వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యక్తిత్వాల సమన్వయం భార్యాభర్తలు: కుటుంబం

By Pratap
|
Google Oneindia TeluguNews

సజయ ఉన్నత విద్యావంతురాలు. తల్లిదండ్రులకు తొలి సంతానం, పెద్ద కూతురు, గారాలపట్టీ. పెళ్ళయి అత్తగారింటికి వెళ్ళిన వధువు సజయ ఆ యింటికి కొత్త. ఆమె తల్లిగారింటిలో ఆమెదే రాజ్యం. అన్నీ తనకనుకూ లంగా ఉండాలని కోరుకొని సాధించుకున్నది.

ఉన్నత విద్యావంతురాలుగా తానుకూడా ఉద్యోగం చేస్తూ, కొడుకుతో సమానంగా సంపాదిస్తున్నప్పటికీ తనను ఎందుకు అన్ని పనులు చేయమంటున్నారు. కొడుకుతో సమానంగా తనను ఎందుకు చూడడం లేదు. అందరూ తనను లోకువగా చూస్తున్నారు అని బాధపడింది సజయ.

అందరూ తనకనుకూలంగా మారాలని ఉంటుంది...

అలా సజయ అత్తగారింట్లో అందరూ తనకనుకూలంగా మారాలని భావించింది. కానీ వాళ్ళెవరూ మారలేదు. కోడలుగా, భార్యగా, వదినగా తమకు అను కూలంగా ఉండాలని అత్తగారి ఇంట్లో కోరుకున్నారు. బంధు వులు కూడా అలాగే భావించారు. అత్త పెత్తనం భరించ లేక ఏడ్చేసింది. తల్లిదండ్రులకు తన బాధ చెప్పుకుంది.
తల్లిదండ్రులు కూతురుకు ఏమాత్రం మద్ధతు యివ్వలేదు. నీదే తప్పు అని సముదాయించారు. కూతురు ఇంకా ఏడ్చేసింది. తనను ఎవరు అర్థం చేసుకోవడంలేదని బాధపడింది. అపుడు తండ్రి విశ్వం కూతురు కన్నీరు తుడిచి ఇలా అన్నాడు.

Personality development: BS Ramulu on mutual cooperation of couple

''నాన్నా...! నీవు వాళ్ళింటికి వెళ్ళావు. వాళ్ళు మెజారిటీ. అక్కడ నీవు ఒక్కదానివే కొత్తగా వారి కుటుంబంలో సభ్యురాలివయ్యావు. వాళ్ళందరూ నీకోసం మారడం ఎలా సాధ్యం? అది వారి ఇల్లు. అది వారి జీవన విధానం, సంస్కృతి. అది వారి కుటుంబం. ఆ కుటుంబంలో నువ్వొక సభ్యురాలిగా చేరినపుడు అందులో ఇమిడిపోవాలి. అందరూ నీకు అనుకూలంగా మారడం ఎలా సాధ్యం? నువ్వొక్కదానివి వారందరికీ అనుకూలంగా మారడమే సులభం కదా!'' అని సముదాయించాడు.

అందరు నీకనుకూలంగా మారడంకన్నా నువ్వొక్కరు అందరికి అను కూలంగా మారడమే సులభం...
కూతురు సజయలో కొద్దిరోజులు సంఘర్షణ. సంఘర్షణలో తాను ఇరవై మూడేళ్ళుగా పుట్టి పెరిగిన వాతావరణంలో, కాలేజీలో, యూనివర్శిటీలో, ఉద్యోగంలో, బంధుమిత్రుల్లో రూపుదిద్దుకున్న స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని, స్వేచ్ఛను, సమానత్వాన్ని, తల్లిగారింట్లో పొందిన పెద్దకూతురుగా హక్కులు, ఆత్మగౌరవం, అత్తగారింట్లో లేకపోవడం అందరికీ అణిగిమణిగి ఉండే వ్యక్తిత్వానికి, స్వభావానికి మారడం ఎలానో తోచలేదు. ఆత్మహత్యకు ప్రయత్నించింది. తల్లిదండ్రులు ఇలాంటి ఆత్మహత్యా ప్రయత్నాలు నీలోని అహంకారానికి నిదర్శనమే తప్ప, ఆత్మ గౌరవానికి, ఇతరుల పట్ల గౌరవానికి నిదర్శనం కాదు అని సముదాయించారు.
కొద్దిరోజులు తల్లిగారింట్లో ఉండి, తన స్వభావంలో ప్యారడైమ్‌ షిఫ్ట్‌ సాధించుకోవాలని నిశ్చయించుకొని, అత్తగారి ఇంట్లో వారందరికీ అనుకూ లంగా ఉండే వ్యక్తిత్వానికి మారడానికి సిద్ధపడింది. అత్తగారింటికి వెళ్ళాక వారందరికీ అనుకూలంగా ఉండే వ్యక్తిత్వానికి, స్వభావానికి మారుతూ వచ్చింది.

