వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టార్గెట్ కొవూరు: జగన్, బాబు, కిరణ్ ప్రత్యేక దృష్టి

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan-Chandrababu Naidu
అన్ని పార్టీలకు పట్టు ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొవూరు నియోజకవర్గం పైనే సీమాంధ్ర దృష్టి అంతా ఉంది. అక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. కమ్యూనిస్టుల పురిటిగడ్డ, టిడిపి కంచుకోట కోవూరు ఈసారి ఎవరి వశం కానుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ నియోజకవర్గంలో రెండు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. ఓటర్లలో అత్యధికులు బడుగు వర్గాల వారు ఉండటంతో వారిని ఆకర్షించేందుకు పార్టీలన్నీ వ్యూహాలను పన్నుతున్నాయి. ఆయా కులసంఘాల నేతలను ప్రచారంలోకి దింపి ఓటర్లకు గాలం వేసేందుకు యత్నిస్తున్నాయి. మహిళా సంఘాలతో సమావేశాలు జరిపి తమకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. పార్టీలన్నింటికీ ఇక్కడ గెలుపు ప్రతిష్ఠాత్మకం కావడంతో నగదు, మద్యం ఏరులై పారుతోంది. సీమాంధ్రలో ఏకైక ఉపపోరు కావడంతో అందరి దృష్టి కోవూరు నియోజకవర్గంపైనే కేంద్రీకృతమైంది. టిడిపి నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, సిపిఎం నుంచి జొన్నలగడ్డ వెంకమ రాజు, లోక్‌సత్తా నుంచి నెల్లూరు నరసయ్యలతో పాటు మొత్తం 14 మంది అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉన్నారు. ప్రధాన పోటీ మాత్రం టిడిపి, కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు మధ్యే ఉంది. ఈ మూడు పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకున్నాయి.

దాంతో ఆయా పార్టీల అగ్రనేతలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రెండు విడతల ప్రచారాన్ని పూర్తి చేశారు. వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్మోహన రెడ్డి ఐదు రోజుల పాటు నియోజకవర్గంలోనే మకాం వేసి పల్లెపల్లెలో ప్రచారం సాగించారు. కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి శుక్రవారం రాత్రి కొడవలూరు మండలం నార్తురాజుపాళెంలో బహిరంగ సభలో పాల్గొన్నారు. లోక్‌సత్తా తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ రెండు రోజులు ప్రచారం చేశారు. సిపిఎం అభ్యర్థి వెంకమ రాజు నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాఘవులు కోవూరుకు వచ్చారు. ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి అభ్యర్థి మధు గెలుపు కోసం తాను ప్రచారానికి వస్తానని టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర రావు ప్రకటించినా పర్యటనకు ఆయన ఇంత వరకు రానేలేదు. ఏదిఏమైనా కోవూరు ఎన్నిక ప్రధాన పార్టీలకు అగ్నిపరీక్షగా మారింది. కోవూరు నియోజకవర్గంలో 1993 నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి (2004) మాత్రమే టిడిపి ఓటమి చవిచూసింది. ఈ నియోజకవర్గంపై టిడిపికి ఇంత పట్టు ఉండడానికి కారణం మత్స్యకారులు, గిరిజనులు ఈ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తుండటమే.

ఈ నియోజకవర్గంపై ఇంతటి పట్టు ఉన్న టిడిపికి ఈ ఎన్నికలు మాత్రం ప్రతిష్ఠాత్మకంగా మారాయి. టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి జగన్ పంచన చేరడంతోపాటు తన వెంట టిడిపి కార్యర్తలు కొందరిని కూడా తీసుకెళ్లారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి ఈ నియోజకవర్గంలో రెండు నెలలుగా విస్తృతంగా పర్యటిస్తూ దారి తప్పిన కేడర్‌ను మళ్లీ పట్టాలపైకి తెచ్చుకోగలిగారు. చంద్రబాబు ఈ నెల 4, 8 తేదీల్లో ఇక్కడ జరిపిన రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీంతో తెలుగు తమ్ముళ్లలో నూతనోత్సాహం నెలకొంది. ఇదే స్ఫూర్తితో ప్రచారాలు హోరెత్తిస్తూ గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలతో పార్టీ నేతలు ముందుకు సాగుతున్నారు. పలువురు నేతలు అక్కడే మకాం వేశారు. స్థానిక సమస్యలను పరిష్కరిస్తామని చెబుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు పైనే నేతలు ఆశలు పెట్టుకున్నారు. సోమిరెడ్డికి ఈ నియోజకవర్గంలో బంధువర్గం, గత పరిచయాలు మెండుగా ఉండటంతో గెలుపుపై ఆయన ధీమాతో ఉన్నారు.

