కేంద్రం సంచలన నిర్ణయం- అమ్మాయికి వివాహం చేయాలంటే : అప్పటి దాకా ఆగాల్సిందే..!!
అమ్మాయిలకు వివాహం చేయాలంటే ఎప్పటి వరకు ఆగాలో నిర్దేశిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలో అబ్బాయిల కనీస వివాహ వయసు 21ఏళ్లు, అమ్మాయిల కనీస వివాహ వయసు 18ఏళ్లుగా ఉంది. అయితే, గత కొంతకాలంగా దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అబ్బాయిలు, అమ్మాయిల మధ్య ఈ అంతరం తొలగించాలని అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. అమ్మాయిల కనీస వివాహ వయసు తక్కువగా ఉండటం.. వారి కెరీర్‌కు అవరోధంగా మారుతోందనే వాదనలు ఉన్నాయి.
Recommended Video

అమ్మాయిల వివాహ వయసు పెంపు
అంతేగాక, దీని వల్ల చిన్న వయసులోనే గర్భం దాల్చడంతో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. అందుకే వివాహానికి అమ్మాయిల కనీస వయసు కూడా 21ఏళ్లకు పెంచాలని పలువురు కోరారు. మహిళల వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకు అవసరమైన చట్ట సవరణ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఎర్రకోట నుంచి ప్రధాని ప్రసంగంలో
గతేడాది ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ఈ విషయాన్ని మోదీ తొలిసారి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. పౌష్టికాహార లోపం నుంచి ఆడపిల్లలను రక్షించాలంటే వారికి సరైన సమయంలో పెళ్లి చేయాలని మోదీ సూచించారు. తాజాగా, యువతుల్లో ఆరోగ్య సమస్యలు, పోషకాహార లోపం నుంచి అమ్మాయిలను కాపాడాల్సిన అవసరం ఉందని గతేడాది స్వాత్రంత్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ తెలిపారు. ఇందుకోసం గతేడాది జూన్‌లోనే నీతి ఆయోగ్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.

టాస్క్ ఫోర్స్ అధ్యయనం..సిఫార్సుల ఆధారంగా
ఈ టాస్క్‌ఫోర్స్ దేశవ్యాప్తంగా సర్వేలు చేపట్టి అభిప్రాయాలు సేకరించింది. వాటన్నింటినీ పరిశీలించి ఇటీవల కొన్ని ప్రతిపాదనలు చేసింది. అమ్మాయిలు తొలి సారి గర్భం దాల్చేనాటికి వారి వయసు కనీసం 21ఏళ్లు ఉండాలని సూచించింది. అంతేగాక, అమ్మాయిలకు 21ఏళ్లకు వివాహం చేయడం అది ఆ కుటుంబంపై ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్య పరంగా సానుకూల ప్రభావం చూపుతుందని టాస్క్‌ఫోర్స్ పేర్కొంది. ఈ ప్రతిపాదనలకు తాజాగా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇందుకు అనుగుణంగా త్వరలోనే బాల్య వివాహాల నిరోధక చట్టం, ప్రత్యేక వివాహ చట్టం, హిందూ వివాహ చట్టాల్లో సవరణలు తీసుకురావాలని కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications