• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శ్రీ గురు రాఘవేంద్రస్వామి

|

శ్రీ గురు రాఘవేంద్ర స్వామి(1595-1671)హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించారు. ఇతను వైష్ణవాన్ని (విష్ణువుని కొలిచే సిద్ధాంతం) అనునయించారు, మరియు మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. తమిళనాడులోని కుంభకోణం మధ్వమఠాన్ని 1624 నుండి 1636 వరకూ మఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరానికి యాత్రలు చేసారు. ఇతను శ్రీమూల రాముడి మరియు శ్రీ పంచముఖ ముఖ్యప్రాణదేవరు (పంచముఖ హనుమంతుడు) యొక్క పరమ భక్తులు.

ఇతను పంచముఖిలో తపస్సు చేశారు, ఇచ్చట పంచముఖ హనుమంతుణ్ణి దర్శించారు.(హనుమంతుని పంచముఖ దర్శనం శ్రీరామ చంద్రులు తర్వాత దర్శించినది శ్రీ రాఘవేంద్ర తీర్ధులు మాత్రమే) మంత్రాలయం లో తన మఠాన్ని స్థాపించారు, మరియు ఇక్కడే జీవ సమాధి పొందారు . వేలకొలదీ భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు.

రాఘవేంద్రస్వామి వెంకణ్ణ భట్టుగా తమిళనాడులోని భువనగిరిలో తిమ్మణ్ణభట్టు మరియు గోపికాంబ అనే కనడ భట్టు రాజులు రెండవ సంతానంగా 1595లో జన్మించారు. జన్మ సంవత్సరం 1598 లేదా 1601 కూడా కావచ్చు అనే వాదనలున్నాయి.

వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పుట్టినందుకు ఈతణ్ణి చిన్నప్పుడు వేంకటనాథుడనీ, వేంకటాచార్య అని కూడా పిలిచేవారు. తన బావ లక్ష్మీనరసింహాచార్ వద్ద మదురైలో ప్రాథమిక విద్యను అభ్యసించాక, వేంకటనాథుడ్ని కుంభకోణంలోని శ్రీమఠంలో విద్యార్థిగా చేరి, ఆపై రాఘవేంద్ర తీర్థులుగా సన్యసించారు. 1614లో మదురై నుండి తిరిగి వచ్చినపుడు సరస్వతీ బాయితో వీరికి వివాహమయింది.

వీరి కొడుకు లక్ష్మీనారాయణాచార్య అదే సంవత్సరంలో పుట్టాడు. ఆ తర్వాత కుటుంబమంతా కుంభకోణం చేరుకుంది. శ్రీమఠంలో రాఘవేంద్ర స్వామి సుధీంద్రతీర్థుల వద్ద అభ్యసించడం మొదలుపెట్టారు. అనతికాలంలో గొప్ప విద్యార్థిగా ఉద్భవించి, అన్ని వాదోపవదాల్లో తర్కాలలో తనకంటే పెద్దవారిని సైతం ఓడించారు. సంస్కృత మరియు వైదికశాస్త్రాల్లో నిష్ణాతుడై ఇతరులకు బోధించడం మొదలుపెట్టారు.

రాఘవేంద్రస్వామి సంగీతంలో కూడా నిష్ణాతులే, ఆయన కాలంలో ఆయనో గొప్ప వైణికుడు కూడా. గురువు తరువాత మఠం బాధ్యతలు స్వీకరించి ఆపై దక్షిణభారత దేశమంతా విజయం చేయటానికి బయలుదేరారు. మార్గంలో ఎన్నో అద్భుతాలను తన శిష్యబృందానికి చూపిస్తూ మధ్వప్రోక్త ద్వైత సిద్ధాంతానికి బాగా ప్రచారం చేసారు. 1671 లో తన శిష్యబృందంతో రాబోయే 800 సంవత్సరాలు జీవించే ఉంటానని చెప్పి మంత్రాలయంలో జీవసమాధి పొందారు.