అలా సజయ కాపురం నిలబడింది. భర్త, అత్తామామలు, ఆడపడుచులు, మరుదులు వగైరా అందరూ ఎంతో సంతోషించారు. తనను తాను చంపుకొని బతుకుతున్నానని కొంత కాలం బాధపడింది. కానీ తర్వాత తనది మంకు అని తెలుసుకుంది. పదిమందిలో కలిసి జీవించడంలో తనకు అనుకూలంగా మాత్రమే ఉండాలని కోరుకోవడం సరికాదని తెలుసుకుంది.

పదిమందికి అనుకూలంగా ఉంటూ తనకనుకూలంగా కొంత మార్చుకోవడం సాధ్యం. పదిమందిలో తలా 10 శాతం మాత్రమే తమకు అనుకూలంగా పదిమందిని మలుచుకోవడం సాధ్యం. తలా 10 శాతం చొప్పున కలవడంతో నూరు శాతం అవుతుంది. ఇలా ఒక్కరుగా నూరు శాతం ఉన్నప్పటికీ పదిమందిని 10 శాతానికి మాత్రమే మార్చుకుంటూ 10 మందికి అనుకూలంగా తన 90 శాతాన్ని వదులుకోవడం, రిజర్వులో ఉంచుకోవడం జరుగుతుంది. సామాజిక శక్తి, సామాజిక స్వభావం ఇలా రూపొందుతూ ఉంటుంది.
విశ్వం మాటల సందర్భంలో తాను కూతురు సంసారాన్ని నిలబెట్టడానికి ఎంత కష్టపడ్డాడో మిత్రునికి చెప్పుకున్నాడు. కూతురుకన్నా తాను ఎక్కువ మానసిక హింసను భరించానని ఆవేదన వ్యక్తం చేశాడు. అయినా కూతురికి అలా సర్దుకుపోవాలని చెప్పానని అన్నారు.

పెళ్ళయ్యాక కూతురుకు మద్దతిస్తే...

అత్తగారింట్లో పోట్లాట పెట్టుకుంటూ, తల్లిగారింటికి నైతిక మద్దతుకోసం పెళ్ళయిన ఆడపిల్లలు రావడం సహజం. అప్పుడు కూతురుకే మద్దతు యిస్తే తల్లిదండ్రుల మద్దతు చూసుకొని అత్తవారింట్లో పోట్లాటకు దిగుతుంది. కుటుంబం విచ్ఛిన్నం అవుతుంది. కూతురు తల్లిగారింటికి చేరుతుంది. అది విడాకులు దాకా పోవచ్చు. కుటుంబం నుండి విడిపోయి సొంత కాపురం పెట్టుకొని వ్యక్తి కుటుంబంగా మారవచ్చు. అప్పుడు స్వార్ధపరులని, కుటుంబాన్ని వదిలివేసి బాధ్యతలు వదిలివేసి పోయిన దుర్మార్గులని, కోడలు వచ్చి మా కొడుకును బుట్టలో వేసుకొని కుటుంబాన్ని నాశనం చేసిందని అంటుంటారు.

అత్తవారింట్లో జరిగే పోట్లాటలకు తల్లిగారింట్లో ప్రేమ అనుకొని మద్దతు ఇస్తే ఆ కుటుంబాలు, పెళ్ళిళ్ళు విచ్ఛిన్నం అవుతాయి. అందుకని ఎంత కష్టమైనా సరే కొంతకాలమైనా ఓర్చుకోక తప్పదు. వారికి అనుకూలంగా ఉండకతప్పదు అని చెప్పాను. కొంతకాలానికి భర్తే భార్య పడే బాధలు చూడలేక కుటుంబంతో విడిపోయి వేరు కాపురం పెట్టాడు. అలా సమస్య పరిష్కారమైంది. ఇలా కొంతకాలం ఎదురుచూడకుండా, మారకుండా పోట్లాడుకుంటూనే పోతే పెండ్లి పెటాకులు అవుతాయి అని విశ్వం జీవన తత్వాన్ని చెప్పాడు.

పెళ్ళిని పెటాకులు చేసిన తల్లిదండ్రులు...

కూతురు ప్రసూతికని అమెరికా వెళ్లిన ఆమె తల్లిదండ్రులు ప్రతి విషయంలో కూతురుకు మద్దతు ఇచ్చి పోట్లాటలను పెంచడానికి కారకులయ్యారు. తండ్రి నిరక్షరాస్యుడేమీ కాదు. ప్రభుత్వ హైస్కూలులో పీజిహెచ్‌ ఎంగా పనిచేస్తున్నవాడు. కూతురుకు మద్దతు ఇస్తూ అల్లుడి ఇంట్లో ఉంటూ అల్లుడిని సాధించడంతో అల్లుడు హతాశుడయ్యాడు. అందరూ తన సంపా దనపై ఆధారపడి బతుకుతూ తననే హింసిస్తున్నారని బాధపడ్డాడు. భార్య తల్లిదండ్రుల మద్దతుతో పోలీసులను ఆశ్రయించింది. గొడవలు పెరి గాయి. చివరికి తల్లీ, తండ్రీ, కూతురు ఒకవైపు అయిపోయారు. అల్లుడు కొన్న ఇల్లును వారికే వదిలేశాడు. ఒంటరిగా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు.
ఆమె ఉద్యోగం కోసం ప్రయత్నించింది. దొరకలేదు. చివరకు తల్లీ, తండ్రీ, కూతురు కలిసి ఇండియాకు వచ్చేశారు. విడాకుల కేసు నడిచింది. విడిపోయారు. ఈ కేసు డీల్‌ చేసే క్రమంలో ఆ తల్లిదండ్రులు ఎంత మూర్ఖులో అర్థమయింది. ఆ పిల్లవాడిని కలవకపోయినా, ఎంత నరకం అనుభవించాడో తెలిసి వచ్చింది. కూతురు అమాయకురాలే. సజయ తండ్రి విశ్వంలాగ కూతుర్ని సముదాయిస్తే కుదురుకునే సంసారమే. ఆ అమ్మాయితో ఫోన్లో మాట్లాడి కాపురం చెడకొట్టు కోవద్దని ఎన్నో విధాలుగా ఫోన్లో నేను, మరో మిత్రుడు కలిసి నచ్చజెప్పాము. ఆ అమ్మాయి మా మిత్రుడి కూతురు చిన్ననాటి నుండి క్లాస్‌మేటుకూడా. మా మాట పట్ల అమ్మాయికి ఎంతో గౌరవం. కానీ తల్లిదండ్రులు నిరంతరం నూరిపోయడంతో ఆమె కాపురం ఒంటరి కాపురం అయిపోయింది.

అతి ప్రేమ అతి కీడుకే...

ఇలా తల్లిదండ్రులు పెళ్ళయ్యాక కూడా కూతురుపట్ల అతి ప్రేమ చూపిస్తూ ఇలాంటి సందర్భాల్లో నైతిక మద్దతు ఇస్తూ మేలు చేస్తున్నాము అనుకొని కీడు చేస్తున్నారు. సజయ తండ్రి విశ్వంలా కూతురుకు జీవితాన్ని అర్థం చేయించే బదులుగా అర్థంలేని అతిప్రేమను ప్రదర్శించి వ్యవహారాన్ని చెడగొడుతున్నారు. కూతురు ఇంటిమీదికి వచ్చి ఉండిపోతున్నది. సింగిల్‌ పేరెంట్‌గా మిగిలిపోతున్నారు.

