• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఖాళీల పూరింపే నా కృషి: జయధీర్‌

By Staff
|

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఆచార జయధీర్‌ తిరుమలరావుకు పరిచయం అవసరం లేదు. ఆయన తెలుగు సాహిత్య రంగంలో నిత్య క్రియాశీలి. దేశద్రిమ్మరి కూడా. భుజాన సంచీ వేసుకుని దక్కన్‌ పీఠభూమి నలు చెరుగులా కాలికి బలపం కట్టుకుని తిరిగారు. అజ్ఞాతంగా వున్న తెలంగాణా సాయుధ పోరాట పాటలను, జానపద కళారూపాలను, ప్రజా సాంస్కృతికాంశాలను సేకరించారు.

రైతాంగ పోరాట కాలంలో పాటలు రాసిన అజ్ఞాత కవులలోనూ, జానపద కళాకారులలోనూ తానూ ఒక్కడై కలిసిపోయారు. తెలుగు సాహిత్యంలో ఆ రూపాలకి తగిన స్థానం కల్పిస్తున్నారు. వాటిని పంచి పెట్టారు. గ్రంధాలయాల్లో, ఆర్కైవ్స్‌లో వున్న చారిత్రక పత్రాల దుమ్ము దులిపి వాటి వెలుగులను తెలుగు ప్రజలకు అందించారు. ఆయనతో సంభాషిస్తే నడిచిన, నడుస్తున్న అజ్ఞాత చరిత్రా, సమాంతర చరిత్రా మన కళ్ల ముందు నిలుస్తుంది. సాహిత్య సాంస్కృతిక రంగాల్లో చాలా కాలంగా వుండిపోయిన ఖాళీలను పూరించడానికి తాను కృషి చేశానని జయధీర్‌ తిరుమల రావు 'ఇండియా ఇన్ఫో'తో అన్నారు.

జయధీర్‌ తిరుమలరావు కవిత్వం కూడా రాశారు. 'అరణ్య నేత్రం', 'ప్రతిధ్వనులు' అనే రెండు కవితా సంకలనాలను వెలువరించారు. కొన్ని దశాబ్దాల క్రితం కవిగా ముందుక వచ్చిన తిరుమలరావు మళ్లీ కవిత్వం రాస్తున్నారు. ఇటీవల ఆయన 'ఆగ్రహ గీతాలు' రాసి ఒక సంచలనానికి నాంది పలికారు. ఈ 'ఆగ్రహ గీతాలు' రాయడానికి గల కారణమడిగితే ''ఆగ్రహ గీతాలు రాయాలని రాయలేదు, రాయాల్సి వచ్చింది. ప్రతి కవితకు ఒక సామాజిక ప్రేరణ వుంటుంది. ఉబుసుపోకకు భావాలను వ్యక్తం చేయడం నా వల్ల కాదు. అరణ్య నేత్రం, ప్రతిధ్వనులు కవితలు రాసినప్పుడు కూడా అదే పని చేశాను'' అని అన్నారు. ఆ సామాజిక ప్రేరణ ఏమిటని ప్రశ్నిస్తే- ''గత 15 ఏళ్ల నుంచి మనం దేన్నయితే ప్రశ్నించాలో, సరిదిద్దాలో ఆ పని చేయలేదు. దాని వల్ల నిర్మాణాల్లో ప్రజాస్వామ్యం కొరవడింది. వ్యక్తులు నిర్మాణాల్లోని అధికారం వల్ల మరీ బరితెగించారు.

అందువల్ల ఆధిపత్యం పాళ్లు ఎక్కువై పోయి నిర్మాణానికి దెబ్బ తగిలే పరిస్థితి వచ్చింది. అసలు సాహిత్య సంస్కృతుల ప్రాధాన్యం తగ్గింది. ఏ సంస్థలో వున్నా ప్రజల తరఫున నల్చిన రచయిత, కవి, కళాకారుడు ఒక్కటే. రాజకీయ భావాల్లో తేడా వుండవచ్చు. చైతన్యంలో, సిద్ధాంతాల్లో తేడా వుండవచ్చు. సృజనశీలతను, సృజనను, రాజకీయాన్ని, స్వేచ్ఛను యాంత్రికం చేయడం వల్ల మనం చాలా రచనలు చేయలేకపోయాం. ఇది అభ్యుదయ, విప్లవ సాహిత్యాలకు తీరని లోటు. వీళ్ల ఆధిపత్యం, పట్టు లేని తావుల్లోంచి కొత్త సృజనాత్మకత వ్యక్తమవుతున్నదన్నది వాస్తవం. ఉదాహరణకు- వంగపండు, గద్దర్‌, వీళ్లతో కలిసి పని చేసిన ఎంతో మంది కళాకారులనూ, బెల్లి లలితను ఇటీవలి ఉదాహరణగా చెప్పవచ్చు. ఆధిపత్య కులాలు, వర్గాలు 20, 30 ఏళ్లుగా సంస్థలను తమ ఆజమాయిషీల్లో వుంచుకుని తామే క్రమశిక్షణ తప్పుతూ క్రమశిక్షణను నేర్పిస్తున్నామనే భ్రమలో వుండి ఎంతో నష్టం చేశారు'' అని వివరించారు.

ఇదే విషయాన్ని ఆయన కొనసాగిస్తూ- ''నిజానికి సామాజిక మార్పు కోరే వేలాది మంది సృజనశీలురు నిర్మాణాల బయటే వున్నారు. వాళ్ల కాంట్రీబ్యూషన్‌ను సంస్థలెప్పుడూ పట్టించకోలేదు. పైగా తమ స్వీయ ఆధిపత్య భావాలను అనుసరించి వారిని తక్కువ చేయడానికి ప్రయత్నించడం కూడా గమనించాలి. నిర్మాణం సాహిత్య సృజనని పెంచాలి.ఈ రిజిడిటీ వల్ల, అలాంటి వాతావరణం వల్ల కొత్త జనరేషన్‌ రాలేకపోయింది. అందు వల్ల పెద్ద గ్యాప్‌ ఏర్పడుతుంది'' అన్నారు.

''మీరు కొన్ని సంస్థలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు. తెలుగులో ఆ నిర్మాణాలకు సంబంధం లేకుండా సాహిత్యకారులు ముందుకు వచ్చారు కదా!'' అన్నప్పుడు- ''కొంత మంది యువకులు సామాజిక మార్పు కోరుతూ రాయడానికి సంఘీభావం తెలుపడానికి ముందుకు వస్తున్నారు. కానీ అలాంటివాళ్లు పాత అనుభవాల నుంచి, అధ్యయనాల నుంచి ప్రశ్నలు లేవదీస్తున్నారు. కాని ఆ ప్రశ్నలకు జవాబులు ఇవ్వకుండా ప్రశ్నలను పక్కదారి పట్టించడమో, పట్టించుకోకపోవడమో జరుగుతోంది.

దాని వల్ల నిస్తబ్ద వాతావరణం ఏర్పడింది. విచిత్రమేమిటంటే- జవాబులు ఇవ్వాల్సినవాళ్లే కొత్త ప్రశ్నలు లేపడం, కొత్త ఎజెండాను సృష్టించడం. ప్రతి దినానికి సంధ్య వున్నట్లుగానే ప్రతి దశకీ, పరిణామానికీ ఒక సంధ్య వుంటుంది. సంధ్య వేకువకి మార్గం వేస్తుంది. ఈ సంధ్య దగ్గర మనిషి తన అనుభవాన్ని, భవిష్యత్తు కార్యక్రమాన్ని వివేచించుకుంటాడు. అది రేపటి కార్యక్రమం అవుతుంది. కార్యక్రమం సామూహికమైనప్పుడు పది మందితో కలసిన నిర్మాణాల లోపల, బయటా; సమాజం లోపల, వెలుపలా చర్చ జరగడం సామాన్య విషయం. ఇది మనుగడకు సంబంధించింది. ఇది మానవులే కాదు, పశు పక్ష్యాదులు కూడా చేసే సహజ చర్య. కానీ రేపటి కార్యక్రమంలో మందిని కూడగట్టుకోని సంకుచితత్వం వల్లనే పెడధోరణులు ప్రబలుతున్నాయి.

