• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అసలైన గొప్ప స్నేహం ఎలా ఉండాలంటే..?

|

హైదరాబాద్: స్నేహం గొప్పతనం స్నేహానికి ఏదో ఒకరోజు కేటాయించి సంబరాలు చేసుకునే సంస్కృతి కాదు మనది. మన సనాతన ధర్మం లో స్నేహానికి ఎంతో విలువనిచ్చి ఎంతో గౌరవించారు.

శ్రీకృష్ణ పరమాత్మ ఒకనాడు రుక్మిణీదేవి మందిరంలో కూర్చుని ఉన్నాడు. ఎంతో సంతోషంగా రోజులు గడిచిపోతున్నాయి. కానీ శ్రీకృష్ణ భగవానుడితో చదువుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు కుచేలుడు. కానీ సంప్రదాయంలో కుచేలుని గురించి ఒక తప్పు కథ ప్రచారంలో ఉంది.

అది ఎలా వచ్చిందో తెలియదు. కృష్ణుడికి తెలియకుండా ఒకరోజున అరణ్యంలో కుచేలుడు అటుకులు తిన్నాడని, అందుకే అంత దరిద్రం అనుభవించాడని, ఆ తరువాత శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకు ఐశ్వరం ఇచ్చాడని అంటారు. కానీ భాగవతంలో కుచేలుని గురించి అలా చెప్పలేదు. కుచేలుని గురించి వ్యాసులవారు, పోతనగారు చాలా గొప్పగా మాట్లాడారు. వేదవ్యాస కుమారుడయిన శుకుడు అభిమన్యుని కుమారుడయిన పరీక్షిత్తును చూసి 'ఓరాజా! ఆ కుచేలుడు ఎటువంటి వాడో నీకు చెపుతాను విను' అని కుచేలుని గురించి చెప్తున్నాడు.

astrologer told the story about friendship

కుచేలుడు అపారమయిన మానాభిమానములు కలిగిన వాడు.యాచన చేయడానికి సిగ్గు విడిచిపెట్టాలి. కానీ కుచేలుడు అలా సిగ్గు విడిచి పెట్టిన వాడు కాదు. మానాభిమానములు ఉన్నవాడు. గొప్ప బ్రాహ్మణ తేజస్సు ఉన్న వాడు. విజ్ఞాని. ఆయన అనుబంధములకు అతీతంగా ఉంటూ నిరంతరమూ బ్రహ్మమునందు రమించే మనస్సు ఉన్నవాడు. లోకమునందు ఈశ్వరుని దర్శనము చేయగలిగిన సమర్థుడు. మహానుభావుడికి ధర్మం అంటే మహాయిష్టం.

విశేషించి ఆయన గొప్ప బ్రహ్మజ్ఞాని. తనకు ఏమీలేకపోయినా దరిద్రంలో అన్నీ ఉన్నాయని తృప్తిగా ఉన్నవాడు. ఈశ్వరుడు తనకు ఫలానిది ఇవ్వలేదు అని అనడం తెలియనివాడు. అంతటి మహాభక్తుడు. గోవింద సఖుడు. అటువంటి కుచేలుడు అంత దరిద్రం అనుభవిస్తున్నా ఎన్నడూ కృష్ణ భగవానుడి దగ్గరకు వెళ్లి చెయ్యి చాపి 'కృష్ణా, నాకు సహాయం చేస్తావా' అని అడగలేదు.

కుచేలుని భార్య అనురక్త. కుచేలుడు ఎలా ప్రవర్తిస్తాడో తానుకూడా అలా ప్రవర్తించే సహధర్మచారిణి. గొప్ప భాగవత ధర్మమూ తెలిసి ఉన్న తల్లి. ఆవిడ ఒకరోజున భర్తతో అంది 'మహానుభావా, ఆకలి వేస్తే మీరు ఓర్చుకుంటారు. నేను ఓర్చుకుంటాను. పిల్లలు ఆకులతో చేసిన డొప్పలు చేత పట్టుకుని పదిమాట్లు ఆకలేస్తోంది అమ్మా అని అంటే అన్నం పెట్టలేక పోయానే అని అమ్మ బాధ పడుతుందేమోనని ఆకలితో నావంక చూస్తూ నాలుకతో పెదవులు తడుపుకున్తున్నారు.

