• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇక దాగుడుమూతలకు చెక్ పెట్టేసినట్లేనా?: కేవీపీ పిటిషన్‌పై బాబేమంటారు.. కేంద్రం వైఖరేమిటి?

By Swetha Basvababu
|
  Polavaram Project : కేవీపీ పిటిషన్‌ : కేంద్రం, బాబు కు చెక్ !

  హైదరాబాద్: మూడున్నరేళ్లుగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న దాగుడుమూతలకు ఇకనైనా చెక్ పెడతారా? లేదా? తేలనున్నది. 2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీన మేషాలు లెక్కించాయి. తీరా మళ్లీ ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో ఒకరిపై మరొకరు పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. అందులో భాగంగానే ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి వరప్రదాయినిగా భావించే 'పోలవరం' ప్రాజెక్టుపై కాపర్ డ్యామ్‌ల నిర్మాణం పూర్తిచేసి.. ఆగమేఘాలపై ప్రజల సెంటిమెంట్‍ను తనకు అనుకూలంగా మార్చుకోవాలన్నది ఏపీ సీఎం చంద్రబాబు ఆరాటం. అందుకోసమే కేంద్రం ఆదేశాలు తోసి రాజని కాపర్ డ్యామ్‌ల నిర్మాణం తదితర పనుల కోసం కొత్తగా టెండర్లను ఆహ్వానించారు. దీనిపైనా కేంద్రం ఆగ్రహించింది. తమ అనుమతి లేకుండా ఎలా చేస్తారని నిలదీసింది. కేంద్ర క్యాబినెట్‌లో మార్పుల్లో భాగంగా పోలవరం బాధ్యత నితిన్ గడ్కరీకి అప్పగించారు ప్రధాని మోదీ.

  నితిన్ గడ్కరీ కూడా ఏపీ సర్కార్ ప్రతిపాదనలపై స్పందించి.. ప్రాజెక్టును పరిశీలించారు. ఈ క్రమంలో ఏపీ సర్కార్ కూడా ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగి రూ.53 వేల కోట్లకు చేరుతుందని కేంద్రానికి నివేదించింది. అదేమీ కుదరదని 2014లో నిర్దేశించిన మేరకే భరిస్తామని, మిగతా ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కేంద్రం మెలిక పెట్టింది. దీనిపై కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు.. జాతీయ ప్రాజెక్టుగా మొత్తం ఖర్చు కేంద్రమే భరించేలా ఆదేశాలు ఇవ్వాలని, రాష్ట్ర ఖజానాపై భారం పెట్టడానికి వీల్లేదని విభజన చట్టంలోని అంశాలను ఉదాహరిస్తూ రెండు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

   ఏపీ, పోలవరం అధికారులకూ ఇలా నోటీసులు

  ఏపీ, పోలవరం అధికారులకూ ఇలా నోటీసులు

  దీనిపై మంగళవారం విచారించిన రెండు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. 2014 ఏప్రిల్ ఒకటో తేదీ నాటి ప్రాజెక్టు వ్యయానికే మాత్రమే చెల్లింపులు చేస్తామన్న ప్రకటనపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికయ్యే మొత్తం వ్యయాన్ని తామే భరిస్తామంటూ ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీని అమలు చేసేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలంది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర నీటి వనరుల మంత్రిత్వశాఖ, కేంద్ర ఆర్ధిక శాఖ కార్యదర్శులను, పోలవరం ప్రాజెక్టు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది.

  పోలవరంపై తేలనున్న ఏపీ సర్కార్ వైఖరి

  పోలవరంపై తేలనున్న ఏపీ సర్కార్ వైఖరి

  కేవీపీ రామచంద్రరావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ తదుపరి విచారణను డిసెంబర్‌ 19వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా కేంద్ర ప్రభుత్వం తన ఆర్ధిక బాధ్యతను 2014 ఏప్రిల్ ఒకటో తేదీకి మాత్రమే పరిమితం చేయడం రాజ్యాంగానికి, ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్ట నిబంధనలకు, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని, ఇచ్చిన హామీ మేర మొత్తం వ్యయాన్ని భరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కేవీపీ రామచంద్రరావు హైకోర్టులో గత వారం పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీని ప్రకారం ప్రతివాదిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు అసలు ఆలోచనేమిటో బయట పడుతుంది.

   కేవీపీ పిల్ పై బాబు సర్కార్ వ్యూహమెలా?