ఇవి ఎంత దూరం పోయాయంటే కలిసి వచ్చే వాళ్లను కాదని ఇష్టమైన వాళ్లను పరుగులు తీసే వారిగా బ్రాండ్‌ చేయడం దాకా వెళ్లింది'' అన్నారు. దీని వల్ల జరిగే నష్టం ఏమిటని అడిగితే- ''సహజంగానే ఇప్పుడు రాజ్యం కొత్త సమీకరణలకు పూనుకుంది. ప్రపంచబ్యాంక్‌ అప్పుల వల్ల కొత్త కాంట్రాక్టింగ్‌ క్లాస్‌, నియో రిచ్‌, సినిమా, చిట్‌ఫండ్‌ లాంటి అనుత్పాదక పెట్టుబడుల వల్ల పోగుపడిన ధన మదాంధతతో తన ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం కొత్త సమీకరణలను బలోపేతం చేసుకుంటోంది. అంటే, యాభై ఏళ్ల కింద శత్రువులైన బ్రాహ్మణీయం, నయా బ్రాహ్మణీయం ఒకటై పోతున్నాయి. ఇది టీవి, సినిమా, పత్రికలు, సాహిత్యం, సంస్కృతి వంటి రంగాల్లో కనిపించే స్పష్టమై సమీకరణలు. ఈ సమీకరణలు జరగడానికి దళిత చైతన్యం, మైనారిటీ చైతన్యం, మండల్‌ సిఫార్సులు కారణమయ్యాయి. సాహిత్యంలో దళితవాదం, కొంత స్త్రీ వాదం, మైనారిటీ, అస్తిత్వ, ప్రాంతీయ వాదాల వల్ల సామాజిక మార్పు కోరుతున్న అగ్ర కులాలు ఆయా సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో రాజ్యం నిర్వహించే పాత్రను పోషిస్తున్నాయి.

స్పష్టంగా చెప్పాలంటే, బ్రాహ్మణీయం, రెండు అగ్ర కులాలు, కొన్ని వ్యాపార వర్గాలు ఒక్కటై మిగతా కులాలవారందరినీ ప్రేక్షక పాత్రకు నెట్టడం జరుగుతోంది. పైగా, మిగతా కులాల వాళ్లు ఒక రకమైన అణచివేతకు కూడా గురువుతున్నామని బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ బాధకు గల కారణాల గురించి ఆలోచించకుండా వ్యక్తుల నిరసనగా వారిని తిరస్కరిస్తున్నారు. దీని వల్ల సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో మెజారిటీ రచయితల, కళాకారుల ఆవేదనకు అర్థం లేకుండా పోతోంది. ఈ విషయాలను పరిశీలిస్తున్న మేధావులు, ప్రజలు ఒక సంకట స్థితికి లోనవుతున్నారు. ఒక వైపు నిర్బంధాలు పెరుగుతున్నాయి, మరో వైపు సైద్ధాంతిక అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. సామ్రాజ్యవాదపు దాడి వల్ల అసలు పరిస్థితిని అర్థం చేసుకోవడంలో క్లిష్టత ఏర్పడింది. ఈ సందర్భంలో సామాజిక మార్పు కోరే మేధావులు అవగాహన కల్పించాల్సింది పోయి ఆధిపత్య భావాల్లో కూరుకుపోయి పరస్పరం నాయకత్వం కోసం కుమ్ములాడుకుంటున్నారు. ఈ పరిస్థితిలో సరైన దశలో ఒక దిశ కల్పించలేకపోవడం తప్పిదం. దీన్ని మనం గుర్తించాల్సి వుంటుంది'' అని వివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X