శ్రీ గురు రాఘవేంద్ర స్వామి చరిత్ర

శ్రీరాఘవేంద్రులు జ్ఞాన సంపన్నుడు, సిద్ధ పురుషుడు. మంత్రాలయంలోని బృందావన సన్నిధానంలో భక్తులు పొందే శాంతి సంతృప్త్తుల మాటలకందనివి. అలజడి, అశాంతి, ఆందోళనలతో నిండిన నేటి నాగరిక సమాజానికి అటువంటి సత్పురుషుల సాహిత్యం, సాన్నిహిత్యం, సాన్నిధ్యం ఎంతో అవసరం. అది నిరంతరం వెలిగే అఖండ జ్యోతి.

గురు రాఘవేంద్రస్వామి చరిత్ర

గురు రాఘవేంద్రస్వామి చరిత్ర

శ్రీ రాఘవేంద్రస్వామి 1571లో కాంచీపురం సమీపంలోని భువనగిరిలో నిరుపేద కుటుంబంలో తిమ్మన్నభట్టు , గోపికాంబ దంపతులకు జన్మించాడు. తల్లిదండ్రులుపెట్టిన పేరు వెంకటనాధుడు. వీరి తాతగారు శ్రీకృష్ణ్ణదేవరాయల ఆస్థాన వైణికుడిగా వుండేవారు. వెంకటనాథుడి బాల్యంలోనే తల్లిదండ్రులు గతించారు. బావగారైన లక్ష్మీనారాయణ చేరదీశాడు. బావగారి పెంపకంలోనే వెంకటనాథుడు సర్వశాస్త్ర పారంగతుడయ్యాడు.

యుక్తవయసు రాగానే సరస్వతి అనే కన్యతో వివాహమైంది. ఓ పిల్లవాడు కూడా పుట్టాడు. కాని వెంకటనాధునికి దరిద్రం దావాలనంలా చుట్టుముట్టింది. ఆదుకునేవారెవరు లేరు. నిస్సహాయ స్థితిలో వెంకటనాధుడు భార్యాబిడ్డలతో కలిసి కుంభకోణం చేరుకున్నాడు. అనూహ్యంగా అక్కడ తాత్కాలికంగా బసచేసిన సుధీంద్ర తీర్థులవారి ఆశ్రయం లభించింది.

గురు సాంగత్యం

గురు సాంగత్యం

సుధీంద్రుడు కొత్త శిష్యుడైన వెంకట నాధుని ఎంతో ప్రేమగా ఆదరించాడు. శిష్యుని అసమాన్య ప్రజ్ఞాపాటవాలకు ఆశ్చర్యపోయాడు. అతని మేథాశక్తిని, శాస్త్ర జ్ఞాన ప్రావీణ్యాన్ని అభినందించకుండా ఉండలేకపోయాడు. జ్ఞాన వరిష్టుడైన వెంకటనాధుని వినయ విధేయతలు చిత్తశుద్ధీ గురువైన సుధీంద్ర యతీంద్రులను బాగా ఆకర్షించాయి. వయోభారంతో వున్న సుధీంద్రులు శిష్యుడైన వెంకటనాధుని ఒకరోజు పిలిచి "వెంకటనాథా! నేను వృద్ధాప్యంలో ఉన్నాను. ఈ శరీరం నేడోరేపో అన్నట్టుగా ఉంది. రామచంద్రమూర్తి ఆరాధన నిరంతరాయంగా కొనసాగించేందుకు నా తర్వాత ఈ పీఠాధిపత్యం నీవు వహించాలి" అని తన మనసులోని కోరికను బయటపెట్టాడు.

తనకు భార్యాబిడ్డలున్నారని కుటుంబ పోషణ చేసి వారిని సుఖపెట్టడం తన బాధ్యత అని చెప్పాడు వెంకటనాథుడు.

గురువుగారి కోరికను తీర్చలేకపోతున్నందుకు వ్యాకులపడుతూ ఇంటికి చేరుకున్నాడు. భార్యకేమీ చెప్పలేదు. ఆ రాత్రి కలలో సరస్వతీదేవి ప్రత్యక్షమై "నాయనా వెంకటనాథా! నీవు కారణ జన్ముడవు. నీ అద్భుత మేధా సంపత్తితో సద్గురువువై దారి తప్పిన జనాలకు దారి చూపు! అంతేకాదు వ్యతిరేక వర్గాల ఎదురు దాడులనుంచి మధ్వ సిద్ధాంతాన్ని మధ్వ సాంప్రదాయాన్ని రక్షించగల సమర్ధుడవు నీవే. లే! ఆలోచించక నీ గురువు చెప్పినట్టు చెయ్యి" అని పలికింది. మేల్కొన్న వెంకటనాథుడు పరుగు పరుగున గురువు సన్నిధికి చేరుకున్నాడు.

