
కశ్మీర్‌లో భయాందోళనల్లో హిందువులు.. శాంతి, భద్రతలపై ప్రభుత్వానివి ఉత్తి మాటలేనా?

సిద్ధార్థ బింద్రూ తన తండ్రి మఖన్‌లాల్ బింద్రూ కోసం చికెన్ షవర్మా తీసుకురావడానికి రెస్టారెంట్‌కు వెళుతుండగా ఓ ఫోన్ కాల్ వచ్చింది.
"నాన్న ఇంక లేరు" అని ఫోన్ చేసిన వ్యక్తి చెప్పారు. ఆ వార్త వినగానే 40 ఏళ్ల సిద్ధార్థ దిగ్భ్రాంతి చెందారు.
కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌కు చెందిన సిద్ధార్థ అక్కడే ఎండోక్రినాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఆయన తండ్రి మఖన్‌లాల్ బింద్రూ ఓ కెమిస్ట్.
అక్టోబర్ 5 సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు బింద్రూ నడుపుతున్న మందుల దుకాణంలోనికి ప్రవేశించి మూడు సార్లు కాల్పులు జరిపారు.
తరువాత వారు చీకటిలోకి అదృశ్యమైపోయారని అక్కడ పనిచేస్తున్న సేల్స్‌పర్సన్ చెప్పారు.
"ఒక గుండు ఆయన ఛాతికి తగిలింది. మరొకటి భుజానికి, ఇంకొకటి గొంతులోకి దిగాయి" అని తీవ్ర దుఃఖంలో ఉన్న సిద్ధార్థ చెప్పారు.
డాక్టర్ సిద్ధార్థ అదే పాలిక్లినిక్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆరోజు ఆయనకు సెలవు.
"మధ్యాహ్నం నాన్న నాకు ఫోన్ చేశారు. చికెన్ షవర్మా తీసుకు రమ్మని చెప్పారు. అది ఆయనకు చాలా ఇష్టమైన వంటకం. సాయంత్రం కచ్చితంగా కొని తీసుకెళ్లాలనుకున్నాను. కానీ, ఆయన కోరిక తీర్చలేకపోయాను" అంటూ సిద్ధార్థ కన్నీళ్లు పెట్టుకున్నారు.
- కశ్మీర్‌లో హిందువుల హత్యలు: 'ఆడవాళ్లను చంపడం కాదు, ఇండియన్ ఆర్మీతో పోరాడండి’
- హిందువులు, సిక్కుల వరుస హత్యలతో వణుకుతున్న కశ్మీర్, పారిపోతున్న మైనార్టీ కుటుంబాలు

మఖన్‌లాల్ బింద్రూ ఎవరు?
కశ్మీర్‌కు చెందిన ప్రముఖ వైద్యుడు, ఫార్మాసిస్ట్ రాకేశ్వర్ నాథ్ బింద్రూ కుమారుడే మఖన్‌లాల్ బింద్రూ.
ఆర్ఎన్ బింద్రూ కశ్మీర్ అంతటా, ముఖ్యంగా శ్రీనగర్‌లో భారీ స్థాయిలో ఫార్మసీ వ్యాపారాన్ని ప్రారంభించారు.
'బింద్రూ మెడికేట్' పేరుగల ఈ ఫార్మసీలో అత్యవసర ఔషధాలతో పాటూ అరుదైన మందులూ లభించేవి.
1983లో తన తండ్రి మరణం తరువాత ఎంఎల్ బింద్రూ వ్యాపార బాధ్యతలు స్వీకరించారు. దీన్ని నడపడంలో ఆయన భార్య కూడా సహాయపడేవారు.
"మా అమ్మ దుకాణంలో బిల్లులు రాసిచ్చేవారు. అవసరమైన మందులు కొనుగోలు చేయడంతో పాటు, కస్టమర్లకు కావలసిన మందులు తీసిచ్చేవారు. అమ్మ ఎందుకు దుకాణంలో పనిచేస్తున్నారని మా నాన్నను అడిగాను. 'నాకేమైనా అయితే పిల్లలు ఇబ్బంది పడకూడదు, అందుకే' అని ఆయన చెప్పారు. ఎప్పుడూ అదే మాట అంటుండేవారు.. 'నేను లేకపోయినా మీ జీవితం ఇలాగే కొనసాగాలి' అని."