నీకు ఐశ్వర్యం భ్రాంతి లేదు. కానీ బిడ్డలను పోషించాలి కదా. కాబట్టి మీరు పాటిస్తానంటే ఒక సలహా చెప్తాను. మీ సఖుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు కదా. మీరు ఒకసారి ఆయన వద్దకు వెళ్లి ఒక్కమాట చెప్పినట్లయితే అందరినీ ఆదుకోగలిగిన మహానుభావుడు ఆ వాసుదేవుడు మనలను ఆదుకుంటాడు. ఆయనను భక్తితో ఏమి అడిగినా యిస్తాడు. ఎందుకు వచ్చిన దరిద్రం మనకి. పిల్లల కోసమయినా ఆయన దగ్గరకు ఒక్కసారి వెళ్ళవలసింది' అని చెప్పింది.

భార్య అలా చెప్పేసరికి ఆయన అన్నాడు 'పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్ళేటప్పుడు స్నేహితుని దగ్గరకు వెళ్ళేటప్పుడు, రోగుల దగ్గరకు వెళ్ళేటప్పుడు వృద్ధుల దగ్గరకు వెళ్ళేటప్పుడు గురువుల దగ్గరకు వెళ్ళేటప్పుడు రిక్తహస్తాలతో వెళ్ళలేము కదా! స్నేహితుడికి ఏదయినా కానుక పట్టుకెళ్ళాలి కదా! ఆయనకు పట్టుకు వెళ్ళడానికి మనింట్లో ఏమి కానుక ఉంది?" అని అడిగాడు. అపుడు ఆవిడ "మనకి ఉన్నదే మనం యిద్దాము. మన యింట్లో గుప్పెడు అటుకులు ఉన్నాయి. అవి మూట కట్టి యిస్తాను తీసుకువెళ్ళండి' అన్నది.

కుచేలుడి జీవితకాలంలో ఆయనను ఆ ఊళ్ళో చిరుగులేని పంచెను కట్టుకోవడం చూసిన వాడు లేదు. అందుకని ఆయనకు కుచేలుడు అని పేరుపెట్టి పరిహాసం ఆడేవారు. చేలము అనగా వస్త్రము. కుచేలము అనగా చిరిగిపోయిన బట్ట. చిరగని బట్ట కట్టడం కుచేలునికి తెలియదు. కుచేలుని బార్య అటుకులను చిరిగిపోయిన ఉత్తరీయంలో పోసి జాగ్రత్తగా ముడి వేసి కుచేలునికి ఇచ్చింది.

దానిని తీసుకుని కుచేలుడు కృష్ణుని వద్దకు బయలుదేరాడు. కుచేలుడు చిరిగిపోయిన బట్టలతో చెమట కంపుతో, రథములనుండి వస్తున్న ధూళి అంతా వంటిమీద పడిపోయి దుర్వాసన వచ్చే స్థితిలో ఆయన నడిచి నడిచి, చివరకు ద్వారకా నగరం చేరుకున్నాడు. ఏమి తిన్నాడో, ఏమి తినలేదో ఈశ్వరునికి ఎరుక. ద్వారకా పట్టణ సౌందర్యం చూసి ఆశ్చర్యపోయాడు.

తన సఖుడయిన గోవిందుడు ఎక్కడ ఉన్నాడోనని వాకబు చేసి కృష్ణ భగవానుడు ఉన్న యింటిని తెలుసుకున్నాడు. యింటిముందర పెద్ద పెద్ద శూలములు పట్టుకొని భటులు కాపలా కాస్తున్నారు. తన స్థితిని చూసి లోపలికి రానిస్తారో రానివ్వరో, కృష్ణ పరమాత్మ తనని గుర్తు పడతాడో పట్టాడో అనుకున్నాడు. రాజభటులకు ఏదైనా కానుక యిచ్చి లోపలికి వెళదాము అంటే తన దగ్గర కృష్ణునికి యివ్వడానికి తెచ్చిన అటుకులు తప్ప వేరొకటి లేదు. కాబట్టి యిపుడు వాసుదేవుడిని చేరడానికి తనకు వాసుదేవుడే ఆధారం అని అనుకుని సౌధం దగ్గరికి వెళ్లి తెరతీసి భటులను చూశాడు.

