టిడిపి ఎమ్మెల్యేలపై గుడ్లు: పోలీసుల లాఠీఛార్జ్, పరిస్థితి ఉద్రిక్తం
Districts
oi-Srinivas G
By Srinivas
|
రంగారెడ్డి: తాండూరులో తెలంగాణ రణభేరికి వెళుతున్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులపై తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలు గుడ్లు, రాళ్లు విసిరారు. వికారాబాద్ నుండి వెళుతున్న పలువురు టిడిపి ఎమ్మెల్యేల కాన్వాయ్‌పై టిఆర్ఎస్ కార్యకర్తలు గుడ్లు, రాళ్లు విసిరారు. వారిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంతే ధాటిగా తిప్పికొట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టిడిపి కాన్వాయ్ అడ్డుకున్న టిఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు.
అంతకుముందు వర్షం కారణంగా టిడిపి రణభేరి ఉంటుందా లేదా అన్న ప్రశ్న కూడా ఉత్పన్నం అయింది. తాండూరులో భారీ వర్షం కురవడంతో రణభేరి రద్దవుతుందని భావించినప్పటికీ ఆ తర్వాత వర్షం తగ్గటంతో ఎమ్మెల్యేలు రణభేరికి ప్రయాణమయ్యారు. కాగా టిడిపి రణభేరిని అడ్డుకుంటామని టిఆర్ఎస్‌తో పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయ జెఏసి హెచ్చరించిన విషయం తెలిసిందే. తెలంగాణవాదుల హెచ్చరికల కారణంగా రణభేరి దారిలో భారీగా పోలీసులను మోహరించారు.