సుధీంద్రులు వెంకటనాథుని తంజావూరులోని తన ఆశ్రమానికి తీసుకునిపోయి శాస్త్రోక్తంగా సన్యాస దీక్షనిచ్చి పీఠాధిపత్యం అప్పగించాడు. దీక్షానామం రాఘవేంద్రస్వామి.

 40 ఏళ్ల పవిత్ర జీవనం

40 ఏళ్ల పవిత్ర జీవనం

సన్యాస దీక్ష తీసుకునేనాటికి రాఘవేంద్రుల వయసు 23 ఏళ్లు. తదుపరి 40 ఏళ్లు అతి పవిత్ర జీవనం గడిపి నియమ నిష్టలతో నిత్య సైమిత్తికాలతో మూలరాముని ఆరాధించాడు. ఈ 40 ఏళ్ల కాలంలో సాధించిన విజయాలు, జరిగిన సంఘటనలు, మహిమలు వారి సోదరి కుమారుడు నారాయణాచార్‌ రాఘవేంద్ర విజయమ్‌ అన్న గ్రంథంలో నిబద్ధం చేశారు. ఆనాటి నవాబు ఒకరు రాఘవేంద్రులను పరీక్షింపదలచి రెండు బుట్టలతో మాంసం పంపాడు. భక్తులు శిష్యులు ఆ బుట్టలు తెరిచి చూడగా పళ్లు, పువ్వులు అందులో ఉన్నాయి. ఒకసారి మృతి చెందిన బాలుడికి ప్రాణం పోశారు.

నిరక్షరాస్యుడైన వెంకన్నను ఆదోనిలోని గవర్నరు వద్ద దివాను స్థాయికి పెంచడం, సిద్ధి మస్సానెత్‌ఖాన్‌ మంత్రాలయం గ్రామాన్ని రాఘవేంద్రులకు రాసి ఇవ్వడం (మద్రాస్‌ డిస్ట్రిక్ట్‌ గెజిటీర్‌ పునర్ముద్రణ 1916 చాప్టర్‌ 15 ఆదోని తాలూకా పేజీ 213) వంటివి జరిగాయి. మద్రాసు గవర్నర్‌ ధామస్‌ మన్రోకు రాఘవేందస్వ్రామి చూపిన అద్భుతాలు బళ్లారి జిల్లా గెజిటీర్‌లో చూడవచ్చు. రాఘవేంద్రుల యశశ్చంద్రికలు దశదిశలా పాకాయి.

బృందావనిలో జీవ సమాధి..

బృందావనిలో జీవ సమాధి..

పీఠాధిపత్యం వహించి నలభై ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంలో శిష్యుడైన వెంకన్నను పిలిచి విషయమంతా సేకరించి తుంగభద్రా తీరాన మంత్రాలయంలో తాను జీవ సమాధి కావడానికి అందమైన బృందావనం నిర్మించమని కోరాడు. చెప్పిన ప్రకారం వెంకన్న చక్కని బృందావన మందిరాన్ని నిర్మించాడు. శ్రీ రాఘవేందస్వ్రామి నిత్య నైమిత్తికాలు పూర్తి చేసుకుని శుచియై చేతిలో వీణను పట్టుకుని సమాధిలో ప్రవేశించాడు.

శ్వాసని నిలిపివేసి మనోలయం చేశాడు. 1200 సాలిగ్రామాలతో బృందావన సమాధిని మూసివేశారు. సమాధి గతుడైన తర్వాత ఆయన చూపిన మహిమలు, చేసిన అద్భుతాలు కోకొల్లలు. 700 సంవత్సరాలు సూక్ష్మరూపంలో బృందావనంలో ఉండి తన భక్తులను అనుగ్రహిస్తానని ఆయన చేసిన ప్రకటన సత్యాతి సత్యం.

ఆయన ప్రియశిష్యుడు అప్పణాచార్యులు తుంగభద్ర ఆవలి తీరాన వుండేవారు. గురువు సమాధి ప్రవేశం చేస్తున్నాడని తెలిసి నదిని దాటి పరుగున బృందావనానికి చేరుకున్నాడు. అప్పటికే అంతా ముగిసింది. అప్పణాచార్యులు కవి కన్నీటి పర్యంతం అయ్యాడు. తాను వస్తూ దారిలో అల్లుకుంటూ వచ్చిన శ్లోకంలో ఏడక్షరాలు ముగింపులో కొరవడ్డాయి. వ్యధ చెందుతున్న శిష్యుడిని తృప్తిపరిచేందుకు ఆ ఏడక్షరాలు సమాధిలోంచి వెలువడ్డాయి. ఆ శ్లోకమీనాటికీ బృందావనంలో ప్రార్ధనలో పఠిస్తారు. అసమాన శేముషీదురంధరుడైన రాఘవేంద్రునికి టిప్పణాచార్య చక్రవర్తిగా బిరుదు లభించింది. వ్యాకరణ శాస్త్రంలో ఆయన ప్రజ్ఞా పాటవాలకు మెచ్చి మహా భాష్యకార బిరుదంతో సన్మానించారు.

ఆయన స్వతంత్ర రచనల్లో జైమిని పూర్వ మీమాంస సూత్రాలకు రాసిన భాష్యం భట్ట సంగ్రహం భారతీయ తత్వశాస్త్రానికి అపురూపమైన కానుక. వివిధ భాషలకు సులభంగా వ్యాఖ్యానాలు రచించి మధ్వ సిద్ధాంత ఔన్నత్యాన్ని ప్రతిపాదించాడు.

ఐతరేయోపనిషత్తు మినహా తొమ్మిది ప్రధాన ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలు రచించారు. వ్యాసతీర్థల చంద్రికకు ప్రకాశిక పేరుతో చేసిన పరిమళ వ్యాఖ్యానంతో పరిమళాచార్యుడుగా వాసికెక్కాడు.

శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మహిమలు

శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మహిమలు

శ్రీ గురురాయ రాఘవేంద్ర యతీంద్రులు కారణ జన్ములు.ఆయన బృందావన ప్రవేశానికి ముందు , బృందావన ప్రవేశం తరువాత కుడా ఎన్నో మహిమలు భక్తులకు అనుభవమవుతునే ఉన్నాయి.వాటిలోని కొన్ని లీలలను స్మరించుకుందాం.

శ్రీ స్వామి ని ఒక బ్రహ్మచారి చాలకాలంగా సేవించు కుంటూ ఉండేవాడు కొంతకాలానికి అతనికి పెళ్ళి చేసుకోవాలనే ఆశ కలిగింది. శ్రీ గురువుల ఆశీర్వచనం తీసుకొని వెళదామని స్వామి చెంతకు వచ్చాడు.ఆసమయం లో శ్రీ రాఘ వేంద్రులు మృత్తికా శౌచము చేసుకుంటున్నారు. ఆమృత్తిక నే ఒక పిడికెడు యిచ్చి, పో ,నీకు మంచి జరుగుతుందని దీవించి పంపారు. ఆ యువకుడు ప్రయాణం చేస్తూ, మార్గమధ్యం లో ఒక రాత్రి ఒక కరణం గారి ఇంటిముందు పడుకున్నాడు.

అర్ధరాత్రి సమయానికి ఒక బ్రహ్మ రాక్షసుడు బిగ్గరగా అరుపులు కేకలతో వాణ్ణి నిద్రలేపాడు.." నాకు దారి ఇవ్వమని. నీ తలపాగ లో అగ్ని ఉందని, దాన్ని తీసిపారేయమని "అరవసాగాడు.. విషయం అర్ధమైన ఆ యువకుడు " నీకు దారిస్తే నాకేంటి ప్రయోజనం "అని అడిగాడు. అందుకు బ్రహ్మరాక్షసుడు ఒక బంగారు పళ్ళాన్ని బహుకరించగా. ఆ యువకుడు తలక్రింద పెట్టుకున్న , స్వామి ఇచ్చిన మృత్తిక ను కొద్ది గా తీసి రాక్షసుని మీదకు విసిరాడు. వెంటనే ఆ బ్రహ్మరాక్షసుడు భగభగ మండి మాడి మసై పోయాడు. ఈ గలాటా అంతా విని భైటకొచ్చిన ఇంటి యజమాని ,ఇన్నాళ్లు తనకు పుట్టిన బిడ్డలను తినేస్తున్న బ్రహ్మరాక్షసుని పీడ విరగడైనందుకు సంతోషించాడు. అందుకు కారకుడైన ఆయువకుని ఆదరించి తన చెల్లెలినిచ్చి వివాహం చేశాడు. ఇటువంటి గాథలెన్నో శ్రీవారి మృత్తికామహిమలను గూర్చి, శిష్యులయెడ గురువుల అనుగ్రహాన్ని గూర్చి తెలియజేస్తున్నాయి.

మాంసపు ముక్కలను పట్టువస్త్రం తో కప్పి, కానుకగా పంపించిన ఆదోని నవాబుకు జ్ఞానోదయమయ్యేటట్టు ,మంత్రించిన జలంతో మాంసపు ఖండాలను ఫల పుష్పాలుగా మార్చి, క్షమాపణ కోరిన నవాబు నుండి మంచాల గ్రామాన్ని జాగీరు గా పొందారు. ఆవుల కాపరి వెంకన్న అనే వ్యక్తి స్వామి అనుగ్రహం తో విద్వాంసుడై, మఠాన్ని నిర్మించి, సేవించి. తరించాడు.

పాము కాటుకు గురైన రాజకుమారుని బ్రతికించాడు. గడపకు తల తగిలి మరణించిన భక్తునిపై మంత్రోదకం చల్లి బ్రతికించాడు. తంజావూరు రాజ్యం లో కరువు కాటకాలు పెచ్చరిల్లడం తో ఆ రాజు కోరిక మేరకు రాజధాని లో ప్రవేశించి, ధాన్యపు కొట్టుపై శ్రీ అనే బీజాక్షరాన్ని సంస్కృతం లో వ్రాసి, అదే బీజాక్షరాన్ని నిత్యము వ్రాస్తూ, జపం చేయమని ఆజ్ఞాపించారట. కొద్దికాలం లోనే కుండపోత గా వర్షాలు పడి, పంటలు పండి, క్షామనివారణ జరిగింది. స్వామివారి మృత్తికా స్పర్శ చే పిశాచాలు పారి పోతాయి.. మంత్రాక్షతలు ఆరోగ్యవంతుల్ని చేస్తాయి.

స్వామి సమాధిస్ధు లైన 150 సంవత్సరాలకు సమాథి నుండి లేచి వచ్చి, మంత్రాలయం ఆస్తులను పరిశీలించ వచ్చిన అప్పటి మద్రాసు గవర్నర్ థామస్ మన్రో తో స్వయం గా మాట్లాడి, అక్షతలిచ్చారట. అతడాశ్చర్య చకితుడై ఆ మంత్రాక్షతలను ఆనాడు వండెడి బియ్యంలో కలిపి వండించుకొని భుజించాడు. ఈ విషయం మద్రాసు రివ్యూ ఎనిమిదవ సంపుటము 280 వ పేజిలో వ్రాయబడింది. ఈ విషయాన్ని ఎత్తి బళ్ళారి జిల్లా గెజిటీరు మొదటి సంపుటం లో 15 వ ప్రకరణం లో ఆదోని తాలూకా ను గురించి 213 -వ పేజీలో ప్రచురించబడింది.

శ్రీ గురు రాఘవేంద్రుల వారి పాదాలను స్మరించుకుంటూ భక్తి ప్రపత్తులతో గురుస్తోత్రాన్ని పఠించే వారికి దుఖాలు దూరమౌతాయి. గురువుల ఆనుగ్రహం కలుగుతుందని చెప్పబడుతోంది..శ్రీ గురు రాఘవేంద్ర యతీంద్రుల అనుగ్రహం మనందరిపై వర్షించాలని ఆశిస్తూ ...

పూజ్యాయ రాఘవేంద్రాయ

సత్యధర్మ రతాయచ

భజతాం కల్పవృక్షాయ

నమతాం కామధేనవే

ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః

శ్రీ రాఘవేంద్ర తీర్థులు కలియుగ కల్పవృక్షం

మంత్రాలయంలో వెలసిన శ్రీ రాఘవేంద్రతీర్థులు. భక్తకోటికి కష్టాలు కడ తేరుస్తూ మంత్రాలయం మహర్షిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. మంత్రాలయ ఋషి రాఘవేంద్రులు మానవ కళ్యాణంకోసం వెలిసిన మహిమాన్విత మహనీయుడు శ్రీరాయలు. భక్తులు రాఘవేంద్రస్వామిని శ్రీరాయలు అని పిలుచుకుంటారు. బృందావనం నుంచే సజీవుడిగా వుండి భక్తుల మొర ఆలకిస్తున్న దేవుడు రాఘవేంద్రస్వామి. ‘‘నేను, దేవుడు ఒకటికాము మేమిరువురము వేరువేరు. అతడు ఈశుడు, నేనాతని దాసుడను మాత్రమే'' అని చెప్పే ద్వైత సిద్ధాంతంను ప్రవచించిన మద్వాచార్యుల బోధనల వ్యాప్తికోసం ప్రచారంచేసిన వారే శ్రీ రాఘవేంద్రస్వామి. మద్వా సిద్ధాంతం ప్రకారం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో పూజలు సాగుతున్నాయి. మద్వ ప్రచారం సాగిస్తూ మానవ కళ్యాణంకోసం యోగిగా మారిన మహానుభావుడు శ్రీ రాయలు.

అలాంటి మహనీయుడైన శ్రీ రాఘవేంద్రులు క్రీ.శ.1595 సంవత్సరం, మన్మనాథ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ సస్తమీ మృగశిరా నక్షత్రంలో తిమ్మన్నభట్టు, గోపాంబ దంపతులకు కలిగిన సంతానమే సన్యాసం తీసుకున్న తరువాత రాఘవేంద్రునిగా మారిన రాజయోగి. తల్లిదండ్రులు వెంకటనాధునిగా నామకరణం చేసారు.

వెంకటనాథుడు చిన్నతనం నుంచి అన్ని విద్యలలో ఏకసంథాగ్రాహి. గురువుల అనుగ్రహాన్ని పొందినవాడు. వెంకటనాధుని తెలివితేటలు గురించి అందరూ పొగిడేవారే. తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. వెంకటనాధుడు మధురలోని బావ లక్ష్మీనరసింహాచార్యులవద్ద వేదమంత్రాలు చదవటంలో మెలకువలు నేర్చుకున్నారు. తమ వంశపార్యపరంగా వచ్చే వీణావాయిద్యాయిని కూడ వేంకటనాధుడు నేర్చుకున్నారు. వెంకటనాధుడు చదువు కొనసాగిస్తున్న ఆయన మనస్సు మాత్రం మఠంలో మూల రాముల పూజలు చేయటానికే మనస్సు తహతహలాడుతూ వుండేది. శ్రీ సుదీంద్ర తీర్థుల వద్ద శిష్యునిగా చేరి టీకా, తాత్పర్యాలు వ్రాసి పరిమళచార్యునిగా గురువుచేత బిరుదు పొందాడు. అమరకోశం కంఠస్తంగా వుండేది. సంస్కృతం, నిఘంటువులు వెంకటనాథుని నోట్లోనే వుండేవి.

చదువులు ముగిసిన అనంతరం యవ్వనంలో వున్న వెంకటనాథునికి సరస్వతీ అనే అపూర్వ అందమైన అందాల రాశితో వివాహం జరిగింది. వీరి వివాహం ఎంతో వైభవంగా సాగింది. ఒక పుత్రుడు జన్మించాడు. వెంకటనాథుని జీవితంలో కడు దారిద్య్రం దాపురించింది. చివరికి భార్య అనుమతి తీసుకొని గురువుతోపాటు దేశ సంచారం సాగిస్తూ వేదాంత చర్చలు జరిపి ఎందరినో మెప్పించారు. గురుసుదీంద్ర తీర్థులు వెంకటనాధునికి మహాభాష్యాచార్యుడని బిరుదు ఇచ్చారు. సాటిలేని పండితునిగా వేంకటనాథుడు గురువు సన్నిధిలో పెరిగాడు.

తన తరువాత మఠంకు వారసుడు వెంకటనాథుడని గురువు సుదీంద్రులు భావించారు. అంతేకాకుండా ఒక రోజు కలలో శ్రీ మూలారాములు సుదీంద్రులకు వచ్చి తన అనంతరం పీఠం ఎక్కే అర్హత వెంకటనాథునికి మాత్రమే వుందని చెప్పారు. ఈ విషయాన్ని వెంకటనాథునికి గురువు సుదీంద్రులు వివరించారు. సన్యాసం స్వీకరించే విషయం మీమాసంలో వున్న వెంకట నాథునికి సరస్వతీదేవి కలలో కనిపించి మఠం పీఠాధిపతిగా సన్యాసం స్వీకరించి మద్వా సిద్ధాంతాన్ని లోకాన్ని విస్త్తరింపచేయాలని సెలవిచ్చింది. సరస్వతీదేవి కోరిక కూడా ఇదే కావటంతో వెంకటనాథుడు సన్యాసం స్వీకరించటానికి సిద్ధమై గురువు సుదీంద్రులకు తన అభిప్రాయాన్ని తెలిపారు. తంజావూరు పాలకుడు రఘునాథ భూపాలుని ఆధ్వర్యంలో క్రీ.శ.1621, ఫాల్గుణశుద్ధ ద్వితీయలో ప్రజల సమక్షంలో పీఠాధిపతిగా పట్ట్భాషేకంగావించి సన్యాసం స్వీకరించారు. గురువు సుదీంద్రతీర్థులు వెంకటనాథునికి రాఘవేంద్ర తీర్థులు అని నామకరణం చేసారు. గురు సుదీంద్రతీర్థులు మూల విగ్రహాలైన మూల రామచంద్రుని విగ్రహం, దిగ్విజయరాముల విగ్రహం, జయరాముని విగ్రహం, వేదాంత గ్రంథాలు, శివతఛత్రం, వింజామరలు, స్వర్ణపల్లకి, మఠం కార్యక్రమాలు అన్ని కూడ శ్రీ రాఘవేంద్రతీర్థులకు అప్పగించారు. 1623లో గురువు సుదీంద్రతీర్థులు హంపీవద్ద గల నవ బృందావనం అనే ప్రాంతంలో బృందావనస్థులైనారు.

శ్రీ రాఘవేంద్ర తీర్థులు తంజావూరు, వెల్లూరు, శ్రీరంగం, రామేశ్వరం, మధుర మొదలగు ప్రాంతాలలో పర్యటన చేసి మద్వప్రచారం గావించి వేదాంత చర్చలు జరిపి అనేకమంది పండితులను ఓడించాడు. రాఘవేంద్ర తీర్థులు శ్రీ వ్యాస తీర్థులు వ్రాసిన ‘చంద్రిక' అనే గ్రంథానికి ‘ప్రకాశం' అనే వివరణ వ్రాసారు. న్యాయముక్తావళి, ‘తంత్రీ దీపిక' సుధ, పరిమళ అనే మున్నగు గ్రంథాలను వ్రాసారు. భక్తులకు అనేక మహిమలు కూడ చూపాడు. ఆదోని పర్యటనలో స్వామి వున్నప్పుడు, ఆదోనిని పాలించే సిద్ధిమసూద్‌ఖాన్ అనే రాజు రాఘవేంద్రుని సభకు ఆహ్వానించారు.

స్వామిని పర్యవేక్షించటానికి పళ్ళెంలో మాంసం ముక్కలు పెట్టి దానిపై గుడ్డకప్పి స్వీకరించమని చెప్పారు. స్వామి వెంటనే ఆ పళ్ళెంపై మంత్రపు జల్లులతో చల్లగా మాంసం పూవ్వులుగా మారాయి. దాంతో సిద్దిమసూద్‌ఖానే స్వామి మహత్యం తెలుసుకొని రాఘవేంద్రుని కోర్కె మేరకు ‘మంచాల' గ్రామాన్ని దత్తతగా ఇచ్చారు. మంచాలమ్మ దేవత కొలువై వున్న మంచాల గ్రామంలోనే శ్రీ రాఘవేంద్రులు మఠం ఏర్పాటుచేసుకొని భక్తులకు మహిమలు చూపుతూ, మరోవైపు మధ్వప్రచారం సాగిస్తూ శ్రీ రాఘవేంద్రులు క్రీ.శ.1671, విరోధికృత్ శ్రావణ బహుళ ద్వితీయరోజున రాఘవేంద్రులు సశరీరంతోనే బృందావనం ప్రవేశం చేసారు.

స్వామి బృందావనం చేసిన మంచాల గ్రామం మంత్రాలయ నేడు ఒక మహా పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. ఆనాటి నుంచి ఈ బృందావనం నుంచే స్వామి భక్తుల కోర్కెలు తీర్చుతూ రాఘవేంద్రస్వామిగా పూజలు అందుకుంటున్నాడు. భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా, సాహితీవేత్తగా, మహిమలు చూపే మహనీయుడుగా పూజలు అందుకున్న రాఘవేంద్రులు భక్తుల హృదయాలలో కొలువై వున్నాడు. కలియుగ కల్పవృక్షంగా భక్తులు కొలుస్తారు.

అందుకే ఆయన దేవుడయ్యాడు

అందుకే ఆయన దేవుడయ్యాడు

రాఘవేంద్రస్వామి సన్యాసాశ్రమం తీసుకోవడానికి ముందు, అంటే వేంకటనాథుడుగా ఉన్న రోజుల్లో తన ఇంట్లోనే కొంతమంది పిల్లలకు వేదం చెబుతూ ఉండేవాడు. అయితే అందుకు ఆయన దక్షిణ కూడా తీసుకునేవాడు కాదు. దాంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటి అవసరాలకి సంబంధించిన ధాన్యం ... కూరగాయలు ఇస్తూ ఉండేవారు. అలా వచ్చిన వాటితో ఆయన భార్య సరస్వతి కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉండేది.

అలాంటి పరిస్థితుల్లో ఓ పశువుల కాపరి కొడుకు వీధి అరుగుపై కూర్చుని స్వామి చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటూ ఉండేవాడు. అది గమనించిన స్వామి ఆ పిల్లవాడిని లోపలికి పిలుస్తాడు. భయపడుతూనే లోపలి వచ్చిన ఆ పిల్లవాడు, తనకి చదువుకోవాలని ఉందని చెబుతాడు. తన దగ్గరున్న శిష్యులకన్నా అ కుర్రవాడు చకచకా పాఠాలను అప్పగించడం చూసిన స్వామి ఆశ్చర్యపోతాడు. ఇక నుంచి అందరితో పాటు ఆ పిల్లవాడికి చదువు చెప్పాలని నిర్ణయించుకుంటాడు.

అయితే ఈ విషయం తెలుసుకున్న మిగతా విద్యార్ధినీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తారు. ఆ పిల్లవాడితో కలిసి తమ పిల్లలు చదువుకోరనీ, అతనికి పాఠాలు చెప్పాలనే ఆలోచన విరమించుకోమని అంటారు. అందుకు స్వామి నిరాకరించడంతో, వాళ్లు తమ పిల్లలను పంపించడం మానేస్తారు. అంతమంది పిల్లలు పాఠాలు చెప్పించుకోవడానికి రాకపోతే ఇల్లు గడవడం కష్టమవుతుందేమోనని సరస్వతి ఆందోళన వ్యక్తం చేస్తుంది.

భగవంతుడు తనని నమ్మిన వారిని ఎప్పుడూ ఉపవాసం ఉండనీయడనీ, ఆ విషయం గురించి కంగారు పడవద్దని స్వామి ధైర్యం చెబుతాడు. ఆ రోజు నుంచి ఆయనకి అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నా, ఆ పిల్లవాడికి పాఠాలు చెప్పడం మాత్రం ఆపలేదు. అలా ఆ రోజుల్లోనే కులమతాలకు అతీతంగా వ్యవహరించిన రాఘవేంద్రస్వామి, నేటికీ అన్ని వర్గాల వారి హృదయ పీఠాలను అధిష్ఠించి కనిపిస్తుంటాడు.

English summary
Sri Raghavendra Swami was born as Sri Venkata Natha (Venkata Ramana), the second son of Sri Thimanna Bhatta and Smt. Gopikamba on Thursday, Sukla Navami of Phalguna month in 1595, when the moon was in Mrigashīrsha Nakshatra, at Bhuvanagiri, near present-day Chidambaram in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X