న్యూఢిల్లీ: తెలంగాణ సభ్యులు చేసిన రాజీనామాలపై లోకసభ స్పీకర్ మీరా కుమార్ ఆగస్టు 1వ తేదీ లోపు నిర్ణయం తీసుకోనున్నారు. పార్లమెంటు వర్షాకాలం సమావేశాల్లోగా తెలంగాణ లోకసభ సభ్యులు చేసిన రాజీనామాలపై నిర్ణయం తీసుకుంటానని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేయడం బాధాకరమని ఆమె అన్నారు. తనకు 13 మంది రాజీనామాలు అందాయని ఆమె చెప్పారు. కాంగ్రెసు ఎంపిలు 9 మంది, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు ఇద్దరేసి రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే.
పార్లమెంటు సభ్యుల రాజీనామా పరిశీలన ప్రక్రియ సాగుతోందని, పరిశీలన ప్రక్రియ పూర్తయిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని మీరా కుమార్ చెప్పారు. లోకసభ సభ్యులను ఒక్కొక్కరిని పిలిసి మాట్లాడిన తర్వాత రాజీనామాలను ఆమోదించాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు. ఒత్తిడితో రాజీనామాలు చేశారా, తమంత తామే రాజీనామాలు సమర్పించారా అనే విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుందని ఆమె అన్నారు.