భటులు 'ఎవరు కావాలి అని అడిగారు. నేను కృష్ణ పరమాత్మ స్నేహితుడిని అని చెప్పాడు. అపుడు వాళ్ళు ఆయనను ఎగాదిగా చూశారు. పాపం ఆయన చాలా దయనీయమయిన స్థితిలో కనపడ్డాడు. కానీ ద్వారకానగరంలో ఉన్న కృష్ణ పరమాత్మ ఎటువంటి వాడో అక్కడ వున్న ద్వారపాలకులకు తెలుసు. అందుకని వారు వెళ్లి కృష్ణ పరమాత్మతో 'అయ్యా మీకోరకని చాలా పేద బ్రాహ్మణుడు మీ స్నేహితుడనని చెప్పి మిమ్మల్ని కలుసుకునేందుకు ద్వారం దగ్గర నిరీక్షిస్తున్నాడు' అని చెప్పారు.

అప్పుడు కృష్ణ పరమాత్మ రుక్మిణీ దేవి మందిరంలో అమ్మవారితో హాస్యోక్తులాడుతూ ఉన్నాడు. తెర తీసేసరికి దూరంగా రాజద్వారం దగ్గర నిలబడి ఉన్న కుచేలుడు కనిపించాడు. కుచేలుని అంతదూరంలో చూసి 'కుచేలా ఎప్పుడు వచ్చావు?' అని పలకరిస్తూ ఒక్కసారి మంచం మీద నుంచి క్రిందకు దూకి పరుగెత్తుకుంటూ వెళ్లి కుచేలుడిని గట్టిగా కౌగలించుకున్నాడు. కుచేలా ఎన్నాళ్ళకు చూశానయ్యా నిన్ను లోపలికి రావలసింది' అని కుచేలుని చేయి పట్టుకుని గబగబా లోపలికి తిన్నగా తన శయన మందిరంలోకి తీసుకువచ్చాడు.

అక్కడ ఒక పాన్పు ఉంది. రుక్మిణీ దేవి, తానూ తప్ప అన్యులు ఆ పాన్పును ముట్టరు. అటువంటి హంస తూలికా తల్పం మీద కుచేలుని కూర్చోబెట్టాడు. రుక్మిణీదేవిని పిలిచి బంగారు చెంబుతో నీళ్ళు తెప్పించి ఆయన కాళ్ళకింద పళ్ళెం వుంచి ఆదిలక్ష్మియైన రుక్మిణీదేవి నీళ్ళు పోస్తుండగా కృష్ణ పరమాత్మ కుచేలుని కాళ్ళు కడిగాడు. ఏ తల్లి కనుచివరి చూపు తగిలితే ఐశ్వర్యం వస్తుందని లోకం కొలుస్తుందో ఆ లక్ష్మీదేవి నీళ్ళు పోస్తుండగా, సమస్త బ్రహ్మాండములకు ఆధారభూతమయిన కృష్ణ పరమాత్మ కాళ్ళు కడుగుతున్నాడు. శిరస్సు వంచి ఆ నీళ్ళు తన శిరస్సు మీద కిరీటం మీద చల్లుకున్నాడు.

రుక్మిణీదేవి తలమీద చల్లాడు. అక్కడ ఉన్న వాళ్ళందరి మీద చల్లాడు.

