గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి: టీటీడీ జాతీయ గో సమ్మేళనంలో బాబా రాందేవ్, స్వామిజీలు
తిరుపతి: గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ప్రముఖ యోగా గురువు, పతంజలి పీఠం వ్యవస్థాపకులు బాబా రాందేవ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ గో సమ్మేళనం ముగింపు సభలో ఆదివారం ఆయన ప్రసంగించారు.

గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలి: మోడీ, షాలకు బాబా రాందేవ్
టీటీడీ పాలకమండలి ప్రతిపాదించిన విధంగా గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా యథాతథంగా చట్టం చేయాలని కోరారు. దేశంలోని ముఖ్యమంత్రులందరూ టీటీడీ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడానికి సహకరించాలని ఆయన కోరారు. గో సంరక్షణకు పతంజలి పీఠం ఎప్పుడూ ముందుంటుందని ఆయన చెప్పారు. తిరుపతిలో నిర్వహించిన గో సమ్మేళనం చేసిన ఈ విజ్ఞప్తి వారిద్దరి చెవిలో చేరేలా గో ప్రేమికులు నినదించాలన్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి నిర్వహిస్తున్న హిందూ ధార్మిక కార్యక్రమాలను బాబా రాందేవ్ అభినందించారు. పాలక మండలి అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. టీటీడీ తలపెట్టిన గో సంరక్షణ యజ్ఞం అందరూ ముందుకు తీసుకు పోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు ఫోన్ చేసి గో సంరక్ష కార్యక్రమం గురించి తెలియ జేశారని రాందేవ్ బాబా వివరించారు.

టిటిడి గోసంరక్షణ ఉద్యమం విశ్వవ్యాప్తం కావాలి: కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సర్వస్వతి
గోమాత సంరక్షణ కోసం తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రారంభించిన ఉద్యమం విశ్వవ్యాప్తం కావాలని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సర్వస్వతి ఆకాంక్షించారు. శ్రీవారి సంకల్పంతో ధర్మకర్తల మండలి ప్రారంభించిన గోసంరక్షణ యజ్ఞం తప్పక విజయవంతమవుతుందని ఆశీర్వదించారు.
టిటిడి ఆధ్వర్యంలో తిరుపతి మహతి కళాక్షేత్రంలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ గో మహాసమ్మేళనం ముగింపు సభ ఆదివారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి అనుగ్రహ భాషణం చేశారు. టిటిడి ప్రారంభించిన గోసంరక్షణ ఉద్యమం సమాజ జాగృతికి దోహదపడుతుందని చెప్పారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిర్వహిస్తున్న ధార్మిక కార్యక్రమాలను నేపాల్‌లోని ఖాట్మండు వరకు వ్యాప్తి చేయాలన్నారు. ఇందుకు ఇదే తగిన సమయమని, గోసంరక్షణ ద్వారా హిందూ ధర్మ వ్యాప్తికి టిటిడి సత్య సంకల్పంతో మంచి నిర్ణయం తీసుకుందన్నారు. ఈ నిర్ణయం భారతీయుల విశ్వాసాల పరిరక్షణ, దేశ సంక్షేమానికి ఉపయోగపడుతుందని చెప్పారు. గోవును సంరక్షించి గోసేవ చేసినపుడే దేశం సుభిక్షంగా ఉంటుందని, రాజకీయాలకు, వ్యక్తిగత అభిప్రాయాలకు అతీతంగా దేశప్రజలంతా గోసంరక్షణ కోసం ఒకే తాటిమీదకు రావాలని శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సర్వస్వతి పిలుపునిచ్చారు. ప్రపంచ భవిష్యత్తు గోసంరక్షణ మీదే ఆధారపడి ఉందని, టిటిడి ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతమై ఆంధ్రప్రదేశ్‌కు తగిన గౌరవం దక్కాలని ఆయన చెప్పారు.
శృంగేరి శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖరభారతి స్వామి వీడియో సందేశం ద్వారా అనుగ్రహ భాషణం చేశారు. గోసంరక్షణతోనే హిందూ ధర్మ పరిరక్షణ జరుగుతుందని, ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. భారతదేశంలో అనేక సంప్రదాయాలు ఉన్నా, హిందూ ధర్మం గొప్పదని, సనాతన హిందూ ధర్మానికి హాని జరిగే పరిస్థితి ఏర్పడితే హిందువులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. గోమాతను జాతీయప్రాణిగా ప్రకటించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.