  కేవీపీ పిల్ పై బాబు సర్కార్ వ్యూహమెలా?

  కేంద్రం నిధుల విడుదల చేయకున్నా.. అదనపు భారం భరించేందుకు సిద్ధమన్న సంకేతాలు పంపిన సీఎం చంద్రబాబు.. తన ద్వారా కాక, మరొకరి వల్ల పోలవరానికి, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగే మేలును సహిస్తారా? లేదా? మున్ముందు తేలనున్నది. పోలవరం విషయంలో ఇతరులు చేసిన పనిని సమర్థిస్తారా? లేదా? అన్న విషయం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించే అఫిడవిట్ తెలియజేస్తుందని, దీంతో ఏపీ సీఎం చంద్రబాబు వైఖరేమిటో బయటపడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అసలు కథేమిటంటే 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్ ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా పరిగణిస్తామని, దీని ఖర్చంతా తామే భరిస్తామని కేంద్రం పేర్కొన్నది. దాని ఆధారంగా ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపట్టాల్సిన బాధ్యత, పర్యవేక్షించాల్సిన బాధ్యత కేంద్రానిదే. కేంద్రంలో ఎన్డీయే సర్కార్‌లో టీడీపీ , రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వాములు. అప్పట్లో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహకారంతో ప్రాజెక్టు నిర్మాణమే కాదు అన్ని పనులూ సీఎం చంద్రబాబు ఇష్టానికే వదిలేసింది.

   ఇలా హోదాకు బదులు ప్యాకేజీకి పరిమితం

  ఇలా హోదాకు బదులు ప్యాకేజీకి పరిమితం

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్న జాతీయ ప్రాజెక్టు ‘పోలవరం'. కేంద్ర ప్రభుత్వంతో అవసరమైతే పోరాడి మరీ సాధించుకోవాల్సిన ప్రాజెక్టు ఇది. కానీ ప్రత్యేక హోదాపై పోరాటం మధ్యలోనే వదిలేసి.. ‘ప్రత్యేక ప్యాకేజీ'కి చంద్రబాబు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇన్ని రకాలుగా చంద్రబాబు ప్రేక్షకత్వాన్ని గుర్తించిన తర్వాత.. ఇక ఆయన తాము ఎన్ని రకాలుగా వంచించినా ఏమీ చేయలేరు- అని కేంద్రం నిర్ధారణకు వచ్చిందా? అన్న సందేహాలు కలుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అందుకే 1995 నుంచి 2004 వరకు అసలు ఆ ఊసే ఎత్తని చంద్రబాబు.. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలతో మనోభావాలు రగిల్చి.. తన కల అని నమ్మించి ఓట్లు పొందడానికి వెసులుబాటు కలిగించే పోలవరం విషయంలో కేంద్రం బ్రేకులేసింది. ఏకంగా పనులు ఆపమని ఆదేశాలు రావడం చిన్న సంగతి కాదు. కాఫర్‌ డ్యాం ఊసు అటకెక్కింది. కొత్త టెండర్లు అనేవి రాష్ట్ర ఖజానాకే భారంగా మారనున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టు విషయంలో అసలు సంగతి వదిలేసి అథారిటీ ఛైర్మన్‌ హోదాను మార్చండి అని పేర్కొంటూ లేఖలు రాసుకుంటూ కాలయాపన చేస్తూ వచ్చారు.

   నాటకీయ వ్యూహాలతో చంద్రబాబు గట్టెక్కగలరా?

  నాటకీయ వ్యూహాలతో చంద్రబాబు గట్టెక్కగలరా?

  ‘మూలిగే నక్కపై తాటిపండు లాగా.. అసలే అప్పుల్లో మునుగుతోంటే' జాతీయ ప్రాజెక్టును దారి తప్పించి మనం రాష్ట్రం తరఫున ఖర్చు భరించేద్దాం అంటూ చంద్రబాబునాయుడు.. ఏదో నాటకీయంగా చెప్పేస్తున్నారు. తన ఇన్నాళ్ల ప్రేక్షకపాత్ర వల్ల తన మీద కేంద్రానికి ఏర్పడిన చిన్నచూపు వల్ల పోలవరం విషయంలో కూడా వారు అన్యాయం చేయగలిగారనే సంగతి ప్రపంచం గుర్తించకుండా.. ఆయన 'మన డబ్బుల్తో చేసేసుకుందాం..' అనేమాట చెబుతున్నారు. అందుకు అవకాశం లభిస్తే.. కేంద్రం ఏమీ చేయకున్నా.. కష్టపడి చేశామని ప్రజల్లో పేరు కొట్టేయాలన్న దూరాలోచన అధికార టీడీపీ అధినేత ముందు ఉన్న వ్యూహమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అసలు అంతెందుకు? ఏపీ సీఎం - టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుది 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయానుభవం. దేశంలోనే సీనియర్‌ రాజకీయ నాయకుల్లో ఆయన ఒకరు. 67ఏళ్ల వయసులో అవిశ్రాంతంగా రోజుకు 18గంటలు కష్టపడుతూ ఉండే అపరిమితమైన ఫిట్‌నెస్‌ ఆయనది. అలుపూ సొలుపూ ఎరగని పని ఉంటుంది. వ్యూహం అమలు చేస్తారు. కానీ ప్రత్యేక హోదా విషయంలో మాదిరిగా పోలవరం ప్రాజెక్టు విషయమై స్పందించలేకపోవడానికి రహస్యమైన సమస్యలేమైనా ఉన్నాయా? అంటే అవి మున్ముందు గానీ బయట పడవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ అటువంటిదేదైనా ఉంటే పరిస్థితి మరింత విషమిస్తుందని చెప్తున్నారు.

   ప్రత్యేక హోదాపై నిమ్మకు నిరెత్తినట్లుగా చంద్రబాబు

  ప్రత్యేక హోదాపై నిమ్మకు నిరెత్తినట్లుగా చంద్రబాబు

  కనుక ప్రజల్లో విశ్వాసం కోల్పోకుండా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత కూడా చంద్రబాబుదే కనుక ఆ బాధ్యత నిర్వర్తిస్తారా? లేదా? మున్ముందు గానీ తేలదని చెప్తున్నారు. అసలు అనుకూల మీడియాతో ప్రజలను మభ్యపెట్టేందుకు.. విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడంలో ముందు ఉండే చంద్రబాబు 2014లో పార్లమెంట్ ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం అమలు అంశాలు పట్టించుకున్నారా? లేదా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ‘అనాథలా ఏర్పడిన రాష్ట్రాన్ని తల ఎత్తుకునేలా తీర్చిద్దాలంటే అభివృద్ధి చేయాలంటే.. అది నావల్ల మాత్రమే సాధ్యం అవుతుందని ప్రజలు నాకు అధికారం అప్పగించారు' అని ఏపీ చంద్రబాబునాయుడు కనీసం వెయ్యిసార్లకు పైగా చెప్పి ఉంటారు. ‘ప్రత్యేకహోదా కోసం పోరాటం జరుగుతోంటే.. ఆయన కదం కలపలేదు.అమరావతి నిర్మాణానికి నిధుల విడుదల విషయంలో వంచనకు నోరు మెదపలేదు' అన్న విమర్శలు ఉన్నాయి.

   ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్యాకేజీల ఊసే ఎత్తని బాబు

  ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్యాకేజీల ఊసే ఎత్తని బాబు

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యస్థీకరణ చట్టం అమలులో భాగంగా కనీసం ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీల అమలు కోసం ఒక్క అడుగైనా వేయలేదన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇక కడప ఉక్కు ఫ్యాక్టరీ తదితర అంశాలపై పోరాడే వారిని తన ప్రభుత్వ మనుగడ కోసం అణచివేయడానికే ప్రయత్నించారే తప్ప, వారిని విశ్వాసంలోకి తీసుకుని పోరాట బాట పట్టేందుకు ముందుకు రాలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇలా అన్ని విషయాల్లో ఆ ప్రేక్షక పాత్ర పోషించిన ఫలితమే. ఇవాళ పోలవరం విషయంలో కూడా కేంద్రం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం. ఇప్పట్లో ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తయ్యే అవకాశం లేకుండా.. బ్రేకులు వేయడం. ఈ పాపం ఎవరిది? కేంద్రం ముందుకు ఎందుకు సాగిలపడవలసి వచ్చిందనే విషయంలో చంద్రబాబు ఆంధ్రులకు వివరణ ఇచ్చుకోవాల్సిన రీతిలో ఆత్మరక్షణలో పడ్డారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

  English summary
  HYDERABAD: A division bench of the High Court on Tuesday issued notice to the Centre, asking it to respond to a PIL which questioned limiting its financial liability with regard to the Polavaram irrigation project to the extent of project cost as on April 1, 2014 despite it being declared as a national project.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more