నోట్ల రద్దు ఎఫెక్ట్ ఇది: బ్యాంకుల్లో నగదు కొరత.. రైతుల డిపాజిట్లివ్వలేని దైన్యం

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అవినీతిని నిరోధించడంతోపాటు ఉగ్రవాదానికి నకిలీ నగదు అందకుండా చేయాలన్న లక్ష్యంతో నోట్లు రద్దు చేశామని కేంద్ర ప్రభుత్వం చేస్తూ వచ్చిన వాదనలో నిజమెంత ఉందో గానీ తెలంగాణ రైతులు మాత్రం ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగుకు అవసరమైన నగదు కోసం అల్లాడిపోతున్నారు. గత ఏడాది ఇబ్బడిముబ్బడిగా దిగుబడి సాధించిన పంట అమ్ముకుంటే వచ్చిన సొమ్ము సొంత ఖాతాలో జమ చేసినా బ్యాంకులు కనికరించని పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నది. అంతెందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ పథకం కింద నాలుగో విడుత విడుదల చేసిన నిధులను రైతుల రుణ ఖాతాలకు జమ చేయకుండా బ్యాంకర్లు బిగబట్టడం... దానికీ సాంకేతిక సమస్యల సాకు చూపడం విడ్డూరంగా ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయపడ్తున్నారు.

తొలకరిలో ఏరువాక బాటపట్టాల్సిన రైతు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. సకాలంలో నైరుతి కరుణించినా.. పెట్టుబడికి సొమ్ములందక అదను తప్పే పరిస్థితి నెలకొంది. కొత్త రుణాలు ఇచ్చి ఆదుకోవాల్సిన బ్యాంకులు.. రైతులు బ్యాంకుల్లో దాచుకున్న సొంత డబ్బులు కూడా ఇవ్వడం లేదు. అసలు దీనికంతటికీ కారణమేమిటంటే గత ఏడాది నోట్ల రద్దు తలెత్తిన నగదు కొరత సమస్య మళ్లీ ముందుకు రావడమే. కానీ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం చోద్యం చేస్తున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఖరీఫ్ సీజన్‌లో పెట్టుబడి లేక రైతన్న విలవిలలాడుతున్నాడు.

నగదు కొరత వల్లే ఇదంతా అంటున్న బ్యాంకర్లు

నగదు కొరత వల్లే ఇదంతా అంటున్న బ్యాంకర్లు

రబీ సీజన్‌లో పండిన ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాలలో అమ్ముకుంటే.. చెక్కులొచ్చాయి. కానీ నాటి నుంచి అవి బ్యాంకుల్లోనే మూలుగుతున్నాయి. రైతులు కాళ్లరిగేలా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా వారికి నిరాశే ఎదురవుతోంది. ‘మా పంట సొమ్ము.. మా ఖాతాలో ఉన్న నా పైసలే ఇవ్వరా?' అని అన్నదాతలు ఆగ్రహించినా అధికారుల నుంచి డబ్బుల్లేవనే జవాబు వస్తున్నది. అటు రుణమాఫీ సొమ్మయినా ఇవ్వండని అడిగినా.. కొత్త రుణాలైనా మంజూరు చేయండని అడిగినా అదే సమాధానం! ఇంకోవైపు నోట్లరద్దు నాటి నగదు కొరత తీవ్రమైంది. దీంతో అప్పోసప్పో చేసైనా సాగు చేద్దామన్నా పైసల్లేవంటూ వడ్డీవ్యాపారులూ చేతులెత్తేస్తున్నారు.

కేంద్రం వైఖరితో నిరాశలో అన్నదాత

కేంద్రం వైఖరితో నిరాశలో అన్నదాత

అన్నివైపులా నగదు కొరత అనే భూతం రైతును చుట్టుముట్టడంతో ఈ ఖరీఫ్‌ సజావుగా సాగుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతుల్లో నెలకొన్న ఈ ఆవేదన ఆగ్రహంగా మారితే.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో మాదిరి ఆందోళనలు చెలరేగినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నైరుతి మురిపించినా.. కేంద్రం వైఖరితో ఈ ఖరీఫ్‌లో రైతన్నకు తీవ్ర నిరాశ ఎదురయ్యే దుస్థితి దాపురించింది. మొత్తంగా మునుపెన్నడూ లేని విధంగా అన్నదాతలకు ‘ఆర్థిక' కష్టాలు వెంటాడుతున్నాయి. బ్యాంకుల్లో నగదు అందుబాటులో లేకపోవడంతో రైతులకు పైసా దొరకని పరిస్థితి నెలకొంది. పెద్దనోట్ల రద్దు ప్రభావం రైతులపై స్పష్టంగా కనిపిస్తోంది. తమ ఖాతాల్లో ఉన్న నగదును కూడా తీసుకోలేకపోతున్నారు. దీంతో రుణాల కోసం రైతన్నలు బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతున్నారు. కేంద్రం నోట్లు రద్దు ప్రభావం నుంచి బ్యాంకులు కూడా కోలుకోకపోవడం పెద్ద సమస్యగా చెబుతున్నారు.

