హైదరాబాద్: ప్రభుత్వం ఆసుపత్రులలోని వైద్యులపై దాడులు జరక్కుండా నివారించడానికి ప్రత్యేక పోలీసు దళం ఏర్పాటు చేయాలనే డిమాండుతో వైద్య విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఏడో రోజుకు చేరుకుంది. అయినప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండటం శోచనీయం. నీలోఫర్, మహాత్మా గాంధీ, ఉస్మానియా, కోఠి ఆసుపత్రులలో వైద్యం అందక రోగులు ఇబ్బంది పడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
అయితే జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తుండటంతో రోగులకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఉండటానికి ఇతర ప్రాంతాలలోని డాక్టర్లను తీసుకు వచ్చే పనిలో ఉన్నామని నీలోఫర్ వైద్యులు చెబుతున్నారు. అయితే ఆదివారం వరకే జుడాల సమ్మె కారణంగా ఆదివారం ఒక్కరోజే ఎనిమిది మంది చిన్నారులు మరణించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే రోజుకు పది నుండి పదిహేను మంది చిన్న పిల్లలు మరణించడం సహజమే అని డాక్టర్లు చెప్పడం విశేషం.