టిడిపికి కంచుకోటగా ఉన్న కోవూరుపై కన్నేసిన కాంగ్రెస్ నేతలు ఈసారి ఎట్టిపరిస్థితుల్లో గెలుపు సాధించాలన్న తపనతో ఉన్నారు. ఈ స్థానం నుంచి 2004లో ఎమ్మెల్యేగా గెలుపొంది, 2009లో ఓటమిపాలైన పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డినే ఈసారి కూడా కాంగ్రెస్ రంగంలోకి దించింది. అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూ కాంగ్రెస్ నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పితాని సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణతో పాటు ఎమ్మెల్యేలు ఆనం వివేకానందరెడ్డి, ఆదాల ప్రభాకరరెడ్డి, ముంగమూరు శ్రీధర్‌ కృష్ణా రెడ్డి, ఎమ్మెల్సీ వి.నారాయణరెడ్డి ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు. కొడవలూరు మండలం నార్తురాజుపాలెంలో శుక్రవారం జరిగిన బహిరంగసభలో కిరణ్ పాల్గొన్నారు. ఆ తర్వాత పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో గెలుపు వ్యూహాలపై సిఎం మార్గనిర్దేశం చేశారు. కోవూరులో ఎలాగైనా గెలవాలని, ప్రజా సమస్యలు తెలుసుకుని హామీలు ఇవ్వాలని నేతలకు ఆయన సూచించారు. వైయస్సార్సీ అభ్యర్థి ప్రసన్న ఎట్టి పరిస్థితుల్లోను గెలవకూడదంటూ సిఎం స్పష్టం చేశారు. కాంగ్రెస్ ముఖ్యనేత చిరంజీవి, పిసిసి చీఫ్ బొత్స కూడా ఈ నెల 12 నుంచి ప్రచారానికి వస్తున్నారు.

మరోవైపు టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న ప్రసన్న రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెసులో చేరారు. ఆయన్నే అభ్యర్థిగా ఖరారు చేస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. దివంగత నేత వైయస్ పైన ఉన్న అభిమానమే తమకు ఓట్లు కురిపిస్తుందని తాము అత్యధిక మెజారిటీతో గెలుస్తామని ఈ పార్టీ నేతలు ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చారు. అయితే నియోజకవర్గంలో జగన్ పాల్గొన్న రోడ్‌షోలు వెలవెల పోతున్నాయనే వార్తలు వస్తున్నాయి. దీంతో గెలుపుపై పార్టీ నేతల ఆశలు సన్నగిల్లుతున్నాయంటున్నారు. కొడవలూరు మండలంలో జగన్ ఈ నెల 5న జరిపిన రోడ్‌షోకు ఆశించిన స్థాయిలో ప్రజా స్పందన కరవయిందంటున్నారు. అంతేకాగ మైపాడులో మత్స్యకారులపై జగన్ వ్యక్తిగత భద్రత సిబ్బంది దాడులు చేయడం వివాదానికి తెరలేపింది. పూలమాల వేసేందుకు వస్తే పిడిగుద్దులు కురిపిస్తారా? అంటూ మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తోడు జగన్ రోడ్‌షో సందర్భంగా ఊటుకూరు పెద్దపాళెం వాసులు ప్రసన్న ఏ పార్టీయో చెప్పాలని నిలదీశారు. సిపిఎం, లోక్ సత్తా కూడా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.

English summary
All the Seemandhra seeing at Kovur of Sri Potti Sriramulu Nellore district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X