1990ల నాటి హింసాత్మక ఘటనల తరువాత వేలమంది కశ్మీరీ పండిట్లు కశ్మీర్ లోయ విడిచి దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు.
కానీ, కొద్దిమంది హిందువులు స్వస్థలంలోనే ఉండిపోయారు. అలా ఉండిపోయిన 800లకు పైగా కుటుంబాల్లో బింద్రూ కుటుంబం ఒకటి.
గతవారం కశ్మీర్‌లో ఒకే రోజు ముగ్గురు హత్యకు గురయ్యారు. వారిలో ఎంఎల్ బింద్రూ ఒకరు కాగా మిగులినవారు బిహార్‌కు చెందిన స్ట్రీట్ వెండర్ (వీధుల్లో సరుకులు అమ్ముకునే వ్యక్తి), కశ్మీరీ ముస్లిం క్యాబ్ డ్రైవర్.
అంతకుముందు ఇద్దరు కశ్మీరీ ముస్లింలను కూడా ఇలాగే చంపేశారు.
సుపీందర్ కౌర్, దీపక్ చంద్‌ల హత్య
ఎంఎల్ బింద్రూ హత్య జరిగిన రెండు రోజుల తరువాత నగరంలో మరో రెండు హత్యలు చోటుచేసుకున్నాయి.
సంగం ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలోకి చొరబడిన దుండగులు ప్రధానోపాధ్యాయురాలు సుపీందర్ కౌర్‌ను, మరో ఉపాధ్యాయుడు దీపక్ చంద్‌ను కాల్చి చంపారు.
44 ఏళ్ల సుపీందర్ కౌర్ కశ్మీరీ సిక్కు మహిళ. ఆమెకు 8, 12 ఏళ్ల పిల్లలు ఉన్నారు. శ్రీనగర్‌లోని అలుచా బాగ్‌లో నివసిస్తారు.
దీపక్ చంద్ జమ్మూ నివాసి.
సుపీందర్ కౌర్ మరణంతో షాక్‌కు గురైన ఆమె భర్త రామ్‌రేష్‌పాల్ సింగ్ రెండు రోజుల వరకు ఏమీ మాట్లాడలేకపోయారు.
"వారిని ఎలా చంపారని కూడా నేను అడగలేదు. కట్టుకున్న భార్యే చనిపోయాక, అన్నీ నిష్ప్రయోజనంగానే తోచాయి" అని ఆయన అన్నారు.
తన 35 సంవత్సరాల సర్వీసులో సుపీందర్ కౌర్ లాంటి దయగల వ్యక్తిని చూడలేదని ఆ స్కూలు స్పోర్ట్స్ కోచ్ అబ్దుల్ రెహ్మాన్ అన్నారు.
"వాష్‌రూమ్‌లు మరమ్మత్తు చేయించడానికి సొంత డబ్బు ఖర్చు పెట్టారు. ఫార్మాలిటీస్ పూర్తయేసరికి చాలా సమయం పడుతుందని, చేతిలో ఉన్న డబ్బుతో బాగు చేయించారు" అని ఆయన చెప్పారు.
పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, ముగ్గురు సాయుధులు పాఠశాల ఆవరణలోకి ప్రవేశించి, సిబ్బందిని తనిఖీ చేశారు. వారి గుర్తింపు అడిగారు.
సుపీందర్ కౌర్, దీపక్ చంద్‌లను పక్కకు తీసుకెళ్లి కాల్చి చంపారని, వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని పోలీసుల ప్రాథమిక నివేదిక తెలిపింది.
సుపీందర్ కౌర్ పిల్లలిద్దరూ షాక్‌లో ఉన్నారు.
"సుపీందర్ నాకు సోదరితో సమానం. ఆమె ఎంతో మంచి వ్యక్తి. ఒక అనాథ ముస్లిం పిల్లను ఆమె దత్తత తీసుకున్నారు. తన జీతంలో కొంత భాగాన్ని ఆ పాప పోషణకు వెచ్చిస్తారు. ఎంతమంది అనాథలు తమ గాడ్‌మదర్‌ను కోల్పోయారో చెప్పలేను" అని పక్కింటి మజీద్ చెప్పారు.
- కశ్మీర్: వారం రోజుల్లో ఏడుగురు మైనారిటీలను కాల్చి చంపారు... జమ్మూలో నిరసన ప్రదర్శనలు
- కశ్మీరీ పండిట్ హత్య: 'జీవితాంతం కశ్మీర్‌కి సేవ చేసిన వ్యక్తిని చంపేసి, ఇది కశ్మీర్ కోసం అంటే ఎలా?’
పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని ప్రభుత్వం చెప్పినవి ఉత్తమాటలేనా?
అక్టోబర్ నెల ప్రారంభంలోనే ఏడుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. దీంతో, కశ్మీర్‌లో శాంతి, భద్రతలు నెలకొన్నాయంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలు ప్రశ్నార్థకంగా మారాయి.
"కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను" వివరించేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి చెందిన 70 మందికి పైగా మంత్రులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.
అదే సమయంలో ఈ వరుస హత్యలు జరిగాయి.
2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు చేశాక వేలాదిమందిని అరెస్ట్ చేశారు. కమ్యూనికేషన్ మాధ్యమాలను నిలిపివేశారు. కొన్ని నెలలుగా సాగిన ఉద్రిక్తతల అనంతరం అక్కడ తిరిగి శాంతిభద్రతలు నెలకొన్నాయని ప్రభుత్వం చెబుతోంది.
ప్రస్తుత హత్యలను పలువురు రాజకీయ నాయకులు ఖండించారు. వీటిని 1990ల నాటి హింసాత్మక ఘటనలతో చాలా మంది పోల్చి చూస్తున్నారు.
"రాష్ట్రం సాధారణ స్థితికి వచ్చిందని, శాంతిభద్రతలు నెలకొన్నాయని ప్రభుత్వం చేస్తున్న అబద్ధపు ప్రచారాలను బహిర్గతం చేసే సంఘటనలివి" అంటూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించారు.
గత రెండు దశాబ్దాలలో మైనారిటీలను లక్ష్యంగా చేసుకున్న సంఘటనలు ఇవే..
గత పద్దెనిమిది సంవత్సరాలలో కశ్మీరీ పండిట్లు లేదా సిక్కులపై జరిగిన దాడి ఇదే.
అంతకుముందు 2000 మార్చిలో అనంతనాగ్ జిల్లాలోని చిట్టిసింగ్ పుర గ్రామంలో 35 మందికి పైగా సిక్కులను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు.
ఆ తరువాత 2003లో పుల్వామాలోని మారుమూల గ్రామమైన నదీమార్గ్‌లో 20 మందికి పైగా కశ్మీరీ పండిట్లు హత్యకు గురయ్యారు.
అయితే, కశ్మీర్‌లో మతపరమైన ఉద్రిక్తతలు లేవని కశ్మీర్ పోలీస్ చీఫ్ విజయ్ కుమార్ స్పష్టం చేశారు.
గత వారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. ఈ ఏడాది తీవ్రవాదులు జరిపిన దాడుల్లో ఎక్కువ మంది ముస్లింలే బలయ్యారని చెప్పారు.
"2021లో తీవ్రవాదుల దాడుల్లో 28 మంది పౌరులు మరణించారు. వీరిలో కేవలం అయిదుగురు మాత్రమే స్థానిక హిందువులు, సిక్కులు. ఇద్దరు వలస కూలీలు."
ప్రస్తుత హత్యలు మతసామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నమేనని జమ్ము, కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ అన్నారు.

హిందువులు, సిక్కులు భయాందోళనలకు గురవుతున్నారు
ఎలాంటి పరిస్థితుల్లోనైనా కశ్మీర్ విడిచి వెళ్లని పండిట్లను, గత దశాబ్దంలో స్వస్థలానికి తిరిగి వచ్చినవారిని ఎంఎల్ బింద్రూ హత్య భయబ్రాంతులకు గురి చేసింది.
ఈ హత్యలకు పాల్పడ్డవారిని పట్టుకోవడానికి భారీ స్థాయిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు.
వందలాది మాజీ తీవ్రవాదులను, బెయిల్‌పై విడుదలైన ఆందోళనకారులను మళ్లీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
కశ్మీర్‌లో నివసిస్తున్న 5,000 మందికి పైగా కశ్మీరీ పండితులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థ హెడ్ సంజయ్ టిక్కూ బీబీసీతో మాట్లాడారు.
