విలన్లు జలసమాధి: ఈ శవం అనీల్ ది ? కాదు ఉదయ్ ది !
బెంగళూరు: మాస్తిగుడి కన్నడ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో తిప్పగుండనహళ్ళి జలాశయంలో గల్లంతు అయిన అనీల్, ఉదయ్ లలో ఒకరి భౌతికకాయాన్ని బయటకు తీశారు. బయటకు తీసిన మృతదేహం అనీల్ ది అని అధికారులు గుర్తించారు.
ఆ మృతదేహం అనీల్ ది కాదని ఉదయ్ ది అని మాస్తిగుడి సినిమా హీరో దునియా విజయ్ చెప్పడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. తిప్పగుండనహళ్ళి చెరువులో ఎన్ డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది గాలించి ఓ మృతదేహం బయటకు తీశారు.
ఆ మృతదేహం అనీల్ ది అని అధికారులు గుర్తించారు. అయితే అక్కడే ఉన్న హీరో విజయ్ మాత్రం
ఆ మృతదేహం ఉదయ్ ది అని వాదనకు దిగారు. రామనగర జిల్లా ఎస్పీ, బెంగళూరు నగర జిల్లాధికారి వి. శంకర్, అగ్నిమాపక శాఖ సీనియర్ అధికారి రేవణ్ణ ఈ మృతదేహం అనీల్ దే అని చెప్పడంతో గందరగోళం మొదలయ్యింది.

తిప్పగుండనహళ్ళి చెరువు సమీపంలోనే వీడియో చిత్రీకరణతో మృతదేహానికి వైద్య పరిక్షలు నిర్వహించిన తరువాత కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని జిల్లాధికారి శంకర్ చెప్పారు. ఇద్దరు ప్రతినాయకులు జలసమాధి కావడానికి కారణం అయ్యారని ఐదు మంది మాస్తిగుడి సినిమా యూనిట్ సభ్యుల మీద కేసులు నమోదు చేశారు.
ఇప్పటికే మాస్తిగుడి సినిమా నిర్మాత సుందర్ పి. గౌడను అరెస్టు చేసి రామనగర జిల్లా సెంట్రల్ జైలుకు తరలించారు. మిగిలిన నలుగురు మాయం కావడంతో పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. మాయం అయిన నలుగురు ముందస్తు జామీను తీసుకోవడానికి న్యాయస్థాన్ని ఆశ్రయించారు.
మరో పక్క మరో నటుడి మృతదేహం బయటకు తీయడానికి ఎన్ డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది చెరువులో గాలిస్తున్నారు. ఉదయ్ కుటుంబ సభ్యులు, అనీల్ కుటుంబ సభ్యులు ఆర్తనాదాలతో ఆ ప్రాంతం విషాదంలో మునిగిపోయింది.