• search
  • Live TV
ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తెలంగాణ సంస్కృతి నిధి 'యాది'

By Pratap
|

Samala Sadasiva
ప్రముఖ సాహితీవేత్త, బహు భాషావేత్త సామల సదాశివపై ఇటీవల జయంతి త్రైమాసిక పత్రిక ఓ ప్రత్యేక సంచికను వెలువరించింది. ఈ సంచికలో వివిధ సాహిత్యకారులు, మిత్రుల వ్యాసాలున్నాయి. సామల సదాశివ సాహిత్యాన్ని, కృషిని విశ్లేషించిన వ్యాసాలు కొన్ని అయితే, సదాశివతో తమ పరిచయం గురించి, మూర్తిమత్వం గురించి రాసిన వ్యాసాలు మరికొన్ని ఉన్నాయి. ఈ ప్రత్యేక సంచికకు జితేంద్రబాబు ప్రధాన సంపాదకుడు. దీని వెనక ప్రముఖ కళాకారుడు బి. నరసింగరావు కృషి చాలా ఉంది. ఇందులో ప్రముఖ సాహిత్యవేత్త డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి సామల సదాశివ 'యాది' గురించి తన భావనను వెల్లడించారు. సామల సదాశివకు నివాళిగా ఈ వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాం -

1977

సదాశివ గురించి

నా ఎంఎ క్లాస్‌మేట్ వసంతరావు దేశ్‌పాండే చాలా ఆరాధనా భావంతో చెప్పుతుండేవాడు.

...... ......

2005

బైరెడ్డి కృష్ణా రెడ్డి ఆత్మీయ కవి మిత్రుడు

అదే ఆరాధనా భావంతో పలకరించేవాడు.

..... .........

దేశ్‌పాండే నాలో నిలిపిన సదాశివగారి రూపం పాండిత్యం, శిష్య వాత్సల్యం నా అంతరాంతరాల్లో దాగి ఉన్నది. కృష్ణా రెడ్డి దాన్ని మేల్కొల్పినాడు.

మధ్యలో మూడు దశాబ్దాలు.

ఆశ్చర్యం! అదే సదాశివ. ఎప్పటికీ అందని సదాశివ.

ఆ మహానుభావుని గురించి ఏం రాసినా సూర్యుడి ముందు దివిటీనే.

ఆయన 'యాది' తెలంగాణ యాది. ఆరు దశాబ్దాల తెలంగాణ యాది. తెలంగాణ సాంస్కృతిక సామాజిక పరిణామాల యాది.

....... ..........

ఒక్క వాక్యం రాయాలంటేనే తలపానం తోకకు వస్తది. రాసి.. కొట్టేసి రాసి... చల్ ఇక రాయొద్దనిపిస్తుంది. మరి వందల వ్యాసాలు ఆయనెలా రాసినాడు? ఆయన అలవోకగా గొప్ప ఈజ్‌తో ముచ్చట్లు చెప్పినట్లు - కొలతలు తూనికలు పట్టించుకోకుండా - రాస్తాడు. అందుకే అన్ని రాయగలిగినాడనిపిస్తుంది. అది ఈ తరం ఆయన నుంచి నేర్చుకోవాలి.

......... ..........

సాహిత్య చరిత్రల నిర్మాణం లోపభూయిష్టంగా ఉంది.

అంతటి ఖ్యాతి గాంచిన సదాశివగారు, మా నోముల సత్యనారాయణ, పాలమూరు పండితుడు కపిలవాయి లింగమూర్తి, సంస్కృతాంధ్ర భాషల్లో అనర్గళంగా మాట్లాడే శ్రీలక్ష్మణమూర్తి ఇంకా ఎందరో... వీళ్లు సాహిత్య చరిత్రలో ఏ విభాగంలో వస్తారు? వచ్చారు? సాహిత్య చరిత్రలు కవిత్వం, కథ, నవల, నాటకంలాంటి సృజనాత్మక ప్రక్రియల ఆవిర్భావ వికాసాల పరిణామంగానే నిర్మాణమవుతున్నాయి. ఈ ప్రక్రియల్లో ఒక్క రచన చేసినవారు కూడా చరిత్రకెక్కుతున్నారు. కానీ జీవితమంతా వెచ్చించి సాధించిన అపారమైన పాండిత్యం కలవారికి చోటు దక్కడం లేదు. ఎందుకు?

నేను రాసిన ముంగిలిలో కూడా ఈ లోపం ఉంది. తెలంగాణలో విలసిల్లిన గొప్ప పండిత దిగ్గజాలను - వారి గురించి తెలిసీ - ఆ గ్రంథంలో పేర్కొనలేదు. వారి గ్రంథాలు లేనందువల్లనే.

సృజనాత్మక ప్రక్రియలు గాలిలోంచి రాలిపడవు. ఆ రచయితల ప్రతిభతో పాటు సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులు, తాత్వికత, చరిత్ర క్రమం -దోహదం చేస్తవి. వీటన్నింటిని క్రోడీకరించి కొత్తతోవ అందించేవారు పండితులు లేదు గురువులు ఏ పేరైనా గాని.

