"ఫోన్ గోడకేసి కొడితే డిజిటల్ అరెస్టు ఆగిపోతుందిగా..!" సీజేఐ సలహా-బ్యాంకులదే బాధ్యత..!
దేశవ్యాప్తంగా అంతకంతకూ డిజిటల్ అరెస్టు (Digital Arrest ) పేరుతో పెరిగిపోతున్న మోసాలపై ఇవాళ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మొబైల్ ఫోన్ల ద్వారా అరెస్టు చేస్తామన్న బెదిరింపుల్ని ప్రజలు ఎలా నమ్ముతున్నారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫోన్ ను గోడకేసి కొడితే డిజిటల్ అరెస్టు ఆగిపోతుంది కదా అంటూ సీజేఐ సూర్యకాంత్ ఓ సలహా కూడా ఇచ్చారు. ఫైనల్ గా ఇలాంటి మోసాల్ని అరికట్టేందుకు బ్యాంకుల్ని బాధ్యుల్ని చేయడంతో పాటు బాధితులకు పరిహారం అందించడం వంటి అంశాలపై దృష్టిసారించబోతున్నట్లు తెలిపారు.
దేశంలో డిజిటల్ అరెస్టు పేరుతో జరుగుతున్న మోసాలపై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈ సందర్భంగా తాజాగా డిజిటల్ అరెస్టు పేరుతో 2.5 కోట్లు మోసపోయిన మహిళ ఘటనను అమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ న్యాయవాది ఎన్ఎస్ నప్పినై ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం, వివిధ సంస్థలు అవగాహన కల్పిస్తున్నా ఇలాంటి మోసాలు కొనసాగుతున్నట్లు ఆమె కకోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన సీజేఐ.. డిజిటల్ అరెస్టులపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నా.. చదువుకున్న వ్యక్తులు కూడా మోసగాళ్ల బారిన పడుతుండటంపై సీజేఐ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

నకిలీ కోర్టు ఉత్తర్వులు చూపించి ఇలా భయపెట్టినప్పుడు, సంబంధిత కోర్టు అధికారిక వెబ్ సైట్లలోకి వెళ్లి నిజానిజాలు పరిశీలించవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. అలాగే సైబర్ మోసాల్ని అరికట్టడంలో బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీజేఐ సూచించారు. ఒక ఖాతాదారుడి గత లావాదేవీలకు భిన్నంగా భారీ మొత్తంలో అనుమానాస్పద లావాదేవీ జరిగినప్పుడు, దాన్ని వెంటనే గుర్తించి తాత్కాలికంగా నిలిపేసే వ్యవస్థ ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. అలాంటి లావాదేవీలపై సంబంధిత పోలీసు స్టేషన్ కు సమాచారం ఇచ్చి, నిజానిజాలు ధృవీకరించాకక అనుమతించే విధానం ఉండాలని సూచించారు. నేరం జరిగాక నివేదికలు సమర్పించడం కంటే నేరం జరగకముందే జాగ్రత్తలు అవసరమన్నారు. డిజిటల్ అరెస్టుల్లో బ్యాంకుల నిర్లక్ష్యం తేలితే బాధితులకు పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇచ్చే అంశం పరిశీలిస్తున్నట్లు తెలిపారు.














Click it and Unblock the Notifications