"ప్రస్తుత పరిస్థితి 1990లను తలపిస్తోంది. అప్పుడు నేనెంత భయపడ్దానో ఇప్పుడు కూడా అంతే భయపడుతున్నాను. గత కొద్ది రోజుల్లో ఎన్నో కశ్మీరీ పండిట్ కుటుంబాలు లోయను విడిచి వెళ్లిపోయాయి. మరెన్నో కుటుంబాలు ఇక్కడి నుంచి తరలిపోయేందుకు సిద్ధమవుతున్నాయి. పండిట్ కుటుంబాల నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. వారంతా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులు నన్ను మా ఇంటి నుంచి తీసుకెళ్లి ఓ హోటల్ గదిలో బంధించి ఉంచారు. ఇలాంటి పరిస్థితుల్లో మేం ఇక్కడ ఎలా జీవనం కొనసాగిస్తాం?" అంటూ సంజయ్ టిక్కూ వాపోయారు.
బింద్రూ ఇంటి దగ్గర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కొంతమంది పండిట్ నాయకులను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లారు.
కాగా, పండిట్, సిక్కు కుటుంబాల్లో తీవ్ర అభద్రతా భావం నెలకొంది.
ప్రభుత్వ ప్యాకేజీ కింద గత కొన్నేళ్లల్లో అనేకమంది కశ్మీరీ పండిట్లు స్వస్థలానికి తిరిగి వచ్చారు. వారందరిలో ఓ వింత మౌనం ఆవరించింది.
కశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో 300 ఫ్లాట్లలో సుమారు 1000 మంది కశ్మీరీ పండిట్లు నివసిస్తున్నారు.
"చాలా కుటుంబాలు ఊరు విడిచి వెళ్లిపోయాయి. మాకు చాలా భయగా ఉంది. ప్రభుత్వ అధికారులు ఇక్కడకు వస్తున్నారు. అనుకోని సంఘటన ఎదురైతే, వెంటనే వచ్చి సహాయం చేస్తామని హామీ ఇస్తున్నారు. కానీ పాఠశాల ఉపాధ్యాయుల హత్య తరువాత భయం ఇళ్ల నుంచి కార్యాలయాలకు పాకింది. అన్ని పాఠశాలలు, కార్యాలయాలకు ప్రభుత్వం భద్రత కల్పించగలదా?" అంటూ ఆ ఫ్లాట్లలో నివసిస్తున్న ఓ వ్యక్తి ప్రశ్నించారు.
- కశ్మీర్ అంశంపై టర్కీ వైఖరి మారిందా
- 'కశ్మీర్‌కు స్వతంత్రం వద్దు.. పాకిస్తాన్లో కలవాలి’ అని గిలానీ ఎందుకు కోరుకున్నారు?

సాధారణ ప్రజల జీవితాలపై ప్రభావం
కాగా, సిక్కు నాయకులు మాత్రం కశ్మీర్ విడిచి వెళ్లేదే లేదని స్పష్టం చేశారు.
అయితే, ప్రభుత్వం వారికి పూర్తి భద్రత కల్పించేవరకు విధులకు హాజరు కాకూడదని సిక్కులకు విజ్ఞప్తి చేశారు.
భయం, అనిశ్చితి కశ్మీర్‌లో సాధారణ ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
నగర వీధుల్లో భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. వాహనాల్లో, నడిచి వెళుతున్నవారిని కూడా ఆపి తనిఖీలు చేస్తున్నారు. నిరంతరం మోగుతున్న సైరన్లు మరింత కంగారు పెడుతున్నాయి.
1991లో జరిగిన ఓ హింసాత్మక ఘటనలో మహమ్మద్ అస్లమ్ తన సోదరుడిని కోల్పోయారు.
"1990లలో జరిగిన సంఘటనలు, పండిట్లు వలస వెళ్లిపోవడం చాలా పెద్ద విషాదం. ఆ తరువాత, ఇప్పుడు జరుగుతున్నది మరో విషాదం. మొత్తం జనాభా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆ చీకటి రోజులను గుర్తు తెచ్చుకోవడమంటేనే నాకు భయం. అది మళ్లీ జరగకూడదు" అని అస్లమ్ అన్నారు.
