
మహా సంక్షోభం: బలపరీక్ష నిర్వహించండి, గవర్నర్‌ను కోరిన ఫడ్నవీస్, లేఖ అందజేత
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో పూటకో ట్విస్ట్ నెలకొంది. రెబల్స్‌ను దారిలోకి తీసుకొచ్చేందుకు శివసేన విశ్వ ప్రయత్నాలను చేస్తోంది. అయితే మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా యాక్టివ్ అయ్యారు. ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో సంప్రదింపులు జరిపారు. జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో కూడా భేటీ అయ్యారు. అయితే వచ్చాక గవర్నర్ భగత్ సింగ్ కొషియారీని కలిశారు.

తగిన బలం లేదు..
రాష్ట్రంలో శివసేన కూటమికి తగిన సంఖ్యాబలం లేదు. ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో పరిస్థితి మారిపోయింది. అందుకోసమే ఉద్దవ్ థాకరేను బల నిరూపణ చేయాలని ఫడ్నవీస్ కోరారు. ఈ మేరకు లేఖ అందజేశారు. శివసేన పార్టీకి చెందిన 39 మంది ఎమ్మెల్యేలు కూటమికి మద్దతు ఇవ్వడం లేదు. దీంతో ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని ఫడ్నవీస్ అంటున్నారు. వెంటనే సభను పిలిచి.. బలపరీక్ష జరపాలని కోరారు. ఫడ్నవీస్‌తో చంద్రకాంత్ పాటిల్, గిరిశ్ మహాజన్ సహా పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

15 మంది ఎమ్మెల్యేలు
ఇటు మరో 15 మంది ఎమ్మెల్యేలు తిరిగి సొంతగూటికి వస్తారని ఆ పార్టీ చెబుతుంది. కానీ ఇప్పటికీ గువహటిలోనే రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంతకుముందు రాజ్ థాకరేతో షిండే మాట్లాడారు. కానీ మద్దతు గురించి మాత్రం బయటకు విషయం రాలేదు.

రిజైన్.. అబ్బే కాదు
సోమవారం సాయంత్రం ఉద్దవ్ థాకరే తన నిర్ణయం వెలువరించారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. సాయంత్రం 5 గంటలకు రాజీనామా చేశారని తెలిపింది. కానీ శరద్ పవార్ నచ్చబెప్పారని వివరించారు. రెండుసార్లు రాజీనామా చేస్తానని చెప్పగా.. పవార్ ఒప్పించారని సమాచారం. పదవీకి రాజీనామా చేస్తానని గతవారం ఉద్దవ్ థాకరే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు కోరితే తప్పకుండా చేస్తానని.. చెప్పారు. అంతేకాదు శివసేన చీఫ్ పదవీ నుంచి కూడా వైదొలుగుతానని చెప్పారు. శివ సైనికులు ఆ మాట చెప్పాలని కోరారు. తన వద్దకు వచ్చి చెప్పాలని కోరారు.