నగదు అందక అన్నదాత గగ్గోలు

నగదు అందక అన్నదాత గగ్గోలు

నోట్ల రద్దు తరువాత బ్యాంకుల్లో డిపాజిట్లు కూడా తగ్గాయి. బ్యాంకుల్లో పాత నగదు డిపాజిట్‌ చేసినా తరువాత ఆర్‌బీఐ ఆంక్షల వల్ల సామాన్యులు పొదుపు ఖాతాల్లో ఎక్కువ మొత్తంలో నగదు ఉంచడం లేదు. బ్యాంకులో డబ్బు వేసినా తీసినా కూడా అదనపు చార్జీలు వసూలు చేస్తుండటంతో ఖాతాదారులు బ్యాంకుల్లో నగదు దాచుకునే విషయంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో అనేక బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గిపోయాయి. గత ఏడాది జూన్‌ ఆరంభంలో డిపాజిట్లతో పోలిస్తే ఇపుడు 20శాతానికిపైగా డిపాజిట్లు తగ్గినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. ఇక రైతులకు పంట రుణాలు ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఒకవైపు ఖరీఫ్‌ ఆరంభమై సాగుపనులకు, విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు రైతులు పెట్టుబడి పెట్టాలి. కొత్త రుణాలు ఇవ్వకపోవడం, 25శాతం రుణమాఫీ డబ్బు చేతికి అందకపోవడం, ధాన్యం కొనుగోలు డబ్బు రాకపోవడంతో అనేక కష్టాలు పడుతున్నారు. బ్యాంకర్ల విధానంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహకారం అందించాల్సిన కేంద్రం పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు.

రుణ ప్రణాళికలే లేని బ్యాంకర్లు

రుణ ప్రణాళికలే లేని బ్యాంకర్లు

సాధారణంగా ఖరీఫ్‌ పంట రుణాలు మే నుంచే రైతులు తీసుకుంటారు. ఈ నెల 15 నాటికి దాదాపు 50 శాతానికిపైగా బ్యాంకులు రుణాలు ఇస్తాయి. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు కనీసం 10 శాతం కూడా రైతులకు పంటరుణాలు ఇవ్వకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి దుస్థితి వల్లే మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్‌ రాష్ట్రాల రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. గత రబీలో పండి పంటలకు సరైన గిట్టుబాటు ధర రాక రైతులకు ఇపుడు చేతిలో చిల్లిగవ్వలేదు. అసలు సమస్యలను బ్యాంకర్లు కూడా అధికారులకు చెప్పకుండా దాటేస్తున్నారు. మంజూరు చేసిన రుణాలను ఒకేసారి కాకుండా విడతల వారీగా రోజుకు, వారానికి ఇంత అని ఇస్తున్నారు. జిల్లా వార్షిక రుణ ప్రణాళికలు బ్యాంకులు గతనెల 15వ తేదీలోగా విడుదల కావాల్సి ఉన్నా.. ఖరీఫ్‌ ఆరంభమై రెండు వారాలు గడిచినా ఇంకా జిల్లాల్లో వార్షిక రుణ ప్రణాళికలు విడుదల కాలేదు. వీటి ఆధారంగానే వ్యవసాయరంగానికి ఖరీఫ్‌, రబీలలో రైతులకు బ్యాంకులు రుణాలు అందజేస్తాయి. రాష్ట్రస్థాయి రుణ ప్రణాళిక రెండు రోజుల క్రితం విడుదల చేసినా జిల్లా స్థాయి రుణ ప్రణాళికలు విడుదల కాలేదు. నోట్ల రద్దు తరువాత బ్యాంకింగ్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడమే కారణమని చెప్తున్నారు.

ఖాతాలో చేరిన నగదు వచ్చేదెలా

ఖాతాలో చేరిన నగదు వచ్చేదెలా

గత ఏడాది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అన్నిరకాల డిపాజిట్లు కలిపి అన్ని బ్యాంకుల్లో 2016 మార్చి 31 నాటికి రూ. 69 వేల కోట్ల డిపాజిట్లు ఉంటే.. ఇప్పుడు రూ.59వేల కోట్లు మాత్రమే ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లాలోనూ ఖరీఫ్‌ సీజన్‌ సాగుకు డబ్బులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోర్తాడ్ మండలం మంచిప్పలోని ఎస్‌బీఐ శాఖ పరిధిలో 2,500 వరకు రైతుల ఖాతాలున్నాయి. వీరిలో సుమారు 2వేల మంది వరకు రైతులు పౌర సరఫరాల శాఖకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యం అమ్మారు. ధాన్యం డబ్బులు ఖాతాలోకి వచ్చిన రైతుల పరిస్థితిలో కూడా ఏ మార్పులేదు.