సదాశివగారి దోహదం లేకుండా వసంతరావు దేశ్‌పాండే అడవిని ఊహించలేం. మా నోముల సంపర్కం లేని బోయ జంగయ్యను ఊహించలేం. ఇంకా చాలా చోట్ల అలానే.

సాహిత్య చరిత్రల్లో ఇలాంటివి ఎక్కడం యాది లాంటి గ్రంథాల వల్ల కొంత జరిగింది.

జీవిత చరిత్రల్లో, నవలల్లో, కథల్లో, కవిత్వంలో దొరకని అనేక అంశాలు ఆత్మకథల్లో దొరుకుతవి. ఆత్మకథలాంటి ఈ యాదిలో రెండు మూడు తరాల సాహితీ మూర్తుల వ్యక్తిత్వం దొరుకుతుంది. వాళ్ల మూర్తిమత్వం, మాట తీరు మానరిజం దొరుకుతవి. కాళోజీ రామేశ్వర రావు గారు 82 ఏళ్ల వయస్సులో సదాశివ కోసం ఎండలో వెళ్లి రిక్షా తేవడం, ఆయన కోసం సకినాలు తేవడం, ఆయన కవుల్ని ప్రోత్సహించిన తీరు ఎక్కడ దొరుకతవి. యాదిలోనే దొరుకుతవి. ఇప్పటి కవుల్లో ఆత్మీయత ఉందా?

తనకు ఛందస్సు, వ్యాకరణం అంతగా రాదని, తన భక్తతుకారాం నాటకంలోని పద్యాల్ని కప్పగంతుల లక్ష్మణశాస్త్రి పరిష్కరించినాడని సురవరం చెప్పుకున్న విషయాన్ని సదాశివ రికార్డు చేసినారు. 'ఎవరి వలన ఏ విషయం తెలుసుకున్నా అదంతా తమ ప్రజ్ఞే అన్నట్లు రాసుకుంటారు' అని ఈ సందర్భంగా సదాశివ వ్యాఖ్యానించినారు. అంతే కాదు తాను ఎవరి నుంచి ఏమి నేర్చుకున్నారో యాది నిండా పేర్కొన్నారు. ఇప్టి తరం ఇట్లా చెప్పుకోగలరా?

అదంతా ఎక్కడ దొరుకుతుంది?

..... .........

తెలంగాణవాళ్లకు సంగీతంతో, సంగీత సమానమైన ఉర్దూతో ఎంత ఆత్మీయ సంబంధముందో ఈ రెండింటి మీద ఎంత ప్రేమ ఉందో యాది వల్లనే ఈ తరానికి తెలుస్తుంది. తెలంగాణ సామాన్య ప్రజలు మాట మాటకు సామెత ఉపయోగించినట్లు, అప్పటి విద్యావంతులు షేర్‌ను ఉపయోగిస్తారని యాది వల్ల తెలుస్తుంది. రెండింట్లోనూ కవిత్వం తొణికిసలాడుతుంది.

ఇప్పటి తరానికి తెలియని గొప్ప పండితుడు, కవి కాళోజీ రామేశ్వర రావు గారి నోటి నుంచి వెలువడిన

'రెమ్మకు అతుక్కొని ఎంతసేపు వేలాడుతావు

ఆకురాలు కాలం వచ్చింది రాలిపోరాదా?' షేర్‌తో ఈ విషయం అవగతమవుతుంది.

ముస్లిములు, తెలుగువారు ఎంతో ఆత్మీయంగా మెలిగే వారిని సహజీవన సంస్కృతికి తెలంగాణ ఆలవాలం అని, ప్రచారం చేసినట్లు ఉర్దూ కేవలం ముస్లింల భాష కానది ఇప్పటి ఇంగ్లీషు భాషలాగా అది అందరి భాష అని కమ్యూనికేషన్ భాష అని యాది అడుగడుగునా చెబుతుంది. సదాశివగారు పేర్కొన్న ఉస్మానియా ప్రొఫెసర్ రఫియా సుల్తానా వాక్యాల్ని మాటల్ని చూసైనా పాత అభిప్రాయాలను మార్చుకోవాలి. ఒక ముస్లిం యువకుడ్ని మందలిస్తూ చెప్పిన మాటలివి.

'ఉర్దూ ముసల్మానుల భాషే అని ఎవరన్నారు నీతో. ఈ రాజవర్ధన తండ్రి (సదాశివ) ఉర్దూలో రాసే వ్యాసాలను ఆసక్తితో చదువుతాము. ఇంకెప్పుడూ ఉర్దూను ఒక కులానికో మతానికో పరిమితం చేసి మాట్లాడకు.'

..... ..... ....

ఉర్దూతో తెలంగాణకు ఉన్న ఈ ఆత్మీయతను సాకుగా చూపి తెలంగాణవాళ్లకు తెలుగు రాదని చాలా సందర్భాల్లో అవహేళన చేసిండ్రు. అది తెలంగాణను ఎంత గాయపరిచిందో యాది దృశ్యమానం చేస్తుంది.