'మేమెక్కడికీ వెళ్లం'.. బింద్రూ కుటుంబం
ఏది ఏమైనా కశ్మీర్ విడిచిపెట్టి వెళ్లేది లేదని బింద్రూ కుటుంబం తేల్చి చెప్పింది.
"మఖన్‌లాల్ ఎలాంటి దుర్భర పరిస్థితినైనా ఎదిరించి నిలబడ్డారు. ఎందుకంటే, ఇక్కడే నివసించాలన్నది ఆయన కోరిక. మేం కశ్మీరీలం. మా శరీరంలో కూడా బింద్రూ రక్తమే ప్రవహిస్తోంది" అని ఎంఎల్ బింద్రూ కుమార్తె శ్రద్ధా బింద్రూ చెప్పారు.
"మా నాన్న అంత్యక్రియలప్పుడు నా ఇద్దరు బిడ్డలూ పక్కనే ఉండాలని కోరుకున్నాను. అంత్యక్రియలకు హిందువుల కన్నా ముస్లింలే ఎక్కువమంది హాజరయ్యారు. మా నాన్నకు ఉన్న సామాజిక సంబంధాల విలువను నా బిడ్డలు తెలుసుకోవాలని కోరుకున్నారు. మైనారిటీలను చంపడం అంటే కేవలం హత్య కాదు. అది మతసామరస్యాన్ని దెబ్బ తీసే ప్రయత్నం. నేను నా స్వస్థలాన్ని విడిచి వెళ్లడానికి నాకే కారణం కనిపించట్లేదు. వీళ్లంతా నావాళ్లు. వీరిని విడిచి నేను వెళ్లలేను.
మా ఇంటికి వచ్చేవారిలో 90 శాతం ముస్లింలే. ఆ స్నేహమంతా నా తండ్రి నాకు అందించిన వారసత్వ సంపద. 1990లలో ఉద్రిక్తతలు నెలకొన్నప్పుడు కూడా నా ముస్లిం స్నేహితులు మా ఇంటికి వచ్చి చాయ్ తాగి వెళ్లేవారు. గత 25 సంవత్సరాలుగా మా అమ్మ ప్రతీ సంవత్సరం ఒక ముస్లిం వ్యక్తికి రాఖీ కడుతున్నారు. నేనెందుకు ఈ నగరం విడిచి వెళ్లిపోవాలి? అందుకు ఏమైనా కారణం ఉందా?" అని డాక్టర్ సిద్ధార్థ బింద్రూ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్ ముస్లింల కోసం గళం వినిపిస్తాం: తాలిబాన్
- 1971 యుద్ధంలో పాకిస్తాన్ నుంచి భారత్ స్వాధీనం చేసుకున్న అందమైన ఊరు కథ
- జమ్మూ డ్రోన్ దాడి: ఈ తరహా దాడులను అడ్డుకోవడానికి భారతదేశం సిద్ధంగా ఉందా?
- కోవిడ్-19: మా అమ్మను డాక్టర్లు గినియా పిగ్లా భావించి ప్రయోగాలు చేశారు
- అత్యాచారానికి గురైన ఓ అబ్బాయి కథ ఇది
- కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దుకు రెండేళ్లు: 'నాన్న ఎక్కడని అడిగితే, నా బిడ్డకు ఏమని చెప్పాలి"
- బీజేపీ నేతలపై కశ్మీర్‌లో దాడులు ఎందుకు పెరుగుతున్నాయి...
- ''ప్రజలను గౌరవించండి, మనం వారి సేవకులం'' -ఫైటర్లతో తాలిబాన్
- రోషిణి చట్టం: జమ్మూకశ్మీర్‌లో లక్షల ఎకరాల భూమి ఎలా ఆక్రమణకు గురైంది?
- 'తాలిబాన్ల రాకతో శాంతి వెల్లివిరుస్తుంది’ - పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది
- 'బుర్ఖా వేసుకుని, మారువేషంలో 11 చెక్పాయింట్లను దాటి వెళ్లా. కానీ..’
- ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా.. తాలిబాన్‌ను ఎందుకు ఓడించలేకపోయింది?
- పాకిస్తాన్ అణు పితామహుడు ఏక్యూ ఖాన్: 'ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి'?
- 'భారత అధికారుల్ని తీసుకొస్తుంటే తాలిబాన్లు చుట్టుముట్టిన వేళ..' : తెలుగు కమాండో రాజశేఖర్ స్వానుభవం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)