న్యూఢిల్లీ: ఎలక్ట్రానికి వోటింగ్ యంత్రాల వల్లనే (ఇవియంల వల్లనే) దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెసు పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో గెలిచిందని జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం స్వామి వ్యాఖ్యానించారు. కాంగ్రెసు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తుందని తాను భావించడం లేదని ఆయన అన్నారు. కాశ్మీర్‌ను పాకిస్తాన్‌కు ఇవ్వడానికైనా సిద్ధపడుతుంది గానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రాదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. బంద్‌లు, సమ్మెల వల్ల తెలంగాణ సమస్య పరిష్కారం కాదని ఆయన అన్నారు. తెలంగాణకు మొదటి నుంచి తన మద్దతు ఉందని ఆయన చెప్పారు. ఇవియంలు పెడితే తాను పోటీ చేయబోనని ఆయన చెప్పారు.
కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్యాన్ని ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారని ఆయన అడిగారు. రోటీన్ చెకప్ అయితే ఇక్కడ ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో ట్రయల్ కోర్టు తీర్పును సుప్రీంకోర్టులో తాను సవాల్ చేసినట్లు ఆనయ తెలిపారు. సుప్రీంకోర్టులో తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో ప్రస్తుత హోం మంత్రి పి. చిదంబరానికి ప్రత్యక్ష సంబంధం ఉందని ఆయన ఆరోపించారు. లోక్‌పాల్ బిల్లు ఒక్కటే అవినీతిని అంతం చేస్తుందని తాను అనుకోవడం లేదని ఆయన అన్నారు.