ఆయన ఎంతో దూరం నుంచి నడిచి వచ్చి అలసిపోయాడని ఆయన ఒంటినిండా గంధం రాశాడు. ఒక విసనకర్ర పట్టుకొని విసురుతున్నాడు. కృష్ణ పరమాత్మ చేసిన హడావుడికి రుక్మిణీ దేవి తెల్లబోయింది. ఆమె కూడా తామరపువ్వులతో చేసిన విసనకర్రను తెచ్చి కుచేలునికి విసురుతున్నది. ఆ గాలి ఒంటికి తగిలి ఆయన సేదతీరాడు. మంచి ధూపమును ఆయనకు చూపించాడు. మణులతో కూడిన దీపములతో ఆయనకు నీరాజనం యిచ్చాడు.

తరువాత ఎంతో సంతోషంగా కుచేలునికి దగ్గరగా కూర్చున్నాడు. పరమ ఆప్యాయంగా కుచేలుని చేతులు తన చేతులలో పెట్టుకుని స్నేహితుని వంక చూసి యోగక్షేమములు అడిగాడు. కృష్ణ పరమాత్మ అలా ప్రవర్తించడం ఇంతకు పూర్వం ఎవరూ చూడలేదు.

ఏమి ఆశ్చర్యము! ఇంతకు పూర్వం నారదుడు వచ్చినప్పుడు చూశాము, ఎందరో మహర్షులు వచ్చినప్పుడు చూసాము. అందరినీ దర్బారు హాలులో కూర్చోబెట్టి మాట్లాడేవాడు.

అంతేకానీ ఈ బ్రాహ్మణుడు చూస్తే దరిద్రుడిలా ఉన్నాడు. ఏమి తపస్సు చేశాడో! మహా యోగులైన వారు తపస్సు చేస్తే తప్ప దొరకని పరమాత్మ ఈవేళ ఈ బ్రాహ్మణునకు ఎంత సేవ చేశాడు. ఆ తల్పం మీద రుక్మిణీ కృష్ణులు తప్ప అన్యులు కూర్చోవడం మనం యింతవరకు చూడలేదు.

ఈ బ్రాహ్మణుడు దానిమీద కూర్చోవడమా! అసలు ఈయన ఎవరు? అని వాళ్ళు ఆశ్చర్య పోతున్నారు.

అపుడు కృష్ణ పరమాత్మ కుచేలునితో ఓ బ్రాహ్మణోత్తమా! నీవు వివాహం చేసుకున్న స్త్రీ చాలాకాలం వేదం నమ్ముకును వేదపాఠం చెప్పుకున్న బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించిన పిల్ల అని నేను విన్నాను. అట్టి కుటుంబంలో పుట్టిన పిల్ల భర్తను అనుసరించి సుశీలయై ఉంటుంది.

నిన్ను చూస్తుంటే నీ మనస్సు భార్యయందు బిడ్డలయందు భ్రాంతి లేకుండా కేవలం సంసారంలో ఉండాలి కాబట్టి మాత్రమే ఉండి విహిత కర్మాచరణముగా భార్యాబిడ్డలను చూడాలి కాబట్టి చూస్తూ సంతతము బ్రహ్మమునందు రమిస్తున్న వాడిలా నాకు కనపడుతున్నావు. అవునా?" అని అడిగాడు. పిమ్మట ఇద్దరూ కలిసి భోజనం చేశారు. భోజనానంతరం మరల ఇద్దరూ వచ్చి కూర్చున్న పిమ్మట కృష్ణుడు కర్పూర తాంబూలమును తానే స్వయంగా చేసి తెచ్చి వేసుకోమని కుచేలునికి ఇచ్చాడు. ఆరోజున కృష్ణుడు పూర్తిగా కుచేలునితోనే గడిపాడు. కృష్ణ పరమాత్మ తాను కుచేలునితో గడిపిన చిన్ననాటి ముచ్చట్లను తలుచుకున్నాడు. కృష్ణ పరమాత్మ చూపిస్తున్న ఈ ప్రేమను కుచేలుడు జీర్ణం చేసుకోలేక పోతున్నాడు.