గో సేవే భగవంతుడి సేవ : గోరుషి స్వామి శ్రీదత్త శరనానందమహరాజ్
గోవులను సేవిస్తే భగవంతుని సేవించినట్టేనని, గోమాత వైశిష్ట్యాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు శ్రీవారి అనుగ్రహంతోనే తిరుపతిలో గోమహాసమ్మేళనం జరుగుతోందని రాజస్థాన్ పత్‌మేడకు చెందిన గోరుషి స్వామి శ్రీదత్త శరనానందమహరాజ్ పేర్కొన్నారు. రాజస్థాన్‌లో నిత్యం కరువు కాటకాల వల్ల గోపోషణ ఇబ్బందిగా ఉండేదని, ఇందుకోసమే తాము 3 లక్షల గోవులను రక్షించి గోశాల నిర్వహిస్తున్నామని చెప్పారు. అప్పటినుండి నిరంతరం గోసేవలో నిమగ్నమైనట్టు తెలిపారు. ఆవుతో పాటు దూడ కూడా పవిత్రమైందన్నారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరేందుకు దేశంలోని ప్రముఖ మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు కలవడం శుభసూచికమన్నారు. ఒడిశాలోనూ ప్రతి మూడు జిల్లాలకు ఒక గోసంరక్షణ సమితి, గోసేవా సంస్థ ఏర్పాటుచేసి గోసేవ జరుగుతోందని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు గోసేవకు నడుం బిగించాలన్నారు. అడవులు, వనాల తరహాలో గోసేవకు గోభూమి ఉండాలని, గోసంరక్షణ వేదరక్షణ అని అన్నారు. అందరూ మనసా వాచా కర్మణా గోసేవ చేయాలన్నారు.
ఉడిపి పెజావర్ మఠాధిపతి శ్రీ విశ్వప్రసన్నతీర్థ స్వామీజీ
ఉడిపి పెజావర్ మఠాధిపతి శ్రీ విశ్వప్రసన్నతీర్థ స్వామీజీ అనుగ్రహభాషణం చేశారు. భగవంతుని స్వరూపమైన గోవును రక్షించాలని, శ్రీవారిని ప్రపంచానికి చూపించింది గోవు అని చెప్పారు. తల్లి మూడు సంవత్సరాలు పాలు ఇస్తే గోవు బ్రతికినంత కాలం పాలు ఇస్తుందని చెప్పారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని, హిందూ సమాజంలో గో వధ, మత మార్పిడులను దేశం మొత్తం నిషేధించాలన్నారు.
ఏర్పేడు వ్యాసాశ్రమానికి చెందిన శ్రీ పరిపూర్ణానందగిరి స్వామి మాట్లాడుతూ గోసంరక్షణకు టిటిడి చేపట్టిన గోమహాసమ్మేళనం దేశానికి మార్గదర్శనం అవుతుందన్నారు. గోసంరక్షణ ప్రతి ఒక్క భారతీయుడి బాధ్యతని చెప్పారు.
అనంతరం రాజస్థాన్‌కు చెందిన శ్రీ రాధాకృష్ణజీ మహరాజ్ మాట్లాడుతూ గోపూజ ముక్కోటి దేవతల పూజతో సమానమని, గోమాత విశ్వానికే తల్లిలాంటిదని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ కమలానందభారతీ స్వామిజి ఉపన్యసిస్తూ టిటిడి చేపట్టిన గోసంరక్షణ కార్యక్రమాలను అభినందించారు. మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీ సలహాలు, సూచనలతో హిందూ ధర్మాన్ని మరింతగా వ్యాప్తి చేయాలని కోరారు.
ఇస్కాన్ సంస్థకు చెందిన శ్రీ శీలభక్తి రాఘవ స్వామి మాట్లాడుతూ గోసంరక్షణ వల్ల దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పారు. గోమాత విశ్వమాత అన్నారు.
అంతకుముందు యదుగిరి యతిరాజ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ యదుగిరి యతిరాజ నారాయణ రామానుజ జీయర్‌స్వామిజి, ఒడిశా శ్రీ పరమహంస ప్రజ్ఞానందజి మహరాజ్, ఉత్తరాఖండ్‌కు చెందిన శ్రీ గోపాలమణి నౌతియాల్, యుగ తులసి ఫౌండేషన్ ఛైర్మన్ మరియు టిటిడి బోర్డు మాజీ సభ్యులు శ్రీ శివకుమార్ ప్రసంగించారు.
అనంతరం పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలను టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి శాలువతో సన్మానించి శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు, డైరీ, క్యాలెండర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యులు, చంద్రగిరి శాసనసభ్యులు డా. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు. ఎస్వీ గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథరెడ్డి వందన సమర్పణ చేశారు.
Recommended Video

టిటిడి అవసరాలకు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులనే కొనుగోలు చేస్తాం: వైవి.సుబ్బారెడ్డి
టిటిడి అవసరాలకు ఉపయోగిస్తున్న బియ్యం, బెల్లం, పసుపు లాంటి ముడిసరుకులన్నీ రాబోయే రోజుల్లో ప్రకృతి వ్యవసాయంతో పండించిన రైతుల నుంచే కొనుగోలు చేస్తామని టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి వెల్లడించారు.
గోమాతను రక్షిస్తూ, సేవిస్తూ తద్వారా భూమాతను కాపాడితే ప్రపంచం సుభిక్షంగా ఉంటుందని, మానవాళి మొత్తం ఆరోగ్యంగా ఉంటారని సమాజానికి మరోసారి తెలియజెప్పడానికి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆదేశంతోనే ఆయన పాదాల చెంత ఉన్న మహతి ఆడిటోరియంలో ఈ రెండు రోజుల జాతీయ గోమహాసమ్మేళనం నిర్వహించినట్టు టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. గోసంరక్షణ కోసం టిటిడి రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనుందని, తెలుగు రాష్ట్రాల్లోని గోశాలలను శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలతో అనుసంధానం చేసి గోవుల పోషణకు అవసరమైన ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. గుడికో గోమాత కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మరింత ఉదృతంగా నిర్వహిస్తామని, ఇందుకు మఠాధిపతులు, పీఠాధిపతులు, వేదపాఠశాలల నిర్వాహకులు తమవంతు సహకారం అందించాలని అభ్యర్థించారు. టిటిడి ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ గోమహాసమ్మేళనం ఆదివారం ముగిసింది.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పేరొందిన సనాతన హిందూ ధర్మానికి మూలస్తంభాలైన అనేకమంది మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు హాజరై దివ్య అనుగ్రహభాషణం చేయడం మనందరి అదృష్టమని చెప్పారు. గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లేనని మనసా వాచా కర్మణ మనమందరం నమ్ముతున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినవారేనన్నారు. వారి తండ్రి దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి వ్యవసాయాన్ని, గోవులను ఎంతగా ప్రేమించేవారో అందరికీ తెలుసన్నారు. అందుకే ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రైతు సంక్షేమానికి, ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. రైతు బాగుంటే సమాజం బాగుంటుందని, రైతు సమాజానికి ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని నమ్మేవారిలో ముఖ్యమంత్రి కూడా ఒకరని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతి జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విభాగం ఏర్పాటు చేయించినట్టు చెప్పారు. గోపరిరక్షణకు, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి టిటిడి చేపట్టిన కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి అండగా నిలుస్తున్నారని ఛైర్మన్ వివరించారు.
రసాయనిక ఎరువులు, పురుగుమందులతో పండించిన ఉత్పత్తుల్లో పౌష్టిక విలువలు 60 నుండి 70 శాతం మేరకు, కొన్ని ఉత్పత్తుల్లో 100 శాతం కూడా తగ్గినట్టు పరిశోధనల్లో తేలిందన్నారు. ఈ ఉత్పత్తులు తినడం వల్ల చిన్నపిల్లల్లో మెదడుకు సంబంధించిన సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రసాయనిక ఎరువుల వ్యవసాయం వల్ల రాబోయే 20 ఏళ్లలో ఎదురయ్యే అతిపెద్ద ప్రకృతి, జీవవైవిధ్య విధ్వంసం మానవాళిని ఎలా నాశనం చేస్తుందనే విషయాలను ఐక్యరాజ్యసమితి హెచ్చరించిందన్నారు. ప్రకృతికి హాని చేయకుండా ప్రకృతితో మమేకమై చేసే వ్యవసాయంతోనే ఈ సమస్య నుంచి ప్రపంచం బయటపడుతుందన్నారు. ప్రకృతికి, ప్రపంచమానవాళికి చాపకింద నీరులా జరుగుతున్న ఈ ప్రమాదానికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంతోనే టిటిడి గోమహాసమ్మేళనం నిర్వహణకు పూనుకుందన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో జిల్లాల వారీగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం ఎపి రైతు సాధికారిక సంస్థతో ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందం చేసుకున్నామన్నారు. ఇందులో భాగంగా మొదటి దశగా వైఎస్ఆర్ కడప, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని రైతులతో రసాయన ఎరువులు ఉపయోగించకుండా