హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగ సంఘాలు సమ్మె సైరన్ మోగించాయి. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. బుధవారం టిఎన్జీవో కార్యాలయంలో భేటీ అయిన ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. 1956వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు తెలంగాణ నష్టపోయిన వాటిని అన్నింటినీ పూర్తీ చేయాలనే డిమాండుతో ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగనున్నాయి. అయితే వచ్చే నెల 1వ తారీఖు లోపు ప్రభుత్వం నుండి ఏదైనా సానుకూల ప్రకటన వెలువడిన పక్షంలో సమ్మెను విరమించుకునేందుకు వారు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.
కాగా గ్రామీణ స్థాయి ఉద్యోగుల నుండి రాష్ట్రస్థాయి ఉద్యోగుల వరకు అన్ని ప్రభుత్వ కార్యకలాపాలను స్తంభింపజేస్తామని ఉద్యోగసంఘాలు చెబుతున్నాయి. వచ్చే నెల 1వ తేది లోపు ప్రభుత్వం నుండి అనుకూల ప్రకటన రాకపోతే సమ్మెకు వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నారు. అయితే అత్యవసర సర్వీసులు మినహా అన్ని ఉద్యోగ సంఘాలు సమ్మెలో పాల్గొంటాయని చెప్పారు.