ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీసు తుపాకీ పేలి ఇద్దరు విద్యార్థుల నిండు ప్రాణాలు బలి

By Pratap
|
Google Oneindia TeluguNews

Khammam Dist
ఖమ్మం: ఖమ్మంజిల్లా వేలేరుపాడు మండల కేంద్రంలో బుధవారం ఓ పోలీసు తుపాకీ పేలి ఇద్దరు విద్యార్థులు మరణించారు. వేలేరుపాడులో జరిగిన అమరవీరుల దినోత్సవంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వేలేరుపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం పోలీసులు 'ఓపెన్‌ హౌజ్‌' కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా స్టేషన్‌లో ఉన్న వివిధ రకాల తుపాకులు, బుల్లెట్లు, క్రిమినల్‌ ప్రోసీజర్‌ కోడ్‌ పుస్తకాలను ప్రదర్శించారు. ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ శ్రీనివాసరావు కార్బన్‌ తుపాకీ గురించి విద్యార్థులకు వివరిస్తున్నాడు. బుల్లెట్లను లోడ్‌ చేసి చూపించాడు. ట్రిగ్గర్‌ ఇలా నొక్కితే బుల్లెట్లు బయటకొస్తాయి అని శ్రీనివాసరావు చెబుతున్నంతలోనే తుపాకీ పేలింది. ఎదురుగా కూర్చుని ఉన్న విద్యార్థులపైకి నాలుగు తూటాలు దూసుకుపోయాయి. ముందు వరుసలో ఉన్న పదో తరగతి విద్యార్థి మేడేపల్లి వెంకటకృష్ణ(16) ఛాతీలోకి ఒక తూటా దూసుకుపోవడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. మరో నలుగురు విద్యార్థులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఎనిమిదో తరగతి చదువుతున్న పసుమర్తి సత్యసాయిబాబు (13) కడుపు నుంచి ఓ తూటా దూసుకెళ్లి బయటకు వచ్చింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే సాయిబాబు ప్రాణాలు విడిచాడు. ఏడో తరగతి విద్యార్థి గుగులోతు నవీన్‌ కుమార్‌ కు కుడి చెంప నుంచి మరో తూటా దూసుకుపోయింది. అతని పరిస్థితి విషమంగా ఉంది. మరో విద్యార్థి కిశోర్‌ కాలికి గాయమైంది. గుమ్మళ్ల నాగరాజు అనే తొమ్మిదో తరగతి విద్యార్థి చెవికి కూడా గాయమైంది.

విద్యార్థులు మృతిచెందిన విషయం తెలియగానే కానిస్టేబుల్‌ శ్రీనివాసరావు అదే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోబోయాడు. సహోద్యోగులైన పోలీసులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఆగ్రహించిన స్థానికులు పెద్దఎత్తున పోలీసు స్టేషన్‌కు వచ్చి విద్యార్థి మృతదేహాన్ని స్టేషన్‌ ఎదురుగా ఉంచి రాస్తోరోకో చేశారు. ఘటనకు బాధ్యుడైన కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌రావుపై కేసు నమోదు చేసినట్లు ఖమ్మం ఎస్పీ క్రాంతిరాణా తెలిపారు. పర్యవేక్షణ లోపానికి బాధ్యుడైన ఎస్‌ఐని సస్పెండ్‌ చేశామన్నారు. ఈ దుర్ఘటనపై సమగ్ర న్యాయ విచారణకు ఆదేశించామని, మృతుల కుటుంబాలకు తక్షణ సాయం కింద రూ.25 వేలు చొప్పున, గాయపడిన వారికి రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం అందించినట్టు ఖమ్మం కలెక్టర్‌ తెలిపారు. కానిస్టేబుల్‌ నిర్లక్ష్యం కారణంగానే తుపాకీ పేలిందని, సంబంధిత కానిస్టేబుల్‌పై ఇప్పటికే కేసు నమోదు చేశామని డీజీపీ అరవిందరావు స్పష్టం చేశారు. అతనిని న్యాయస్థానంలో హాజరుపరిచామన్నారు. ప్రదర్శనకు పెట్టే ఆయుధాల్లో తూటాలు లోడ్‌ చేయకూడదని, ఇక్కడ మాత్రం లోడ్‌ చేసి ఉన్న తుపాకులే పెట్టారని, అది ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నామన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X