
వచ్చే 6 నెలల్లో 75 కార్యక్రమాల్లో పాల్గొంటా: సిఎం చంద్రబాబు వెల్లడి
అమరావతి: రాబోయే 6 నెలల కాలంలో 75 కార్యక్రమాల్లో పాల్గోనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో అన్నారు. మంగళవారం టీడీపీ నేతలతో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు.
అలాగే వివిధ యూనివర్సిటీల్లో 13 జిల్లాల విద్యార్థులతో భేటీ అవుతానని...మరోవైపు సేవా మిత్రలు, సాధికార మిత్రలతో కూడా సమావేశమవుతానని చంద్రబాబు తెలిపారు. ప్రతి 45 రోజులకు పార్టీ నాయకులపై కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించడం జరుగుతుందన్నారు. కార్యకర్తలతో నేతలంతా సత్సంబంధాలు కలిగి ఉండాల్సిందేనని చంద్రబాబు ఈ సందర్భంగా హెచ్చరించారు.

అలాగే ఎన్నికల వరకు ధర్మపోరాట దీక్షలు కొనసాగుతాయని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎపిలో విభజన చట్టంలోని హామీలు అమలు కాకపోవడంపై టీడీపీ ఎంపీలు క్షేత్రస్థాయిలో ఉద్యమాలు నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. ఎంపీలు 15 రోజులకు ఒక కార్యక్రమం క్షేత్రస్థాయిలో నిర్వహించాలన్నారు. బహిరంగ సభలతో పాటు, ఢిల్లీలో ఆందోళనలు చేయాలని చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.
ఈ నెలాఖరులో ఢిల్లీలో ఎంపీలతో సభ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు.
సెంట్రల్ ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు వివరించాలని టీడీపీ నేతలతో అన్నారు. కడపలో స్టీల్‌ప్లాంట్, విశాఖలో రైల్వేజోన్, గోదావరి జిల్లాల్లో పెట్రో కాంప్లెక్స్, దుగరాజపట్నం పోర్టు అంశాలపై దీక్షలు నిర్వహించాలని చంద్రబాబు చెప్పారు. సాధికార మిత్రలతో, రైతు మిత్రలతో, విద్యార్థులతో ఓ సభ పెట్టాలన్నారు. కార్యకర్తలతో ఎక్కువగా మమేకం అయ్యేందుకు ప్రయత్నించాలని నేతలకు సూచించారు. 4 నెలల వ్యవధిలో గ్రామదర్శిని పేరుతో గ్రామాల్లో తిరగాలన్నారు.