రైతులకు అందని నగదు

రైతులకు అందని నగదు

ఇక యాదాద్రి - భువనగిరి జిల్లాలో రబీ సీజనలో 1,93, 390 టన్నుల ధాన్యం సేకరించారు. దీనికి ప్రభుత్వం రూ.287 కోట్లకు రూ.220 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. మరో రెండు మూడు రోజుల్లో మిగతా రూ.67 కోట్లు కూడా రైతుల ఖాతాలకు చేరనున్నాయి. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో జమ అయిన సొమ్ము చెల్లించడానికే బ్యాంకుల్లో నగదు అందుబాటులో లేదు. రుణమాఫీ కింద జమ అయిన సొమ్ము కూడా రైతుల ఖాతాలకు చేరక ఇబ్బందులు తప్పడం లేదు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని 15మండలాల్లో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. ధాన్యం అమ్మిన సొమ్ము బ్యాంకు ఖాతాలోకి దశలవారీగా రావడం, వచ్చిన మొత్తాన్ని తీసుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.

జమ కాని రుణ మాఫీ నగదు

జమ కాని రుణ మాఫీ నగదు

రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఒక బ్యాంకు శాఖలో 1200 మంది రైతులు ఖాతాదారులు ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వం నాల్గోవిడత రుణమాఫీ డబ్బు విడుదల చేసింది. ఇప్పటి వరకు కేవలం 200 మంది ఖాతాలకే డబ్బులు జమ చేశారు. ఇక రబీలో ధాన్యం అమ్మిన డబ్బు ఇంకా రైతుకు అందలేదు. సాధారణంగా రైతు ధాన్యం అమ్మిన 48 గంటల్లో రైతు ఖాతాలో డబ్బు జమ అయ్యేది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన అధికారులు కొన్నాళ్లుగా సకాలంలో డబ్బు చెల్లించడం లేదు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 37 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 29 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించగా ఇంకా పది కోట్లు రూపాయల వరకు రైతులకు చెల్లించాల్సి ఉంది. కొన్ని జిల్లాల్లో అయితే రూ.50 కోట్లకుపైగానే బకాయిలు ఉన్నాయి. ఇవి విడుదలైతే రైతులకు కొంత ఉపశమనం ఉంటుంది.

విలీనంతో ఇలా సాంకేతిక సమస్యలు

విలీనంతో ఇలా సాంకేతిక సమస్యలు

ఎస్బీహెచ్‌ నుంచి ఎస్బీఐకి మారడంతో సాంకేతిక సమస్య ఏర్పడింది. రైతులకు పంట రుణాలు ఈ వారంలో ఇచ్చే పరిస్థితి కనిపించడంలేదు. ఇప్పటి వరకు అయితే ఏ ఒక్క రైతుకు కూడా పంట రుణాలు ఇవ్వలేదు. పరిగి ఎస్బీఐ శాఖ ఇన్ చార్జి మేనేజర్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ తమ శాఖలో నాల్గువేల మంది రైతులకు రూ.28 కోట్ల వరకు పంటరుణం ఇచ్చామన్నారు. ఈ ఖరీఫ్‌ ఇవ్వడానికి ఇబ్బందికరంగానే ఉందని, గతంలోలా కాక కొత్తగా డాక్యుమెంట్‌ నిబంధనను మార్చడంతో ఒక్క రైతు డాక్యుమెంట్ తయారు చేయాలంటే మూడు గంటల సమయం పడుతున్నదన్నారు. బ్యాంకుల చుట్టూ ఎంత తిరిగినా పంట రుణాలు మంజూరు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద రైతులు విత్తనాలు వేస్తున్నా తాము డబ్బుల్లేక పత్తి విత్తనాలు నాటడానికి ఇబ్బందుల పాలవుతున్నామని రైతులు అంటున్నారు.

ఎరువులు, విత్తనాల కోసం రైతు సతమతం

ఎరువులు, విత్తనాల కోసం రైతు సతమతం

సిద్దిపేట జిల్లా తోగుట మండలం తుక్కాపూర్ రైతులు మాట్లాడుతూ నగదు చెల్లించకుండా ట్రాక్టర్ల యజమానులు భూములు దున్నేందుకు ముందుకు రావడం లేదని వాపోతున్నారు. రబీ సీజన్ లో వచ్చిన పంట డబ్బులన్నీ బ్యాంకులోనే వేసినా.. ఇప్పుడు డబ్బు కోసం క్యూలో నిలిస్తే వారం క్రితం రూ.5000, వారం తర్వాత మరో రూ.10 వేలు ఇస్తున్నారని చెప్పారు. గతేడాది సీజన్‌కు ముందే విత్తనాలు, ఎరువులు తెచ్చి పెట్టుకున్నామని, కానీ ఈ సారి బ్యాంకుల్లో నగదు తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నామని తెలుపుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే పంటలు సాగు చేసేదెలా? అని ప్రశ్నిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Demonitization effects continued in Telangana till today while farmers crying with cash crunch in banks. Farmers are deposited their money in banks but today bankers didn't ready to give their deposits. Bankers didn't has loans plans at district level upto today.
Please Wait while comments are loading...