కొందరు వ్యక్తి స్వేచ్ఛ పేరిట సామాజికంగా కలిసి జీవించే అనివార్యతను, దాని మౌలికతను వదిలివేస్తున్నారు. ఈ సందర్భంగా ఒక మాట గుర్తుంచు కోవాలి. నీవు నమ్మి, ప్రేమించి, ఇష్టపడి, పెళ్ళి చేసుకొని రెండు జీవితాలు ఒక్కటి అనుకొని, సంసారం చేసి, పరస్పరం అవగాహన చేసుకొని ఒక్కటిగా జీవించాల్సి ఉండికూడా ఉండలేకపోతే మిగతా ప్రపంచంతో ఉండడం ఎలా సాధ్యం. నీకనుకూలంగా ఆమెను, ఆమెకు అనుకూలంగా అతడ్ని మార్చు కోలేని, రాజీ పడలేని తత్వం, వ్యక్తిత్వం, సమాజంలో ఎందరితోనో, ఎన్ని విషయాల్లోనో రాజీ పడి బతకాల్సి వస్తుంది.

సింగిల్‌ పేరెంట్‌గా మిగిలిపోవడంలో భర్త పాత్ర తక్కువేమీ కాదు. ఆ అంశం వేరు. అలాంటి సందర్భాల్లో సింగిల్‌ పేరెంట్‌గా ఉండడమే అవసరం. కానీ ఎలాంటి కౌన్సిలింగ్‌ లేకుండా వ్యక్తిగత నిర్ణయాలతో, తాత్కాలిక, ఆవేశకావేశాలతో, అభిప్రాయాలతో, ఆత్మగౌరవం పేరిట, అహంతో దూరం కావడం, జరగకుండా తల్లిదండ్రులు చేయాల్సిన కృషి చేయక తప్పదు.

పెళ్ళి చేసుకోవడానికి సర్టిఫికెట్‌ అవసరం...

కొన్ని దేశాల్లో క్రైస్తవ క్యాథలిక్కులు పెళ్లి సంబంధం కుదిరాక, పెళ్ళికి ఆరునెళ్ల ముందు శిక్షణ పొందాలి. సర్టిఫికేట్టు తీసుకోవాలి. అపుడే పెళ్ళికి అర్హులు. ఇది ప్రపంచమంతా అందరూ అనుసరించాల్సిన పద్ధతి. పెళ్లికి ముందు శిక్షణ పొందడం అవసరం.

నేను 1993లో ఎస్‌.ఎస్‌.వై., ఎ.ఎం.సి. (సిద్ధ సమాధి యోగ, అడ్వాన్స్‌ మెడిటేషన్‌ కోర్స్‌) చేశాక నాకు ఏమనిపించిందంటే పెళ్ళికి ముందు అందరూ ఇలాంటి ట్రైనింగ్‌ చేయాలి... కనీసం పెళ్ళయినాక నెలలోపే ఈ శిక్షణ పొందాలి అనే నిబంధన పెట్టాలి అనిపించింది. పరస్పరం భార్యాభర్తల మధ్యన అవగాహన పెరగడానికి, ఇగోలు వదిలించుకోడానికి, భయాలు, సంకోచాలు, ఇన్ఫిరియారిటీ కాంప్లెక్సులు పోగొట్టుకోవడానికి అనేక ఫోబి యాలు పోగొట్టుకోవడానికి హాయిగా నవ్వుకోడానికి, పరస్పరం గౌరవించు కోడానికి, ఆరోగ్యంగా జీవించడానికి ఈ శిక్షణ ఎంతో అవసరం అనిపించింది.

English summary
An eminent writer BS Ramulu stressed the need of mutual cooperation between wife and husband in personality development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X