కుచేలా ఎవరి దగ్గరికయినా వెడితే ఏమయినా పట్టుకు వెళ్ళాలని మన గురువుగారు సాందీపని అంటూ ఉండేవారు కదా! మరి నువ్వు నాకు ఏమిటి తెచ్చావు?" అని గబగబా కుచేలుడిని తడిమేస్తున్నాడు. కుచేలుడు సిగ్గు పడిపోయాడు. ఆయన లక్ష్మీనాథుడు. గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయనకు తాను ఏమి యిస్తాడు? చిరిగిపోయిన ఉత్తరీయం మూట కట్టి ఉన్న అటుకులను చూశాడు. కుచేలా, చాలా ఐశ్వర్య వంతుడనని నాకు చాలామంది కానుకలు పట్టుకువచ్చి ఇస్తుంటారు.

అవి వాళ్ళందరూ నాయందు ప్రీతితో నేనే తినాలని తెచ్చినవి కావు. తమకు ఉన్నాయని ఆడంబరమునకు తెచ్చి యిచ్చిన వాళ్ళు ఉన్నారు వాటిని నేను ముట్టుకోను. ఒక ఆకు కాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని, కొబ్బరి నీళ్ళను గాని ఎవరయినా భక్తితో తెచ్చి యిస్తే వాటిని నేను పుచ్చుకుంటాను. భక్తితో తెచ్చిన వాటికి పెద్ద పీట వేస్తాను. ఆడంబరమునకు తెచ్చిన వాటిని పక్కన పెట్టేస్తాను. అని కుచేలుని వద్ద ఉన్న అటుకుల మూటను తీసుకొని విప్పి పిడికెడు అటుకులు తీసుకుని నోట్లో పోసుకున్నాడు. అలా పోసుకునే సరికి 14 భువనభాండములలో వున్న సమస్త జీవరాసుల కడుపునిండి బ్రేవుమని త్రేన్చాయి. కృష్ణుడికి యింకా ప్రీతి ఆగక మరియొక పిడికెడు తీసి పోసుకుంటున్నాడు.

దీనిని రుక్మిణీదేవి చూసింది. వెంటనే వచ్చి కృష్ణ పరమాత్మ చేయి పట్టుకుని, కృష్ణా, మీరు తిన్నది చాలు. యిహలోకమందు పదితరములు తినడానికి కావలసిన ఐశ్వర్యము భక్తి జ్ఞానము మోక్షము అన్నీ కుచేలునికి ఇచ్చేశారు. ఇంకొక పిడికెడు నోట్లో పోసుకుంటే నన్ను మిమ్ములను కూడా కుచేలునికి దాసులుగా ఇచ్చేస్తారు. ఇంకచాలు' అంది. ఆ తల్లికి అన్నీ తెలుసు.

పరమాత్మ కుచేలుడు యిచ్చిన అటుకులను ఎందుకు స్వీకరించాడు? గత జన్మలో కుచేలుడు ఎంతో భక్తితో భగవంతునికి ఎన్నో సేవలు చేశాడు. ఎన్ని సేవలు చేసినా ఎన్నడూ కూడా తన మనస్సులో ఈ కోరిక నాకు తీరితే బాగుండును అన్న కోరిక మాత్రం ఆయనకు లేదు. ఈశ్వరుని సేవ చేయడమే తన జీవితమునకు ధన్యము అని చేశాడు.

దాని వలన బ్రహ్మజ్ఞాని అయ్యాడు తప్ప ఆయనకు మనస్సులో మాత్రం కోరిక లేదు. తాను యింత దరిద్రంలో ఉన్నా ఈశ్వరుని సేవించి ఐశ్వర్యం పొందాలని భ్రాంతి కుచేలునికి లేదు. కానీ ఆయన భార్య ఐశ్వర్యం కావాలని అడిగింది. స్వామి మహాభక్తుల కోరిక తీర్చకుండా ఉండలేడు.

కుచేలుడు తెల్లవారు ఝామున లేని మరల తనకి వున్న మాసిపోయిన దుస్తులనే ధరించి 'కృష్ణా, నేను వెళ్ళివస్తాను' అని చెప్తే కృష్ణ పరమాత్మ గడపదాటి బయటకు వచ్చి కుచేలునికి వీడ్కోలు చెప్పాడు.

