హైదరాబాద్: భగవాన్ సత్యసాయి బాబా స్థాపించిన సత్య సాయి ట్రస్టు కార్యాలయాలలో భారీగా సంపద బయట పడుతున్న విషయం తెలిసిందే. బాబా నివసించిన యజుర్మందిరంలో గత నెల ట్రస్టు సభ్యుల ఆధ్వర్యంలో భారీగా నిధులు, వెండి, బంగారం బయటపడింది. లెక్కింపుకు ముందు, లెక్కింపు సమయంలో ట్రస్టు సభ్యుల సంపదను చాటుగా తరలించారనే తీవ్ర ఆరోపణలు రావడంతో అధికారులు ప్రభుత్వ అధికారులు యజుర్మందిరంలో మరోసారి సోదాలు చేశారు. అప్పుడు సైతం భారీగానే సంపద బయటపడింది. ఆ తర్వాత ట్రస్టు సభ్యులు బెంగుళూరులోని సత్యసాయి వేసవి విడిది వైట్ ఫీల్డులో చేసిన సోదాలలో వందల కిలోల కొద్ది బంగారం, వెండి, 80 లక్షలకు పైగా డబ్బు దొరకింది.
అయితే యజుర్వేద మందిరం, వైట్ ఫీల్డు తర్వాత అధికారులు హైదరాబాదులోని శివం మందిరంలో సోదాలు నిర్వహిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సత్యసాయి చాలా ఆలయాలు నిర్మించారు. అందులో చెన్నై, ముంబయి, హైదరాబాదులోని సత్యం, శివం, సుందరం ఆలయాలు. హైదరాబాదులోని శివంలో సైతం సంపద ఉందా అనే అధికారులు యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. యజుర్మందిరంలో భారీగా సంపద బయటపడటం, ఆ తర్వాత సత్యసాయి నిర్మించిన పలు ఆలయాల్లో నిధులు ఉండవచ్చన్న అనుమానాల నేపథ్యంలో ఇటీవల శివంలో దొంగలు సైతం పడ్డారు. అయితే వారికి వెండి పూజా సామాను మాత్రమే దొరికింది.