లక్నో: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీకి తమ సొంత నియోజకవర్గాల్లో షాక్ తగులే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోనియా ప్రాతినిథ్యం వహిస్తున్న రాయబరేలీలో కాంగ్రెసు పార్టీ ఐదు స్థానాల్లో వెనుకంజలో ఉంది. నాలుగింటిలో సమాజ్ వాదీ పార్టీ, ఒక స్థానంలో ఇతరులు ముందంజలో ఉన్నారు. ఇక రాహుల్ ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథీలోనూ కాంగ్రెసేతరులే ఆధిక్యంలో ఉన్నారు. మూడు స్థానాల్లో సమాజ్ వాది, ఒక స్థానంలో భారతీయ జనతా పార్టీ, మరో స్థానంలో కాంగ్రెసు పార్టీ ఆధిక్యంలో ఉంది. వారి సొంత నియోజకవర్గాలలోనూ రాహుల్, ప్రియాంక గాంధీ మానియా పని చేయలేదని అర్థమవుతోంది. రాహుల్ గాంధీ మొత్తం రాష్ట్రంలో 221 సభల్లో ప్రసంగించినా ఆయన ప్రభావం అంతగా పని చేయలేదని తెలుస్తోంది.
కాగా చర్ఖారీ నియోజకవర్గంలో బిజెపి నేత ఉమాభారతీ భారీ ఆధిక్యంలో ఉన్నారు. తూర్పు లక్నో నియోజకవర్గం నుండి బిజెపి నేత కల్‌రాజ్ మిశ్రా కూడా ఆధిక్యంలో ఉన్నారు. ఇక సమాజ్ వాది పార్టీ అధికారం దిశగా దూసుకు పోతోంది. కడపటి సమాచారం అందే సమయానికి ఉత్తర ప్రదేశ్‌లో ఎస్పీ 163, బిఎస్పీ 87 బిజెపి 57, కాంగ్రెసు 51 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు 13 స్థానాల్లో ఉన్నారు. కాగా 2007తో పోలిస్తే బిఎస్పీ గ్రాప్ దారుణంగా పడిపోగా, బిజెపి, కాంగ్రెసు కాస్త పంజుకున్నాయి.