కేవలం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో శనగ పంట సాగు చేయించి వారికి గిట్టుబాటు ధర కల్పించి టిటిడి సేకరిస్తుందని తెలిపారు. తమ ప్రయత్నానికి శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆశీస్సులు లభించి ప్రపంచం ఎదుర్కొంటున్న రసాయనిక అవశేషాల ఆహారం నుంచి బయటపడడానికి టిటిడి మార్గదర్శకంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ గోసంరక్షణతోపాటు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం దిశగా రైతాంగాన్ని సంసిద్ధం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
గోశాలల అభివృద్ధికి కార్యాచరణ : టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి
టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ కెఎస్. జవహర్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో 600కు పైగా ఉన్న గోశాలలను అభివృద్ధి చేయడానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నామని తెలియజేశారు. త్వరలో గోశాలల నిర్వాహకులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో 3 లక్షల ఎకరాల్లో రైతులు వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. టిటిడికి ఏటా అవసరమయ్యే 6 వేల టన్నుల బియ్యం, 7 వేల టన్నుల శనగపప్పు, 6 వేల టన్నుల ఆవునెయ్యి, ఇతర ముడిపదార్థాలు వీరి నుంచే కొనుగోలు చేస్తామన్నారు. ప్రకృతి వ్యవసాయంతో పండించిన ఉత్పత్తులతోనే ఇప్పటికే తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి నైవేద్యం సమర్పిస్తున్నామని తెలిపారు.
ప్రకృతిని పరిరక్షించడంలో భాగంగా తిరుమల అటవీ ప్రాంతంలోని 800 హెక్టార్లలో ఉన్న ఆస్ట్రేలియా తుమ్మ చెట్లను తొలగించే కార్యక్రమం ప్రారంభించామన్నారు. వీటి స్థానంలో రావి, మర్రి, నేరేడు, సంపంగి లాంటి స్వదేశీ మొక్కలు పెంచుతామన్నారు. రెండేళ్ల కాలంలో టిటిడి చేపట్టిన టిటిడి ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో అగరబత్తులు, దేవతామూర్తుల చిత్రపటాల తయారీ, శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సల ఆసుపత్రి, అంజనాద్రే ఆంజనేయుని జన్మస్థలం తదితర కార్యక్రమాలను వీడియో క్లిప్పింగుల ద్వారా వివరించారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగపడేందుకు పాలివ్వని ఆవులతోపాటు ఎద్దులను ఉచితంగా అందిస్తామన్నారు.
గో ఆధారిత వ్యవసాయమే ప్రపంచానికి దిక్కు : భూమన కరుణాకర్‌రెడ్డి
తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీవారి పాదాల చెంత నిర్వహించిన గోమహాసమ్మేళనం గోఆధారిత వ్యవసాయమే ప్రపంచానికి దిక్కు అని తీర్మానం చేసి ఐక్యరాజ్యసమితికి పంపాలని కోరారు. ప్రపంచీకరణ నుండి పుట్టిన వికృత శిశువైన రసాయ ఎరువుల వ్యవసాయం ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో టిటిడి తలపెట్టిన గో సంరక్షణ తలంపు కొత్త విప్లవానికి నాంది అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత 50 సంవత్సరాలుగా వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగం ఎక్కువైందని, దీనివల్లే ప్రపంచం ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని చెప్పారు. గోమాతకు జరుగుతున్న అపకారాన్ని గో ఆధారిత వ్యవసాయం ద్వారా ఎదుర్కొనేందుకు, హిందూ ధార్మికతను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లడానికి టిటిడి చేపట్టిన ఈ కార్యక్రమం ప్రపంచం మొత్తానికి అనుసరణీయమని, ఇది పాటించకపోతే మానవాళి మనుగడకే ముప్పు ఏర్పడుతుందని కరుణాకర్‌రెడ్డి చెప్పారు.
గోమాత విశిష్టతను తెలియజేస్తూ ప్రముఖ సినీ పాటల రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు రచించిన గీతాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆవిష్కరించారు. సినీ సంగీత దర్శకురాలు ఎం ఎం శ్రీలేఖ సంగీతం అందించగా, సినీ దర్శకులు శ్రీనివాస రెడ్డి ఈ గీతాన్ని రూపొందించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు పోకల అశోక్‌కుమార్, మారుతి ప్రసాద్, మొరంశెట్టి రాములు, మిలింద్ నర్వేకర్ , బోరా సౌరభ్ , యుగతులసి ఫౌండేషన్ అధ్యక్షులు శివకుమార్, జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మయ్య, సివిఎస్వో గోపినాథ్‌జెట్టి పాల్గొన్నారు.