ఐఎస్ఐఎస్ కు ప్రచారం: కెమికల్ ఇంజనీరు అరెస్టు
మంగళూరు: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థకు మద్దతుగా ప్రచారం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ యువకుడిని కర్ణాటకలోని మంగళూరులో ఏటీఎస్ అధికారులు అరెస్టు చేశారు. ఇతను యువకులను రెచ్చగొట్టి ఉగ్రవాద సంస్థలో చేరాలని ఒత్తిడి చేస్తున్నాడని పోలీసులు అన్నారు.
మంగళూరులోని బజ్పే విమానాశ్రయం సమీపంలోని పెర్మదాలో నివాసం ఉంటున్న నజముల్ హూడా (25) అనే యువకుడిని అరెస్టు చేశామని శుక్రవారం ఏటీఎస్ అధికారులు తెలిపారు. నజముల్ హూడా ఐఎస్ఐఎస్ కు ప్రచారం చేస్తున్నాడని ఏటీఎస్ అధికారులకు సమాచారం అందింది.
శుక్రవారం వేకువ జామున 2 గంటల సమయంలో అతని ఇంటి మీద దాడి చేసి నజముల్ హూడాను అరెస్టు చేశామని అధికారులు తెలిపారు. మంగళూరులో డిప్లొమా పూర్తి చేసిన నజముల్ హూడా బెంగళూరులో కెమికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు.

ఇతను ఐఎస్ఐఎస్ కార్యకలాపాలకు ఆకర్షితుడైనాడు. తరువాత తెలిసిన యువకులకు మాయమాటలు చెప్పి ఐఎస్ఐఎస్ లో చేరి యుద్ధం చెయ్యాలని రెచ్చగొడుతున్నాడని పోలీసు అధికారులు అంటున్నారు.
ముంబై, చెన్నై నుంచి 50 మంది ఏటీఎస్ అధికారులు మంగళూరు చేరుకున్నారు. తరువాత స్థానిక పోలీసుల సహకారంతో రహస్యంగా అతని మీద నిఘా వేసి అరెస్టు చేశారు. నజముల్ హూడా ను ముంబై తీసుకు వెళ్లారు.
గత 12 సంవత్సరాల నుంచి నజముల్ హూడా కుటుంబ సభ్యులు మంగళూరులోని బజ్పే విమానాశ్రయం సమీపంలో నివాసం ఉంటున్నారు. ఇటీవల నజముల్ హూడా విదేశాలలో పర్యటించి వచ్చాడని ఏటీఎస్ అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications