జగన్‌తో మోడీ భేటీ: వెంకయ్య మాటల్లోని ఆంతర్యం ఇదీ...

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కదలికలే లక్ష్యంగా అధికార తెలుగుదేశం పార్టీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయాలు నెరుపుతున్నారు. విధాన నిర్ణయం, వ్యూహాల అమలులో అనుభవంగల నాయకుడిగా చంద్రబాబు నాయుడుకు ధీటుగా రాజకీయాలు చేయడంలో వెనుకబడుతున్న వైఎస్ జగన్.. ఇటీవల తన రాజకీయ భవిష్యత్‌ను పరిరక్షించుకునే దిశగా కీలక ముందడుగు వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు.

త్వరలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని జగన్ ప్రకటించడంతో అధికార తెలుగుదేశం పార్టీ నాయకత్వం గంగవెర్రులెత్తింది. ఒక నేరస్తుడితో ప్రధానమంత్రి మోదీ సమావేశం కావడమా? అని ఆక్షేపించింది. అధికార పార్టీగా తాను చేయాల్సిన పనిని విపక్ష నేత ఎందుకు చేయలేదని టీడీపీ నిలదీసింది.

వాస్తవంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఇతర పార్టీల మద్దతు కూడగట్టే పనిలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డితో ప్రధాని భేటీ అయ్యారని వార్తలొచ్చాయి. కానీ టీడీపీ నేతలకు ఈ విషయం తెలియకే జగన్మోహన రెడ్డికి మోదీ ఎందుకు అప్పాయింట్‌మెంట్ ఇచ్చారని విమర్శలకు పూనుకోవడం గమనార్హం.

మోదీతో జగన్ భేటీపై అభ్యంతరం దేనికన్న కేంద్ర మంత్రి

మోదీతో జగన్ భేటీపై అభ్యంతరం దేనికన్న కేంద్ర మంత్రి

జగన్మోహన రెడ్డికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతిస్పందిస్తే.. విపక్ష నేతకు దన్నుగా బీజేపీ నేతలు నిలిచారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డి సమావేశమైతే అభ్యంతరం దేనికని నిలదీశారు. రాజకీయంగా అపరిపక్వత గల వారే ప్రధాని మోదీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం కావడాన్ని విమర్శిస్తారని తన మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ నేతలను కాస్తా గట్టిగానే మందలిచారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తాము ఏ పార్టీ మద్దతైనా తీసుకుంటామని పేర్కొన్నారు.

దక్షిణాదిలో బీజేపీ విస్తరణపై వెంకయ్య ఇలా

దక్షిణాదిలో బీజేపీ విస్తరణపై వెంకయ్య ఇలా

భవిష్యత్‌లోనూ తెలుగుదేశం - బీజేపీ పొత్తు కొనసాగుతుందని, 2019 ఎన్నికల సమయంలో అప్పటి పరిస్థితులను బట్టి తమ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని వెంకయ్యనాయుడు వివరించారు. తమ పార్టీ దక్షిణ భారతదేశంలో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నదని భవిష్యత్ లక్ష్యాలను బయట పెట్టారు. తద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ బల పడాలన్నదే బీజేపీ నాయకత్వం యోచన అని అసలు సంగతి బయట పెట్టారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ 120 నియోజకవర్గాల పరిధిలో రెండో స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు.

విపక్షాలు కూటమి కడ్తాయంటూ వెంకయ్య వ్యంగ్యం

విపక్షాలు కూటమి కడ్తాయంటూ వెంకయ్య వ్యంగ్యం

ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ 2014 లోక్ సభ ఎన్నికలు మొదలు ప్రతి ఎన్నికల్లోనూ వరుసగా విజయాలు సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నదని, తమ ధాటికి తట్టుకోలేక విపక్షాలు కూటమి కడ్తామంటున్నాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు. గతంలో మిత్రపక్షం బీజేపీ విస్తరించొద్దని ఏ పార్టీ చెప్పదని కూడా టీడీపీని ఉద్దేశించి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు.

ప్రత్యేక హోదాకు - జగన్ భేటీకి టీడీపీ ఇలా లింక్

ప్రత్యేక హోదాకు - జగన్ భేటీకి టీడీపీ ఇలా లింక్

ఇటీవల ప్రధాని మోదీతో సమావేశమైన వెంటనే స్పందించిన ఆంధ్రప్రదేశ్ మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ విపక్ష నాయకుడు వైఎస్ జగన్.. ప్రధాని మోదీ కాళ్లు పట్టుకున్నారని దారుణమైన విమర్శలకు దిగారు. ప్రత్యేక హోదా తప్ప మిగతా అంశాలకు భేషరతుగా మద్దతునివ్వడం శోచనీయమని దేవినేని ఉమామహేశ్వర్ రావు వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతు ఇస్తామంటేనే విలువ ఉండేదని మరో మంత్రి అచ్చెన్నాయుడు సెలవిచ్చారు. కానీ ఇక్కడ ఒక్క విషయమై స్పష్టత కావాల్సి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని పోరాడాల్సిన బాధ్యత వాస్తవంగా అధికార తెలుగుదేశం పార్టీదేనన్న సంగతి ఆంధ్రప్రదేశ్ వాసులందరికీ తెలుసు. కానీ ఆ సంగతి విస్మరించి ప్రత్యేక హోదా అంశాన్ని అధికార టీడీపీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడంతోనే వారి ఆత్మరక్షణాధోరణి బయటపడుతున్నదని విమర్శలు వస్తున్నాయి.

అర్థంతరంగా బాబు అమెరికా పర్యటన రద్దు

అర్థంతరంగా బాబు అమెరికా పర్యటన రద్దు

ఆఖరుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రధాని నరేంద్రమోదీని వైఎస్ జగన్ ఎందుకు కలిశారని నిష్ఠూరాలాడారు. కానీ ప్రధాని మోదీతో వైఎస్ జగన్ భేటీ తర్వాత అమెరికా పర్యటన నుంచి ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు ఏడు గంటల పాటు మూడో కంటికి తెలియకుండా రహస్య మంతనాలు సాగించారని వార్తలొచ్చాయి. కానీ ఆయన ఆ సమయంలో ఎవరితో సమావేశం అయ్యారు? ఎందుకు రహస్యంగా సమావేశమయ్యారన్న విషయం మాత్రం తెలుగునాట చంద్రబాబుకు దన్నుగా నిలిచిన రెండు అతిపెద్ద దిన పత్రికలు మాత్రం బయటపెట్టవు. అది వారి హక్కుల పరిరక్షించే నేతను కాపాడుకోవాల్సిన బాధ్యత అని ఆ దినపత్రికల యాజమాన్యాలు భావిస్తుంటారని రాజకీయ విమర్శకులు భావిస్తుంటారు. వైఎస్ జగన్ భేటీ విషయమై అధికార తెలుగుదేశం - బీజేపీ పక్షాలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి.

ఆరు గంటలు బాబు ఎవరితో సమావేశమయ్యారో చెప్పాలన్న జోగు రమేశ్

ఆరు గంటలు బాబు ఎవరితో సమావేశమయ్యారో చెప్పాలన్న జోగు రమేశ్

ప్రధాని నరేంద్రమోదీతో వైఎస్ జగన్మోహనరెడ్డి భేటీ విషయమై రాష్ట్ర మంత్రుల విమర్శలకు దీటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ప్రధాని మోదీతో జగన్ భేటీ కావడంతో చంద్రబాబు నాయుడు తన అమెరికా పర్యటన అర్థంతరంగా రద్దుచేసుకుని ఆగమేఘాల మీద ఢిల్లీకి ఎందుకు పరుగెత్తుకు వచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జోగు రామన్న ప్రశ్నించారు. ఆరు గంటల పాటు ఎవరిని కలిసారని నిలదీశారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలిసారా? కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారా? కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును కలిసారా? చెప్పాలన్నారు. చంద్రబాబు గతంలో హోంమంత్రిగా ఉన్న చిదంబరంతో రహస్యంగా కలుసుకున్నదెందుకు? అని ప్రశ్నించారు. పచ్చ కామర్ల రోగికి లోకమంతా పచ్చగా అన్న చందంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు.

వైఎస్ జగన్‌కు పురందేశ్వరి మద్దతు ఇలా

వైఎస్ జగన్‌కు పురందేశ్వరి మద్దతు ఇలా

కేసులో నిందితుడిగా పేర్కొన్నంత మాత్రాన దోషి కాదని బీజేపీ సీనియర్ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వెనుకేసుకు వచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ ప్రధాని మోదీని ప్రశ్నించడానికి టీడీపీ మంత్రులు ఎవరని ప్రశ్నించారు. ప్రధాని మోదీని టీడీపీ మంత్రులు విమర్శిస్తూ ఉంటే స్థానిక బీజేపీ నాయకులు చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు. టీడీపీ నేతలతో మాట్లాడి ఏపీ విపక్ష నేతతో సమావేశం కావాలా? అని బీజేపీ నిలదీసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Union minister M Venkaiah Naidu hit out AP ministers objections on Modi - Jagan Meeting.
Please Wait while comments are loading...