దృశ్యం - 1

1950

'తెలుగు బోధిస్తున్న ఈ టీచర్ మన ప్రాంతం వాడేనా' (డిఇవో కోస్తాంధ్ర)

'కాదు. ఈ జిల్లాలోని ఆసిఫాబాదు ప్రాంతంవాడు' (హెడ్మాస్టర్)

'ఇతడు తెలుగేమి చెప్పగలడు మన ప్రాంతం టీచర్‌తో చెప్పించలేకపోయారా'

.... .....

దృశ్యం - 2

1954

'మీరీ ప్రాంతంవారేనట గదా. రేడియోలో ప్రసంగం చేయగలరా' (డిఇవో)

'అయ్యా నేనిక్కడ పిల్లలకు తెలుగే చెప్తున్నాను' (సదాశివ)

'ఇక్కడ మా ప్రాంతంవాళ్లు కూడా ఉన్నారు కదా. వాళ్లను గాక ఎ.ఐ.ఆర్ వాళ్లు మిమ్మల్నే ఎందుకు ఆహ్వానించారు' (డిఇవో)

'అది ఎఐఆర్ వాళ్లను అడగాల్సిన ప్రశ్న' (సదాశివ)

1971

'మీ తెలంగాణలో చాలా మందికి తెలుగు రాదని విన్నాను... మీ తెలుగెలా ఉంటుందో తెలియదు. మీ శబ్ద ప్రయోగం ఎలా ఉంటుందో మీ వాక్య విన్యాసమెలా ఉంటుందో - కొండూరి వీరరాషవాచార్యులు.

ఈ అనుభవ బాధా సంపుటి ఎక్కడ దొరుకుతుంది.

.... ........

'మా చుట్టూ ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్లులో ఇంతటి సంగీతం మరింతటి సాహిత్యం వ్యాపించి ఉన్నా తెలంగాణ జిల్లాల వాళ్లకు కళాసాహిత్యాలలో అంతగా ప్రవేశం లేదంటూ అంతా ఔవులగాళ్లేనంటూ కొందరు ఈసడించినట్లు మాట్లాడుతూ ఉంటే కొంచెం బాధగానే వుంటుంది. ఇలాంటి బాధనే చాలా కిందట సురవరం ప్రతాప రెడ్డిగారు అనుభవించినారు. వారన్నట్లుగానే....

'ఈ తెలంగాణవాళ్లకి చాలా మంది మందికి కీర్తికాంక్ష లేదు. ధనాపేక్ష లేదు. నేర్చిన సంగీతాన్ని కూర్చిన కవితను తాము చదువుతూ తమవారికి వినిపిస్తూ ఆనందిస్తారు గానీ దాన్ని ఆలంబనగా చేసుకొని పైకెక్కాలని పాకులాడరు. అలాంటి వారు అసలే ఉండరని కాదు. ఉంటారు. కానీ అల్పసంఖ్యులు'

ఆనాడు హైదరాబాద్ ఎంత ఆత్మీయంగా ఉండేదని - అది వ్యాపారంలో కూడా ఉందనే నర్సమ్మ భోజనశాల గురించి చెప్పిన సందర్భంలో కనిపిస్తుంది. 'ఇడ్లీ, దోసెల హోటళ్ు ఏ ప్రాంతంలోనో ఉండేవి.... సంపన్నులైనా, సామాన్యులైనా ఇష్టంగా తినే, చౌకగా దొరికే నాష్తా సహారీ కుల్సా' అంటే మేక కాళ్ల బొక్కల పులుసు, జొన్నరొట్టెలు. చాలా పుష్టికరమైన నాష్తా, కొసరి కొసరి వడ్డిస్తూ కడుపు నిండా తిను బిడ్డా ఇంతెహాన్ (పరీక్ష) రాయాలె. ఈ మాత్రం తింటె ఏం బలముంటది బిడ్డా అంటూ వడ్డించింది నర్సమ్మ. ఇంకొంచెం నెయ్యి వెయ్యనా... ఆమెకు రూపాయలకంటే తనదగ్గర తినేవాళ్లు కడుపు నిండి సంతృప్తిగా తినాలన్నదే ముఖ్యం. అన్నంలో సున్నం నీళ్లు కలిపే సంస్కారం లేదప్పటికి,'

ఆనాటి తెలంగాణ స్వభావాన్ని, సంస్కృతిని, అభిరుచులను పట్టించే వర్ణనలకు నిధి యాది.

పదేండ్ల కింది విషయాలే సరిగ్గా గుర్తుండవు చాలా మందికి కానీ సదాశివగారు 60,70 ఏండ్ల కింది విషయాలను - పేర్లు, తేదీలతో సహా - నిన్న మొన్నటి విషయాల్లాగా పూసగుచ్చినట్లు చెప్తారు. ఆయన యాది (జ్ఞాపకశక్తి)కి హాట్సాఫ్.

- సుంకిరెడ్డి నారాయణ రెడ్డి

English summary
Samala Sadasiva's contribution was achnowledged by Jayanthi magazine with publishing a special issue recently. Sunkireddy Narayana Reddy has written about Samala Sadasiva's Yaadi (memoires). As a rich tribute to Samala sadasiva that essay is published here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X