథా పద్ధతులు అనాయసంగానే సంక్రమించిన రచయితలు కూడా వుంటారు. వీరు లౌకిక ప్రలోభాలకు లొంగిపోకుంటే చాలు. తమ రాయదల్చుకున్న దాన్ని ఆకర్షణీయంగా రాస్తే చాలు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి