హైదరాబాద్: తెలంగాణ కోసం మరో విద్యార్థి ప్రాణాలు తీసుకున్నాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సాయికుమార్ అనే బిటెక్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతన్ని తోటి విద్యార్థులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మంగళవారం మధ్యాహ్నం మరణించాడు. దీంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ కోసమే తాను ఆత్మబలిదానం చేసుకుంటున్నట్లు అతను స్యూసైడ్ నోట్ రాసి పెట్టాడు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిటెక్ చదువుతున్న సాయికుమార్ నల్లగొండ జిల్లా కోదాడ సమీపంలోని గ్రామానికి చెందినవాడు. సాయికుమార్ మృతదేహాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తరలించుకుపోవడానికి విద్యార్థులు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు స్వస్థలానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో గాంధీ అస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థి మరణవార్త తెలుసుకుని వచ్చిన వైస్ చాన్సలర్ తిరుపతిరావును విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.