కుచేలుడు తన యింటి దారిపట్టి నడిచి వెళ్ళిపోతూ ఏమి నా భాగ్యం. ఏ పరమాత్మ దర్శనం కొన్ని కోట్లమంది అడుగుతారో అటువంటి వానితో కలిసి నేను కూర్చున్నానా. నేను తెచ్చిన అటుకులు తిన్నాడా. నా సఖుడిది ఏమి సౌజన్యం. నాకు ఇంతకన్నా జీవితంలో ఏమి భాగ్యం కావాలి అని అనుకున్నాడు. అప్పుడు తన భార్య కృష్ణ పరమాత్మను సంపద అడగమని పంపించిందని గుర్తుకు వచ్చింది.

కానీ కృష్ణుడు తన బట్టలను చూసి అయినా తాను మిక్కిలి బీదవానిగా ఉన్నాడని గ్రహించి సంపదను ఇవ్వవచ్చు కానీ అలా యివ్వలేదు' అని అనుకున్నాడు. ఇంత దరిద్రంలో ఉన్నాను కాబట్టి ఆ కృష్ణుడు నాకెప్పుడూ గుర్తు ఉంటున్నాడు. ఒకవేళ ఐశ్వర్యం ఇచ్చేస్తే ఆయనను నేను మరిచిపోయి పాడయిపోతానేమోనని దరిద్రమునే ఉంచి ఆయన నా మనస్సులో ఉండి పోయేటట్లు నాకు వరమును యిచ్చాడు. అని అనుకున్నాడు. తన ఇల్లు ఉన్నచోటికి వెళ్ళి చూశాడు.

అక్కడ సూర్యుడు చంద్రుడు ఏకకాలమునందు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అలాంటి సౌధం ఒకటి కనపడింది. ఆ సౌధమునకు చుట్టుప్రక్కల పెద్ద ఉద్యానవనములు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఎంతోమంది పరిచారికలు అటుఇటూ తిరుగుతున్నారు. ఎక్కడ చూసిన రత్నరాశులు ప్రోగుపడి ఉన్నాయి. ఇటువంటి ఇల్లు ఎ మహాపురుషునిదో తన పూరి యింటి స్థానంలో అత పెద్ద సౌధం ఎక్కడి నుంచి వచ్చినదా అనుకుని ఆశ్చర్యపోతూ అక్కడ ద్వారం దగ్గర నిలబడ్డాడు.

ఈయనను చూడగానే పరిచారికలు గబగబా బయటకు వచ్చి బంగారు పళ్ళెంలో ఆయన కాళ్ళు కడిగి ఆయనను మేళతాళములతో లోపలికి తీసుకువెళ్ళారు. అది తన యిల్లేనని తెలుసుకున్నాడు. తన భార్య పట్టు వస్త్రములను కట్టుకుని అనేకమైన బంగారు ఆభరణములను ధరించి ఎదురువచ్చి భర్త కాళ్ళకు నమస్కరించి వారి పూరి గుడిసె స్వామి కృప వలన యిలా అయిపొయింది అని చెప్పింది.

కృష్ణ పరమాత్మ అంత ఐశ్వర్యమును యిచ్చాడని చెప్తే పొంగిపోయి వాళ్ళు యింట్లో ఐశ్వర్యమును అనుభవించినా మనస్సులు మాత్రం ఎప్పుడూ కృష్ణుడి దగ్గరే పెట్టుకుని హాయిగా గోవింద నామము చెప్పుకుంటూ పరవశించి పోతూ యిహము నందు సమస్త ఐశ్వర్యమును అనుభవించి, అంత్యమునందు జ్ఞానము చేత మోక్షసిద్ధిని కుచేలుని భార్య బిడ్డలు పొందారు.

ఇంట పరమపవిత్రమయిన కుచేలోపాఖ్యానమును ఎవరు వినినను,చదివినను వారికి గొప్ప శుభ ఫలితం కలుగుతుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Astrologer told the story about real friendship.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more